ప్రమాదకరంగా ‘భగీరథ’ మరమ్మతు పనుల గుంతలు

Khammam,Navatelangana,Telugu News,Telangana.– పది రోజులుగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ-బోనకల్‌
మిషన్‌ భగీరథ పైపులు పగిలిపోవటంతో మరమ్మత్తుల కోసం పది రోజుల క్రితం అధికారులు గుంటలు తీసి వదిలేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు తీసి వదిలేయటం వలన గత వారం రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని సీతానగరం గ్రామంలోనే రైస్‌ మిల్‌ సమీపంలో మిషన్‌ భగీరథ పైప్‌ లైన్ల సమస్య ఏర్పడింది. దీంతో గ్రామానికి మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఇందుకోసం పది అడుగుల పొడవు, వెడల్పు వరకు గుంతలు తీశారు. మరమ్మత్తు పనులు అనంతరం గుంతలను పూడ్చకుండా వదిలేసి వెళ్లారు. దీంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన వర్షపు నీరు ఆ గుంతలలో చేరి మిషన్‌ భగీరథ నీటితోపాటు మురికి నీరు కూడా సరఫరా అవుతున్నాయి. మిషన్‌ భగీరథ మురికి నీటితో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెద్దగా గుంతలు తీయటం వలన, ఆ గుంతలు రోడ్డు పక్కనే ఉండటం వలన ప్రమాదకరంగా మారాయి. ఈ విషయంపై తాము అధికారుల దష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామ మాజీ ఉపసర్పంచ్‌ మేకల శరత్‌ బాబు, గ్రామస్తులు తెలిపారు. రేపు మాపు అంటూ ప్రతిరోజు వాయిదాలు వేస్తున్నారని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో ఆ గుంతలు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు.