
బీజేపీ అనుసరిస్తున్న రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 26న సూర్యాపేటలో జరిగే ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండె వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పద్మశాలి భవనంలో జరిగిన సీఐటీయు ,రైతు వ్యవసాయ కార్మికసంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశ సంపదను పెట్టుబడిదారులకు,కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి,రైతులకు,కార్మికులకు,మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేస్తుందని అన్నారు.దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ సంస్థలకు అప్పజెప్పడం ద్వారా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం రైతు వ్యతిరేక మూడు చట్టాలను తీసుకురావడం చేత వేలాది మంది రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టగా వందల మంది రైతులు మరణించడం జరిగిందని, చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఆ చట్టాలను వెనుకకు తీసుకోవడం జరిగిందన్నారు. బిజెపి ప్రభుత్వం మతసామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా,మన రాజ్యాంగంలో ఉన్న విలువలను కాపాడకుండా, మతం పేరుతో రాజకీయాలను చేస్తుందని, దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.చివరకు ఉపాధి హామీ పని రోజులు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నది.అందుకే ఈ దేశ రాజ్యాంగాన్ని ,ఈ దేశ భద్రతను కాపాడాలని, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కై ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. అందుకే ఈనెల 26వ తేదీన సూర్యాపేటలో జరిగే ట్రాక్టర్ ర్యాలీకి పెద్ద ఎత్తున కదలి వచ్చి ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కందాల శంకర్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకుడు గుమ్మడవెల్లి ఉప్పలయ్య,విష్ణుమూర్తి,దేవరాజ్ ,సోమయ్య,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.