దరి చేరని ధరణి స్పెషల్‌ డ్రైవ్‌

Dari Cherani Dharani Special Drive– మొత్తం దరఖాస్తులు 2.45 లక్షలు
– ఇప్పటి వరకు లక్షా 20 వేల ఫైళ్ల పరిశీలన
– మొక్కుబడిగా నివేదికలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు
– మళ్లీ సమస్యలు తలెత్తుతాయని అనుమానాలు
– పోర్టల్‌లో ఇంకా నమోదు కాని సవరణలు
– అధికారాల బదలాయింపుపై పీటముడి
– చరిత్ర పునరావృతమౌతుందని సర్వత్రా ఆందోళన
భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెండో విడత స్పెషల్‌ డ్రైవ్‌ మొక్కుబడిగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో తూతూ మంత్రంగా విచారణ చేసి నివేదికలను తయారు చేస్తున్నారు. మొత్తం 2.45 లక్షల దరఖాస్తులకు గాను మొదటి విడతలో లక్ష , రెండవ విడతలో ఇప్పటి వరకు 20 వేల వరకు ఫైళ్లను పరిశీలించి నివేదికలు తయారు చేశామని అధికారులు అంటున్నారు.. అయితే అందులో ఒక్క ఆర్జీ కూడా ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాలేదు. గత సర్కార్‌ హయాంలో గందగోళంగా నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళనను అధికారులు మరిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పకడ్బందిగా విచారణ చేయకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఓ రైతు 2022లో తన తండ్రి పేరున మూడు సర్వే నెంబర్లుగా ఉన్న రెండెకరాల వ్యవసాయభూమిని విరాసత్‌ కోసం దరఖాస్తు చేశారు. డబ్బుల కోసం విచారణ, నివేదిక అంటూ ఆర్నెల్లు ఆఫీస్‌ చుట్టూ తిప్పారు. బాదిత రైతు సంబధిత అధికారులపై ఒత్తిడి తేవడంతో నాలా ఫీజు కట్టించుకుని వ్యవసాయ భూమిని నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌గా మార్చి విరాసత్‌ చేశారు. విషయం తెలుసుకున్న రైతు లబోదిబోమంటూ చెప్పులరిగేలా తహసిల్దార్‌ ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడితే తిరిగి వ్యవసాయ భూమిగా మార్చారు. నాలా కన్వర్షన్‌ సమయంలో ఆ భూమిని అర్బన్‌ సీలింగ్‌ ల్యాండ్‌ మాడ్యూల్లోకి మార్చడంతో దానికి రైతు బంధు, రైతు భీమా లాంటి ప్రభుత్వ సర్కార్‌ పథకాలు అమలు కావడం లేదు. రెండేండ్లుగా సర్కార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి అవకతవకలకు పరిష్కారం ధరణి తర్వాత క్లిష్టంగా మారింది. వీటి పరిష్కారాలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కలెక్టర్‌, సీసీఎల్‌ఏ స్థాయిలో కేంద్రీకృతం చేసింది, ఫలితంగా మూడేండ్లలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ధరణి పోర్టల్‌లో 1 నుంచి 33 వరకున్న టెక్నికల్‌ మాడ్యూల్స్‌లో 2.45 లక్షల దరఖాస్తులు పేరుకు పోయాయి. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారం కోసం సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నేతృత్వంతో కమిటీని నియమించింది. అదే సందర్భంలో చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌, సీసీఎల్‌ఏ వద్ద ఉన్న ధరణి అధికారాలను తహసిల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు బదలాయిస్తూ ఈ నెల 1 నుంచి 9 వరకు మొదటి విడత, అనంతరం 11 నుంచి 17 వరకు రెండో విడత స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో అయితే టార్గెట్‌ పూర్తి చేసేందుకు కార్యాలయాల్లో కూర్చుని ఫైళ్లను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో విచారణ చేయ కుండా ఇష్టానుసారంగా నివేదికలు తయారు చేస్తున్నారు. భూమి కి సంబంధించిన ఒక ఆర్జీని పరిష్క రించాలంటే ఆ భూమి చుట్టూ ఉన్న రైతుల నుంచి వాంగ్మూలంతో పాటు వారి అభ్యంతరాలను నమోదు చేయాలి. ఆ తరహాలో విచారణ చేపట్టకుండానే ఫైళ్లు పూర్తవుతున్నాయని తెలుస్తోంది. స్పెషల్‌ డ్రైవ్‌లో ఇన్ని సమస్యలను పరిష్కరించామని చెప్పుకునేందుకు చేస్తున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయని నిపుణులంటున్నారు.
ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కాని దరఖాస్తులు
స్పెషల్‌ డ్రైవ్‌లో ఆధార్‌లో తప్పులు, ఆధార్‌ లేక పోవడం, పాస్‌బుక్‌లో పేరు కరెక్షన్‌ మొదలగు 20కి పైగా సమస్యలను తహసీల్దారు నుంచి సీసీఎల్‌ఏ వరకు లక్షకు పైగా సమస్యలను పరిష్కరించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా అన్‌లైన్‌లో నమోదు కాలేదు. పోర్టల్‌లోని 33 మాడ్యూల్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించి లాగిన్‌లు సీసీఎల్‌ వద్ద మాత్రమే ఉన్నాయి. సమస్యను పరిష్కరించినట్టుగా అన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసే అధీకృత లాగిన్లు ఎంఆర్వో, ఆర్డీతో, అదనపు కలెక్టర్ల వద్ద లేవు. దాంతో ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తును కూడా పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయలేదు. లాగిన్లను కింది స్థాయి అధికారులకు బదలాయించేందుకు పోర్టల్‌ యాజమాన్యం తిరకాసులు పెడుతోంది. సాంకేతికంగా ఉన్న సమస్యలను అధిగమించలేక చిక్కుముడుల్ని పైకి తెస్తుందని తెలుస్తోంది.
పోర్టల్‌ భద్రతపై ఆందోళన
ధరణి పోర్టల్‌ను మొదట సత్యం కంప్యూటర్స్‌ రామ లింగరాజు కుటుంబీకులకు చెందిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ దివాళా తీయడంతో టెర్రాస్‌కు ఆ తర్వాత విదేశీ కంపెనీ అయిన క్వాంటెల్లాకు అప్పగించారు. ధరణి ఆన్‌లైన్‌లో నమోదైన భూముల వివరాలు, యజమానుల పేర్లు, ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థలకు సంబంధించిన సమాచారం విదేశీ కంపెనీ చేతిలోకి వెలితే భద్రంగా ఉంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల క్వాంటెల్లా కాంట్రాక్ట్‌ గడువు తీరినా కొత్త టెండర్లు పిలవకుండా తిరిగి ఆ కంపెనీకే అప్పగించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మాన్యువల్‌ రికార్డులు లేకపోవడంతో ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు రావచ్చని తెలుస్తోంది. ఒకరి భూమి మరో వ్యక్తిపై నమోదై పట్టాదారు పాస్‌ పుస్తకం పొందితే, ఆ పాస్‌పుస్తకాన్ని రద్దు చేసే అధికారం ఏ అధికారికీ లేదు. బాధితుడు కేవలం కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది.
ధరణి తర్వాత పెరిగిన సమస్యలు
ధరణికి తర్వాత సమస్యలు మరిన్ని పెరిగాయి. పోర్టల్‌ అమల్లోకి రాకముందు 75 రకాల భూ సమస్యలుంటే, ధరణి వచ్చాక ఆ సంఖ్య 130కి పెరిగిందని భూ సమస్యల పరిశీలకులు పేర్కొంటున్నారు. పోర్టల్‌లో ఉన్న 33 మాడ్యూళ్లలో 2.45 లక్షల దరఖాస్తులతో పాటు 1.8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు,(డీఎస్‌) కోసం భూ యాజమాను లు ఎదురుచూస్తున్నారు. ఇవే కాక సాదాబైనామా కోసం 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా పరిష్కా రానికి ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం అవకాశం లేదు. అమల్లోకి తెచ్చిన ఆర్వోఆర్‌-2020 చట్టంలో చిన్న పాటి సవరణ చేస్తే సాదాబైనామా కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది బాధితుల దరఖాస్తులకు విముక్తి కలుగుతుంది.
కొత్త దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
కొత్త దరఖాస్తులపై పెట్టిన నిషేదాన్ని వెంటనే ఎత్తివేసి ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించాలి. ధరణి తర్వాత 16,57,407 భూ సమస్యలపై దరఖాస్తు లు రాగా గత సర్కార్‌ 5,37,282 దరఖాస్తులను పరిష్క రించి, 5,37,984 దరఖాస్తులను తిరస్కరించింది. పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. గత సర్కార్‌ హయాంలో నిజమైన సమస్యలను సైతం టార్గెట్‌ కోసం అధికారులు తిరస్కరించారు. వాటిని సమీక్షించి స్పెషల్‌ డ్రైవ్‌లో పరిష్కరించాలి. రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటె సమగ్ర భూ సర్వే నిర్వహించాలి. 1940లో నిర్వహించిన సమగ్ర భూ సర్వే తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సర్వే జరగలేదు టి.సాగర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం