ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షిస్తున్న డీసీఎస్ఓ రుక్మిణి

– ఇంటింటి సర్వే చేయండి..తప్పులను సరి దిద్దండి: డీ.సీ.ఎస్.ఓ రుక్మిణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా పాలన గ్రామసభల్లో స్వీకరించిన 3824 దరఖాస్తుల లో లబ్ధిదారులు ఇచ్చిన సమాచారం సక్రమంగా లేవని, వాటిని ఇంటింటికీ వెళ్ళి సర్వే చేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రుక్మిణి గ్రామపంచాయితీ సిబ్బందిని ఆదేశించారు. సర్వేలో సేకరించిన వివరాలను ప్రజా పాలన యాప్ లో నమోదు చేసి సరి చూసుకోవాలని చెప్పారు. అశ్వారావుపేట గ్రామ పంచాయితీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రజా పాలన దరఖాస్తుల సర్వే వివరాల అన్ లైన్ నమోదును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ఇచ్చిన వివరాలు రేషన్,గ్యాస్ కార్డుల వివరాలతో సరితూగడం లేదని చెప్పారు.వీటిని సమగ్రంగా సర్వే చేసి యాప్ లో సరి చేయాలని చెప్పారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రజా పాలన గ్రామ సభలో 18,707 దరఖాస్తులు అందాయని,వాటిని పరిశీలించి ఆన్లైన్ చేయగా 3,324 దరఖాస్తులు సక్రమంగా లేవని, 15,240 దరఖాస్తుల లో అదనపు దరఖాస్తులను తొలిగించ గా 15,047 దరఖాస్తులు అర్హత ఉన్నాయని వివరించారు. వీటిలో 8,318 దరఖాస్తులు రేషన్ కార్డు, 4,894 దరఖాస్తులు గ్యాస్ వివరాలు సక్రమంగా ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులో తప్పులను సర్వేలో గుర్తించి ప్రజా పాలన యాప్ లో తిరిగి నమోదు చేయనున్నామని తెలిపారు.ఆమె వెంట ఈవో హరికృష్ణ, సర్వే సిబ్బంది ఉన్నారు.