నవతెలంగాణ – కంటేశ్వర్
ఆగస్టు 14న లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్ (బిఎల్ టీయూ) మద్య జాయింట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్ బిఎల్ టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వాటర్ సప్లయ్ ,స్ట్రీట్ లైట్స్, గార్డెన్స్, ఫిల్టర్ బెడ్స్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ 19,500 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సర కాలంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద దశలవారీగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్ (బి ఎల్ టి యు) ఆధ్వర్యంలో ఆందోళనాలు నిర్వహించిన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో 30-7-2024న సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్ బిఎల్ టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ తెలియజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆగస్టు 14న లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగే సమావేశంలో సమస్య పరిష్కారానికి కృషి చేయకపోగా ఏవేవో కుంటి సాకులు చెబుతూ సమ్మె విరమించాలని కోరుతూ యూనియన్ కు లేఖ రాయడం ద్వారా సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 14న లేబర్ కమిషనర్ తో జరిగే సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.