శ్రీలంకలో అరుణోదయం!

Sampadakiyam శ్రీలంకలో అనూహ్యంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చి అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన వామపక్ష అభ్యర్థి అనుర కుమార దిశనాయకేకు ప్రపంచ వామపక్ష శక్తులతో పాటు ”నవతెలంగాణ” కూడా అభినందనలు తెలుపుతున్నది. కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల పని అయిపోయింది, వారు కోలుకునే, అధికారానికి వచ్చే అవకాశం లేదంటూ నిరాశలో ఉన్న వారిని ఒక్కసారిగా శ్రీలంకలో అరుణోదయం మేల్కొలి పిందనటం నిస్సందేహం. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు సమాజాల పతనం తరువాత కమ్యూనిజంపై తామే అంతిమ విజయం సాధించామని వ్యతిరేకులు ప్రకటించుకొని సంబరాలు చేసుకున్నారు. అయితే అది పెద్ద ఎదురుదెబ్బ తప్ప మరొకటి కాదని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినపుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు! అనుభవం నేర్పిన పాఠాలతో అందలమెక్కిస్తారని లాటిన్‌ అమెరికాలో వెల్లడైంది. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు, నేపాల్లో తిరుగులేనిశక్తిగా వామపక్షాల ఉన్నాయి. ఇప్పుడు లంకవంతు. వామపక్ష శక్తులకు ఈ వార్త ఆనందం, ఉత్తేజం కలిగిస్తే, కమ్యూనిస్టుల పని అయిపోయిందని పడకకుర్చీ కబుర్లు చెప్పేవారికి కచ్చితంగా ఆశ్చర్యం, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తుంది. మార్క్సిజం -లెనినిజం ఒక శాస్త్రీయ సిద్ధాంతం. దాన్ని అందరికీ ఒకే యూనిఫారం మాదిరి భావించిన వారికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. యూనిఫాం అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలత ఉండాలని అర్ధం కాదు. అలాగే మార్క్సిస్టు శాస్త్రీయ సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు, పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన(సంఘటన). దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి.
తాజా ఎన్నికల్లో ఎన్‌పిపి అభ్యర్థి తొలిరౌండ్‌లో 42.3శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్‌ఎల్‌పి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం,ప్రస్తుత అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. నిబంధన ప్రకారం 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. దానికి గాను తొలి రెండు స్థానాలలో ఉన్నవారికి పోటీ నుంచి తొలగించిన 36 మందికి పడిన ఓట్లలో రెండవ ఓటును వారికి కలుపుతారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం1982 తరువాత జరిగిన ఎన్నికలలో అందరూ మొదటి రౌండులోనే 50శాతానికి పైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా ఈసారి రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు.
2019 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీచేసిన దిశన్నాయకే కేవలం 3.16శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 225 స్థానాలకు మూడంటే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు అధికారానికి రావటం చిన్న విషయమేమీ కాదు. గడచిన ఎనిమిది దశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గతంలో తుపాకి చేతపట్టి విప్లవాన్ని తీసుకువచ్చేం దుకు రెండుసార్లు జనతా విముక్తి పెరుమున విఫలయత్నం చేసింది. ఇప్పుడు బ్యాలట్‌ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు. పార్లమెంటులో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్‌లో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటు న్నాయి. అంతకు ముందున్న వ్యవస్థ పునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్నిచోట్ల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు కూడా తగిలాయి.
వాటి నుంచి లంక వామపక్ష ఎన్‌పిపి తగిన పాఠాలు తీసుకోవాలి. 2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధులకోత ఒకటైతే భారాలు మరొకటి. వాటికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన ఈ తీర్పును వామపక్షశక్తులు ఎలా ప్రజల కోసం వినియోగిస్తాయన్నది పెద్ద సవాలు.