ఏసీబీకి చిక్కిన దమ్మాయిగూడ మునిసిపల్‌ కమిషనర్‌

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఒక వ్యక్తి నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మునిసిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సి.వి ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తికి ఆయన భూమికి సంబంధించిన వివరాలను సానుకూలంగా ఉన్నతాధికారులకు పంపించటానికి గానూ రూ.50 వేలను రాజమల్లయ్య డిమాండ్‌ చేశాడు. ఇందులో రూ.20 వేలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగతా సొమ్ము రూ.30 వేలను తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రాజమల్లయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్ము స్వాధీనపర్చుకొని అరెస్ట్‌ చేశారు. అనంతరం మునిసిపల్‌ కమిషనర్‌ను హైదరాబాద్‌ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.