– పట్టుకున్న డీసీఏ : అక్రమార్కులను వదలం
– కమలాసన్ రెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చివరకు మనిషికి ప్రాణం పోసే రక్తం, రక్తంలోని పదార్థాలను కూడా అక్రమ దందాకు ఉపయోగించుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసరంగా ఉపయోగపడే వాటిని తక్కువ ధరలకు సేకరించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాన్ని సీజ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూసాపేట, భవానీ నగర్‌లో నివాసిత ప్రాంతంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన హ్యూమన్ ప్లాస్మా, బ్లడ్, బ్లడ్ సీరం బ్యాగ్‌లను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని నిర్వహిస్తున్న ఆర్.రాఘవేంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాటిని హైదరాబాద్ లోని మియాపూర్‌లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫా న్యూలైఫ్ బ్లడ్ సెంటర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ధర్మపేట్, భాగ్యనగర్, ఆర్‌ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరిస్తున్నట్టు నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా 2016 నుంచి బ్లడ్ బ్యాంకుల ద్వారా 6 వేలకు పైగా యూనిట్లను సేకరించినట్టు గుర్తించారు. ఒక హ్యూమన్ ప్లాస్మా బ్యాగ్ (150 ఎంఎల్)ను బ్లడ్ బ్యాంకుల నుంచి రూ.700కు సేకరించి వాటిని రాఘవేంద్ర నాయక్ రూ.3,800కు అమ్ముకుంటున్నట్టు గుర్తించారు. అదే ప్రాంగణంలో హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్‌ఎల్, మలేరియల్ ప్యారాసైట్ టెస్ట్ కిట్ల స్టాకు ఉన్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు.