
– ఇబ్బందులకు గురవుతున్న గ్రామాల ప్రజలు, వాహనదారులు
– పట్టించుకోని అధికార యంత్రాంగం
– జాతర సమయంలోనైనా లారీలను నిలిపివేయాలని కోరుతున్న ప్రజలు
నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలంలో ఇసుక లారీలతో ప్రమాదం పొంచుంది. మండలంలో మొత్తం ఐదు ఇసుక క్వారీలు కొనసాగుతున్నాయి. ఇందులో ముత్తారం, ఓడేడు, అడవీ శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, జిల్లల్లపల్లిలో మానేరు వద్ద ఈ ఇసుక క్వారీలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే నిత్యం మండలం నుంచి వందలాది లారీల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఇసుక లారీల వల్ల మండల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందలాది లారీలు ఇసుక తరలింపునకు రాకపోకలు కొనసాగిస్తున్న కారణంగా మండలంలోని రహాదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో పొగ మంచును తలపించే దుమ్ము, దూళి ఎగసిపడుతుంది. దీంతో గ్రామాల ప్రజలు అనారోగ్యాల భారీన పడుతున్నారు. ముఖ్యంగా శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. అంతేగాకుండా దుమ్ము, దూళి ఎగసి పడుతున్న కారణంగా వాహనదారులు రోడ్లు సరిగ్గా కనిపించక ప్రమాదాలకు సైతం గురవుతున్నారు. అంతేగాకుండా గ్రామాల్లో లారీల రాకపోకల వలన ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గతంలో ఇసుక లారీల కారణంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో ఇసుక లారీల రాకపోకల వలన మరిన్ని ప్రమాదాలు జరిగేందుకు సైతం ఆస్కారం ఉంది. మండలంలోని ప్రతి సారి లాగే ఈ సారి కూడా ఖమ్మంపల్లి, ఓడేడు, మైదంబండ గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నారు. అయితే ఈ వనదేవతల జాతరకు ప్రతి సారి లాగే మండలంతోపాటు సమీప మండలాల్లోని గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో రానున్నారు. జాతర సమయం నాలుగు రోజుల పాటు ఉండటం, నిత్యం ఇసుక లారీల రాకపోకలు కొనసాగడం వల్ల జాతర సమయంలో ప్రమాదాలు మరింత పొంచున్నాయి. వేల సంఖ్యలో భక్తుల రాకపోకల వలన ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం భారీగా జరిగే అవకాశాలు ఉండగా, ఎవరు బాధ్యత వహిస్తారంటూ గ్రామాల ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. జాతర సమయంలోనైనా ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలని, అంతేగాకుండా రోడ్లపై దుమ్ము, దూళి ఎగసి పడకుండా వాటర్ స్ప్రే చేయించాలని, ప్రమాదాలను జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామాల ప్రజలు, భక్తులు కోరారు.

ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తుల నిరసన: మండలంలోని ఇసుక క్వారీల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీల రాకపోకల కారణంగా దుమ్ము, దూళి ఎగసి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ మండలంలోని దరియాపూర్ గ్రామ ప్రజలు శనివారం నిరసనకు దిగారు. ఇసుక లారీలను అడ్డుకొని, రోడ్డు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వందలాది లారీల్లో ఇసుక తరలిస్తూ ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్న ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ము, దూళి ఎగసి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అనారోగ్యాలకు గురవుతున్నామని అన్నారు. దుమ్ము, దూళి ఎగిసి పడకుండా నిత్యం లారీలు వెళ్లే మార్గంలో వాటర్ స్ప్రే చేయించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వందలాది ఇసుక లారీలు నిలిచిపోయాయి.