ప్రమాదకరంగా రహదారులు

Dangerous roads– అయ్యగారిపల్లి రోడ్డు అధ్వానం
– భారీ గుంతలు, నిలిచిన వర్షపు నీరు
– వాహనదారులు, ప్రయాణికుల రాకపోకలు నరకప్రాయం
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-ముదిగొండ
మండల కేంద్రమైన ముదిగొండ నుండి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రహదారులపై పలుచోట్ల గుంతలు పడి వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ప్రయాణించాలంటేనే చింతపడుతున్నారు. గ్రామాలలో అంతర్గత రహదారులు బురద మయంగా మారాయి. గత నాలుగు రోజుల నుండి పడుతున్న సన్నటి వర్షపు నీరుకు గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ రొచ్చురొచ్చుగా ఉండటంతో స్థానికులు నడవాలంటేనే నరకప్రాయంతో వేదన పడుతున్నారు. మండలంలో ప్రధానంగా చిరుమర్రి, సువర్ణాపురం, అయ్యగారిపల్లి, గంధసిరి, పమ్మి, ముదిగొండ, న్యూక్ష్మీపురం, మల్లన్నపాలెం తదితర గ్రామాల్లో అంతర్గత రోడ్లు దెబ్బతిని ధ్వంసమయ్యాయి. పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేక అధికారులను ప్రారంభమై నేటికి ఆరు నెలలు కావస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవటంతో పంచాయతీలలో పాలన నడపటం కష్టమైపోయింది. పాలన గాడిదప్పి పల్లెలు వెలవెలబోతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక చెత్త ట్రాక్టర్‌ నడపటం, కరెంటు బిల్లులు కష్టాలు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు నెల నెల ఇవ్వలేక పెండింగ్లో పెడుతున్నారు. మండలంలోని 25 గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు గత మూడు నెలల నుండి జీతాలు లేక అలమటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని నిధులు విడుదలకే జీవో జారీ చేసింది. గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తున్నప్పటికీ, ఆ అధికారులు గ్రామాల్లో కనిపించకపోవడం విశేషం. పంచాయతీ కార్యదర్శులపై భారం మోపి, ప్రత్యేక అధికారులు బాధ్యతలు విస్మరించి గ్రామాల్లో సందర్శించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అయ్యగారిపల్లి నుండి వల్లభి వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో వాహనాలపై ప్రయాణించే వాహనదారులు రోడ్డుపై కిందపడి దెబ్బలు తగిలించుకున్న సంఘటనలు ఎన్నో.. అంతేకాకుండా ముదిగొండ నుండి ఖమ్మం వెళ్లే పారిశ్రామిక ప్రాంత రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతిని వాహనాలు, ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. దీనికి తోడు గంధసిరి, పెద్దమండవ మున్నేరు నుండి అక్రమ ఇసుక ట్రాక్టర్లు అధికంగా తిరగటంతో అయ్యగారిపల్లి, గంధసిరి రహదారులు ప్రయాణానికి వీలు లేకుండా పూర్తిగా దెబ్బతిన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని మండల వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతి అధికారులు చొరవ తీసుకొని ధ్వంసమైన రోడ్లను మరమ్మత్తులు చేయించాలని వాహనదారులు, ప్రయాణికులు, మండల వాసులు కోరుతున్నారు.