కోడళ్లే కూతుళ్లు

Daughters-in-law are daughtersహైద్రాబాద్‌ సెంటర్‌ లో మూడువందల గజాల స్థలంలో మూడు పడకగదులు, వంటిల్లు, సిట్‌ ఔట్‌, విశాలంగా వుండే పెద్ద హాలు అన్ని వసతులతో, నూతన హంగులతో వుండే విధంగా కట్టుకున్న ఇంట్లో వెంకటరావు, పద్మావతి వుంటున్నారు. వెంకటరావు విద్యుత్‌ సౌధలో పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, అనఘ్‌, ఆదిత్య.
పిల్లలు బాగానే చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ బుద్ధిమంతులు. పెద్దలంటే గౌరవం, తల్లిదండ్రులంటే ప్రేమ. మంచి సంస్కారం గల పిల్లలు. ఏదైనా తల్లిదండ్రుల పెంపకంలోనే ఉంటుంది.
వెంకటరావు ఆఫీసునుండి వచ్చాక టీ తాగి కొద్దిగా ఉన్న స్థలంలో కొన్ని పూల చెట్లు, కూరగాయల చెట్లు ఉన్న వైపు వెళ్లి చెట్లకు నీళ్లు పోస్తాడు. కొద్దిగా గార్డెన్‌ లాగా కూడా ఉంది. కుర్చీ వేసుకుని ఏవో పుస్తకాలు చదువుకుంటాడు కాసేపు.
మొక్కలకు నీళ్లు పోస్తుంటే వచ్చింది భార్య పద్మావతి. ఏమండీ మీరు ఆఫీసుకు వెళ్ళాక మీ చిన్ననాటి స్నేహితుడట వచ్చాడు. హైదరాబాద్‌లో ఏదో పని ఉందట. వచ్చి అలాగే మిమ్మల్ని కలవొచ్చు, చూడక చాలా ఏండ్లయ్యింది అని అన్నాడు. మా వారు ఆఫీసుకు వెళ్లారని చెప్పగా కాసేపు కూచొని టీ తాగి నేను పని చూసుకుని సాయంకాలం వచ్చి కలుస్తాను అన్నాడు అని అంది.
ఈలోపుగా స్నేహితుడు రానే వచ్చాడు.
రారా శ్రీను. అబ్బ ఎన్ని ఏండ్లయిందిరా చూసి. పెద్దాడివి అయిపోయావురా. జుట్టు నెరిసింది. వయసు మీద పడ్డ గుర్తు తెలుస్తుంది అన్నాడు వెంకటరావు.
అవునురా వెంకట్‌ నువ్వు కూడా చాలా మారిపోయావురా అన్నాడు శ్రీను.
కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ చిన్నప్పటి విషయాలు నెమరేస్తూనే అవును మీ పిల్లలు ఏమి చేస్తున్నారురా అని అడిగాడు వెంకట్‌.
నాకు ఇద్దరమ్మాయిలు వాళ్ళు బి.టెక్‌ పాసయి సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చేస్తున్నారు ఆనాడు శీను.
అవునా అంత పెద్దగయ్యారా అప్పుడే. ఎప్పుడో చిన్నగున్నప్పుడు చూశాను అన్నాడు వెంకట్‌.
మీ పిల్లలు ఏమి చేస్తున్నారని అడిగాడు శ్రీను.
ఇద్దరరబ్బాయిలని తెలుసుకదరా. వాళ్లిద్దరు బి.టెక్‌ చేసి ఇక్కడ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నారు.
మంచి సంబంధాలు వస్తే పెళ్లి చేద్దామనుకుంటున్నాం అన్నాడు వెంకట్‌.
మేము మా అమ్మాయిలకు చేద్దామని చూస్తున్నాం. తెలిసిన వాళ్ళైతే మంచిది గదా. పిల్లలు నచ్చితే చూద్దామా అన్నాడు శీను.
అంతకంటే ఏం కావాలిరా. చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళం. కుదిరితే అదృష్టం కదరా అన్నాడు వెంకట్‌.
భార్యను పిలిచాడు… పద్మావతి ఇటు రా. నీకో గుడ్‌ న్యూస్‌ చెప్పాలి అనగానే ఏంటండీ? అంటూ పరుగెత్తుకుని వచ్చింది.
వీడికి ఇద్దరమ్మాయిలున్నారు. వాళ్ళు మన అబ్బాయిల్లాగానే బి.టెక్‌.చదివి, ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. మన పిల్లలకు తగిన ఈడు జోడు అని అన్నాడు.
సరే మంచిదండి. మనకు తెలిసిన వాళ్ళయితే మనకు వాళ్లకు మంచిదే. ఇవాళ రేపు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. పెళ్లి కాగానే కాపురాలు కూడా సరిగా చేయడం లేదు. ప్రేమలని మోసపోవడం కూడా జరుగుతుంది.
సరే అన్నయ్యగారు పిల్లలను చూసి వాళ్ళతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం అన్నది పద్మావతి.
సరే వెళ్తాను చాలా ఆలస్యమైంది అంటూ లేచాడు శ్రీను.
జాతకాల డీటెయిల్స్‌ పంపరా అన్నాడు వెంకట్‌.
సరే అని సెలవు తీసుకుని బయలు దేరాడు.
ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడు శ్రీను. భార్య సంతోషించిది. మీ స్నేహితులు మళ్ళీ ఒకటవ్వబోతున్నారన్న మాట అని అన్నది.
వాట్సాప్‌లో జాతకాలు పంపించాడు శ్రీను.
బ్రాహ్మణునికి చూపించారు జాతకాలు. వీరి అదృష్టమేమో కానీ జాతకాలు కలిశాయి.
రాసిపెట్టి ఉంటే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఓకే అని గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు.
ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే పందిట్లో ఇద్దరికి ఒకేసారి పెళ్లి అయింది అంగరంగ వైభవంగా. ఒకే ఇంట్లో ఇద్దరమ్మాయిలు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.
అబ్బాయిలు, కోడళ్ళు, అత్తగారు, మామగారు కలిసి ఒకే ఇంట్లో ఆనందంగా కలిసి మెలసి వుంటున్నారు. అత్తగారు, మామగారు కోడళ్లను కూతుళ్ళ లాగా చూస్తారు. కోడళ్ల్లు కూడా వాళ్ళ అమ్మ నాన్నలలాగానే చూస్తారు.
వీళ్ళ కుటుంబాన్ని చూస్తే అందరికి కన్నుకుట్టు. ఈ కాలంలో ఇంత అన్యోన్యంగా, అరమరికలు లేకుండా ఎవరుంటారు. వీళ్ళ అదృష్టమే అదృష్టం అని అంటారు.
ఆనందంగా సాగుతుంది సంసారం. పిల్లలకు పిల్లలు పుట్టారు. పెద్దవాడికి కూతురు, చిన్నవాడికి బాబు. వాళ్ళు ఆటపాటలతో హాయిగా వుంటున్నారు.
వెంకట్‌ ఉద్యోగం నుండి విరమణ పొందాడు. మనవడు, మనవరాలే లోకం. ఏనుగమ్మ ఏనుగు అంటూ పిల్లలతో పిల్లాడై ఆడుతుంటాడు తాత. కథలు చెప్తాడు. పాటలు నేర్పిస్తాడు. దేవుని శ్లోకాలు చెప్తాడు. పిల్లలకు తాతయ్య అంటే చాలా ఇష్టం. పెంచుకున్న మొక్కలకు నీళ్లు పోస్తారు. పూలు తెంపి దేవుని పూజకు వినియోగిస్తారు. అలా ఆనందంగా రోజులు గడుస్తున్నాయి.
తెల్లవారి లేచాడు. స్నానం చేసి దేవుని పూజ చేసుకున్నాడు. నుదుట బొట్టు, విభూతి రేఖలతో కళకళలాడుతున్న ముఖం. మంచి వర్చసు. టిఫిన్‌ చేసి కూచున్నాడు. గుండెలో తీవ్రమైన నొప్పి భరించలేక పోతున్నాడు. ఒళ్ళంతా చెమటలు, నోటమాట పెగలడం లేదు. ఎవరి పనిలో వారున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. కోడళ్ళు, కొడుకులు ఉద్యోగాలకు వెళ్లారు. పద్మావతి వంట గదిలో వంటచేస్తుంది. చాలా సేపయిది. మధ్య మధ్య టీ తాగడం అలవాటు వెంకట్‌ కు. టీ తీసుకుని వచ్చింది పద్మావతి. కుప్పకూలిన భర్తను చూసి ఏం చేయాలో తోచక ఏడుస్తూ పెద్దబ్బాయి అనఘ్‌కు ఫోన్‌ చేసింది. ఎప్పుడు లేంది నాన్న పడిపోయారురా అంటూ ఏడుస్తూనే ఉంది. ఇప్పుడే వస్తానమ్మా అంటూ ఆఫీసులో పర్మిషన్‌ తీసుకుని బయలు దేరాడు. వస్తూనే వాళ్లకు తెలిసిన డాక్టర్‌ను వెంట తీసుకుని వచ్చాడు. డాక్టర్‌ చూసి గుండెపోటుతో ప్రాణం పోయింది అన్నాడు. కోడళ్ళు చిన్న కొడుకు వచ్చారు. అందరికి తెలిసింది మరణ వార్త. ఒక్కొక్కరు పరామర్శించడానికి వస్తున్నారు.
విధికి కుట్టింది కన్ను ఒక్కసారే. ఎంత బాగా కలిసి వుండే వాళ్ళు. ఇప్పుడు ఇలా జరిగింది అంటూ ఎంతో బాధ పడ్డారు. కార్యక్రమాలు అన్ని ముగిసిపోయాయి. భార్య బాధకు అంతు లేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఆయన లేని లోటు ఇంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతా ఎక్కడ చూసినా ఆయన జ్ఞాపకాలే. కోడళ్ళు బాధతో కుంగిపోతున్నారు.
అలా రోజులు గడిచాయి. ప్రతి నెలా మాసికం రోజు వృద్ధాశ్రమంలో భోజనాలు పెడతారు. పెద్ద కోడలు సరిత, భర్త అనఘ్‌ తో మామయ్య సంవత్సరీకం గురించి… రేపు మామయ్య గారి వర్ధంతి కదండీ… వృద్ధాశ్రమానికి వెళ్లి అన్నదానం చేయాలి కదా ఆశ్రమం వారికి చెప్పారా? అని అడిగింది.
అప్పుడే చెప్పాను. రేపు అందరం వెళదాం అన్నాడు అనఘ్‌.
తెల్లవారి అందరూ స్నానాలు చేసి మామయ్య ఫొటో, పూలు తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్లారు. ఆఫీసులో కలసి ఫొటో ఇచ్చారు. డబ్బులు అంతకుముందే కట్టారు కాబట్టి వాళ్ళు అంతా సిద్ధం చేశారు.
డైనింగ్‌ హాలుకి వృద్ధులంతా చేరుకున్నారు. టేబిల్‌ పై వెంకట్‌ ఫొటో పెట్టి పూలమాల వేసి నమస్కరించారు. అందరికీ విస్తళ్ళు వేసి వడ్డనలు చేశారు. కొడుకులు, కోడళ్ళు కూడా వడ్డన చేశారు. అందరూ తృప్తిగా తిన్నారు.
వెంకట్‌ ను తలచుకున్నారు. కొడుకులకు కోడళ్లకు తెలియని విషయమేమిటంటే ఆయన బతికున్నప్పుడు కొడుకులు కోడళ్ళు, మనవడు మనవరాలు పుట్టినరోజులకు వృద్ధాశ్రమానికి భోజన ఖర్చులు ఇచ్చేవాడు. పండ్లు కొని తీసుకుని స్వయంగా పంచేవాడు. అందుకనే వారు గుర్తు చేసుకొని బాధ పడ్డారు.
అలాంటి మంచి మనిషి, అందరిని ప్రేమించే లోకంలో అరుదు అంటూ ఆయనను తలచుకున్నారు.

డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి, 9490367383