దాశరథి కవిత్వ దృక్పథం

Dasharathi's poetic perspective”వ్రాసివ్రాసి పొత్తమ్ములు మాసినా కలమ్ములో సిరాయింకి, రక్తమ్ము పోసి అరుణతారుణాక్షరాల పద్యాలు కూర్చి ఆకలికి మాడిపోయెద, నీ కొరకయి” (అగ్నిధార: ఉస్సురనెదవు –  పు 69) హైదరాబాద్‌ చార్మినార్‌ దగ్గర పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికురాలి శ్రమను చూసి అభ్యుదయ కవి చెప్పిన పద్యమిది.
అభ్యుదయ కవిత్వం ఎవరి పక్షమో ఈ పద్యం చెప్పకనే చెబుతున్నది. ప్రాచీనకాలంలో గానీ, ఆధునిక కాలంలో గానీ కవిత్వం మీద కవిత్వం చెప్పని తెలుగు కవులు చాలా తక్కువ. కొత్త సామాజిక సందర్భం ఏర్పడిన ఉదంతం తెలుగు కవులు కవిత్వాన్ని పునర్నిర్వచిస్తూ వస్తున్నారు. అది అనివార్యం. అభ్యుదయ కవిత్వం మొదలయినాక, అనేకమంది అభ్యుదయ కవులు కవిత్వం గురించి అసంఖ్యాక కవితలు రాశారు. వారిలో డా||దాశరథి కృష్ణమాచారి ఒకరు. ఆయన 1937 నుండి 1987లో మరణించే దాకా కవిత్వం రాశారు. ఆయన రచించిన వందల కొలది కవితల్లో కనీసం ముప్పై కవితలు కవిత్వం గురించి రాశారు. అవి ఆయన కవిత్వ దృక్పథానికి దర్పణాలు. అగ్నిధార (1949), రుద్రవీణ (1950), పునర్నవం (1961), కవితాపుష్పకం (1966) కావ్యాలలో ఎక్కువగాను, తక్కిన కావ్యాలలో పరిమితంగానూ దాశరథి కవిత్వ కవితలు రాశారు. ఆయన కవితలలో భావ, అభ్యుదయ కవితలు కలిసి వుంటాయి. ఆయన కవిత్వ కవితలలోనూ ఆ మిశ్రమ లక్షణం కనిపిస్తుంది.
తొలినాళ్లలో భావ కవిత్వ ప్రభావంతో దాశరథి రాసిన కవిత్వ కవితలలో ‘వాసంతిక’ ఒకటి.
”నీ నునుబుగ్గలందు రమణీ! అరుణారుణ బాలభానుతే/ లానటనార్ధియై ఉదయ రాగమునన్‌ పరువెత్తివచ్చు? ప్ర/ స్థానిత తీక్షతన్‌ చెలగి తాండవమాడును? నాకలంపు వి/ న్నాణముతో రచింతులలనా! నునుచెస్కులపై నికావుముల్‌”
వసంతం అనే యువతితో కవి సంభాషణ చేసిన పద్యమిది. ఆయన ఆమెను అడిగాడు. ఆమె లేత బుగ్గలమీద ఉదయించిన సూర్యుడు నటన చేయడం కోసం ఎందుకు పరుగెత్తి వస్తున్నాడు? ఎందుకు పరుగెడుతూ, ఎందుకు నాట్యం చేస్తున్నాడు? నేను నాదల నైపుణ్యంతో నీ నును చెక్కిలి మీద కావ్యాలు రాస్తాను అని కవి చెప్పాడు. కవి, రవి ఇద్దరూ ఒక్కడే. రవి ఆమె చెక్కిలిమీద తన కిరణాలతో నాట్యం చేస్తాడు. కవి తన కలంతో కవితలల్లుతాడు. కవి తన కలానికి సూర్య కిరణాలకు సమన్వయం చేశాడు. ఆమె లేత బుగ్గలమీద సూర్య కిరణాల నాట్యం కన్నా, తన కలం రాసే కావ్యాలే మిన్న అని ప్రకటించారు. ‘మహాలేఖిని’ అన్నది మరో భావ కవిత్వ కవిత. కవి తన కలంతో చేసిన సంభాషణ ఈ కవిత. కవిత్వం ఆవేశ కళ. భావ కవిత్వం మరీ ఆవేశ కళ. భావ కవులకు తన్మయత్వం ఎక్కువ. దాశరథి భావకవిగా చాలాచోట్ల ఆ తన్మయత్వాన్ని ప్రకటించారు. తన కలంతో ఆయన చేసిన సంభాషణ ఇది.
”త్వరపడు! భావసాగరము బాహువు లెత్తుచు నీ శిరస్సుపై/ పొరలుచు వచ్చుచున్నది; కవుంగిలిలో కవితాకుమారి సం/ బరపడి నవ్వుచున్నది; గబా గబ కూర్చుము పద్యరాశి; అ/ ర్థ రహితమంచు పల్కెడి కళా రహితున్‌ పడితోసి సాగుమా!”
భావం అనే సముద్రం పొంగి వచ్చి నీ తల మీద తన చేతులతో నీపైకి వస్తున్నది. కౌగిలింతలో కవితాకుమారి సంబరంతో నవ్వుతున్నది. నువ్వు త్వరత్వరగా పద్యాలను లిఖించు. ఎవరైనా అర్థరహితంగా వుందని విమర్శిస్తే వారిని పక్కకు నెట్టి నువ్వు రాసుకుంటూ వెళ్లు అని కవి తన లేఖినిని కోరారు. ఈ పద్యం కవిత్వం పుట్టుకనూ చెబుతున్నది.
”నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనొ; అందాక ఈ/ భూగోళమ్మున అగ్గిపెట్టెదను; నిప్పుల్‌ వోసి హేమంత భా/ మా గాంధర్వ వివాహ మాడెదను; ద్యోమణ్యుష్ణ గోళమ్ముపై/ ప్రాగాకాశ నవారుణాస్ర జలధారల్‌ చల్లి చల్లార్చెదన్‌.”
తన కవిత్వంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో, అంత దూరం ఈ భూగోళాన్ని కాల్చేస్తాను. నిప్పులు చిందించి హిమం అనే స్త్రీని గాంధర్వ వివాహం చేసుకుంటాను. తూర్పున ఉదయించిన సూర్యుని ఎర్ర కిరణాల ధారలు చల్లి చల్లార్చుతాను. వేడి, చల్లదనం విరుద్ధ గుణాలు. తన కవితాశక్తితో కవి ఉష్ణాన్ని రగిలించి చల్లార్చగలను అని ప్రకటించారు. కవి శక్తి అంతటిదని ఆయన అభిప్రాయం.
భావకవిగా ఇలాంటి మధురభావాలు కవిత్వం గురించి చెప్పి అభ్యుదయ కవిగా ఈ నాటికీ ప్రాసంగించగల అనేక కవిత్వ సూత్రాలు అందించారు. ‘అగ్నిధార’లోనూ దాశరథి సమాజంలో రక్తానికీ, ప్రాణానికీ, శ్రమకూ, సౌజన్యానికీ, శ్రామికునికి, రచయితకూ విలువలేదు అని గుర్తించారు. అదే సమయంలో ‘నిరుపేద’ అనే కవితలోనే కవి కడుపేదలవైపు నిలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
”నిరుపేదా! నేను కూడ/ నీకోసం ఆకలితో/ చచ్చేనా!
నాకలాన్ని రూకలకై/ అమ్ముకొచ్చేనా?”
అని అడుగుతూ ‘దివ్యనవ్య భవితవ్యానికి’ నిరీక్షించమని కోరారు.
‘అగ్నిధార’ కావ్యంలోనే దాశరథి యువకులతో పాటు రచయితల్ని కూడా నవ సమాజ నిర్మాతలుగా ప్రకటించారు.
”నవభారత యువకులారా!/ కవులారా! కథకులారా!/ భవితవ్యపు హవనానికి హోతలు;/ నూతన భూతల నిర్మాతలు మీరే, మీరే” (అనలదాహం)
‘రుద్రవీణ’ కావ్యంలో సమ్మె జేసే కార్మికులనుద్దేశించి వాళ్ల కోసం కవిత్వం రాస్తానని ప్రకటించారు.
”గొంతుకలెండి డొక్కలకు కొంచెము గంజియు లేకపోయినన్‌/ పంతము నిగ్గగావలెను; ప్రాణము పోయినగూడ సమ్మెగా/ వింతు మాటంచు ఆకట తపించెడి పేదలగూడ్చి నేనుమ్రో/ గింతును రుద్రవీణ; పలికింతును విప్లవగీతికావళుల్‌” (మూర్చే)
ఇలాంటి పద్యాలన్నీ దాశరథి అభ్యుదయ కవిగా తనను తాను నిర్వచించుకోవడాన్ని సూచిస్తాయి. తను ఎటువైపో కవి ప్రకటించుకోవడాన్ని ధ్వనిస్తాయి.
‘మహాంద్రోదయం’ కావ్యంలో దాశరథి తెలంగాణ అనే నాలుగు భిన్న పద్యాల కవిత రాశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిబద్దుడు, నిమగ్నుడు అయిన దాశరథి, ఆ ఉద్యమంతో కవిగా తనను తాను భాగస్వామిగా ప్రకటించుకున్నారు.
”మూగవోయిన కోటితమ్ముల గళాల/ పాట పలికించి కవితాజవమ్ముకూర్చి/ నా కలానికి బలమిచ్చి నడిపినట్టి/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ”
ఒక ప్రజా ఉద్యమం కవిని ఎలా కదలించి తనలో కలుపుకుంటుందో ఈ పద్యం సూచిస్తుంది.
‘పునర్నవం’ కావ్యంలో కవిత్వ రచనకు సంబంధించి అనేక విషయాలు పేర్కొన్నారు దాశరథి. కవితలల్లడం అబద్దాలాడినంత సులభం కాదు అన్నారు. అంటే కవిత్వం కేవలం ఊహకాదని అర్థం. కవిత్వానికి వాస్తవికత పునాది అని ఆయన అభిప్రాయం.
”దూరాన పొడిగాలి దిబ్బలకు/ తునాతునకలైపోయిన ఆకులతో/ ముసలిమొహం పడిన వృక్షం మీద/ యౌవనం చిగురించడం కవిత్వం/ రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం”
కవిత్వం నిరంతరం సృజనాత్మకంగా వుండాలని, కవిత నిరంతరం కొత్తదనంతో అలలరారాలని కవి అభిప్రాయం. అభ్యుదయకవి మానవ సంబంధాలలో ధనాధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. అభ్యుదయ కవులు పెట్టుబడిదారీ వ్వవస్థకు వ్యతిరేకులు. అందుకే దాశరథి ”రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందిట” అనే కవిత రాశారు.
”కవి మాటకు విలువనిచ్చి/ కలహం మాట నశిస్తుంది/ రూపాయికి విలువలేని/ రోజు రేపు వస్తుంది” అన్నది ఆయన ధీమా. అయితే ఆయన అభిలాష ఇంకా నెరవేరవలసే వుంది.
‘కవితాపుష్పకం’ పేరుతో రాసిన కవితలో దాశరథి తన కవిత్వ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రకటించారు. 1966 నాటికి దిగంబర కవిత్వం వస్తున్నది. మరోవైపు కొందరు మార్మిక కవులూ వున్నారు. విప్లవ సాహిత్యం పురుడు పోసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో కావచ్చు దాశరథి ”చంద్రుడి భాష మాట్లాడింది, అందరికీ ఆ భాష అర్థమవుతుంది” అని కవులకు విజ్ఞప్తి చేశారు.
”ద్వేషాలు కలిగించే భాష మనకు వద్దు/ ప్రేమను రేకెత్తించే కోమల భాష మనకు కావాలి” అని ప్రభోదించారు. అప్పటికే ఆయనలో జాతీయ భావాలు, సమైక్య వాద భావాలు బలంగా నాటుకొని వున్నాయి. అందుకే
”మన దేశంలోని అన్ని భాషలూ నావి/ నాకర్ధమయినా, నావికాకున్నా నావి” అని ప్రకటించారు. అంతేకాదు, తనను తాను విస్తృతపరచుకుంటూ
”మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష
మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు” అని ఒక విశాల దృక్పథాన్ని ప్రతిపాదించారు. తెలుగు, ఉర్దూ తనకు రెండు కళ్లు అని చెప్పారు. ఆ రెండు భాషలలో ఎన్ని భావాలైనా చదవగలనని అన్నారు.
”హృదయం ఒకటైతే లోకమంతా ఒకటి” అని విశ్వజనీన భావనను వ్యక్తం చేశారు. కంబరు, కబీరు కలిసి కవిత్వం చదువుతారని, ప్రాంతాలు, సంకుచితత్వాన్ని వ్యతిరేకించారు. ”ప్రతి హృదయంలో రోజూ అఖిలభారత కవి సమ్మేళనం జరగాల”ని ఆకాంక్షించారు.
1975 నాటి ‘తిమిరంతో సమరం’లో కత్తికంటే కలం గొప్పది” అని ప్రకటించారు. 1984 నాటి ‘జ్వాలాలేఖిని’ లో దాశరథి ‘కవితా నా సంపద’ అని ప్రకటించారు.
”అంధకార నిశ్శబ్దారణ్యాలలో/ ఆరని కాగడాలతో నడిచే కవిని నేను” అంటూ కవికి వుండవలసిన సామాజిక చైతన్య స్పృహను సూచించారు.
బాలగంగాధర తిలక్‌లాగే, దాశరథి కూడా భావాభ్యుదయ కవి. చాలాకాలం ఆ రెండింటినీ మేళవించి రాశారు. క్రమంగా భావ కవిత్వ తాకిడిని తగ్గించుకుని అభ్యుదయ మార్గంవైపు ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమా పాటలలో సైతం ‘ఆవేదన కలగాలి, ఆవేశం రావాలి’ వంటివి రాశారు. దాశరథి నిలువెల్లా కవి. పోరాట కవి, ఉద్యమ కవి. ఆయన కవిత్వ కవితలలో ఆ లక్షణం ప్రస్పుటంగా కనిపిస్తుంది.
నేను దాశరథి గారిని 1967 – 68 ప్రాంతాలలో చిత్తూరు జిల్లా రచయితల సంఘం వారు చిత్తూరులో నిర్వహించిన జిల్లా మహాసభలలలో చూశాను. ఆధునిక కవిత్వం అంటే ఏమిటో వివరించారు. నేను అప్పుడు బి.ఏ చదువుతున్నాను. ”ఇక్కడ నుంచి బాకు విసిరితే, అది నిజాంరాజు గుండెల్లో గుచ్చుకోవాలి. అది ఆధునికత” అన్నారు. అది నాకు బాగా గుర్తుంది. తర్వాత సాహిత్య చరిత్ర చదువుతున్న సమయంలో దాశరథి పోరాట జీవితం తెలిసింది. ఆయన శతజయంతి సందర్భంగా …
”ఉప్పునీళ్ల ఉరధిని తాగేసి/ గొప్ప గొప్ప మేఘాల్ని వర్షించి/ అమృత జలధారల్ని వర్షించే/ అర్కుడు నిజానికి అసలైన కవి” (కలీనం కవికి).
(దాశరథి శతజయంతి సంవత్సరం)
– రాచపాళెం చంద్రశేఖరరెడ్డి