స్వయంకృషి పారిశ్రామికవేత్తల్లో దమానీ టాప్‌

స్వయంకృషి పారిశ్రామికవేత్తల్లో దమానీ టాప్‌– టాప్‌ 200 ఔత్సాహికవేత్తల జాబితా వెల్లడి
– ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, హురున్‌ ఇండియా రిపోర్ట్‌
హైదరాబాద్‌ : భారత్‌లో స్వయంకృషితో ఎదిగిన అగ్రశ్రేణీ పారిశ్రామికవేత్తల్లో డిమార్ట్‌ అధినేత రాధాకృష్ణ దమానీ టాప్‌లో ఉన్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రయివేటు బ్యాంకింగ్‌, హురున్‌ ఇండియా తన టాప్‌ 200 స్వయంకృషి వ్యాపారవేత్తల రెండవ ఎడిషన్‌ జాబితాను బుధవారం వెల్లడించింది. 2000 ఏడాది తర్వాత పారిశ్రామికవేత్తలను ఇందులో పరిగణనలోకి తీసుకుంది. దమానీ 44 శాతం వృద్ధితో రూ.3.4 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అగ్రశ్రేణీ స్వయంకృష్టి వ్యాపారుల్లో రెండో స్థానంలో దీపిందర్‌ గోయల్‌ (జొమాటో), మూడో స్థానంలో శ్రీహర్ష మజెటీ, నందన్‌ రెడ్డి (స్విగ్గీ), నాలుగవ స్థానంలో దీప్‌ కల్రా, రాజేష్‌ మంగోవ్‌ (మేక్‌మైట్రిప్‌), ఐదో స్థానంలో అబరు సోయి (మాక్స్‌ హెల్స్‌కేర్‌ ఇన్స్‌ట్యూట్‌) ఉన్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా పాలసీ బజార్‌కు చెందిన యాశిష్‌ డహియా, అలోక్‌ బన్సల్‌, డ్రీమ్‌11కు చెందిన భవిత్‌ శేత్‌, హర్ష జైన్‌, జెరోదా అధిపతి నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌, రాజోర్‌పేకు చెందిన హర్షిల్‌ మథూర్‌, శశాంక్‌ కుమార్‌, నైకాకు చెందిన పాల్గుని నాయర్‌ టాప్‌ 10 స్థానాల్లో నిలిచారు.