– కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న 306 మంది నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటుకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గడువు ముగిసింది. జనవరి 31న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, 306 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు కావడంతో 166 మంది నేతలు గాంధీభవన్‌కు క్యూ కట్టారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మల్కాజిగిరి పార్లమెంటుకు అత్యధికంగా పోటీ నెలకొంది. ఖమ్మం పార్లమెంటుకు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకోవడం విశేషం.ఆ టిక్కెట్‌ను మాజీ ఎంపీ వి హనుమంతరావు, పార్టీ సీనియర్ నేత కుసుమకుమార్, వ్యాపారవేత్త రాజేంద్రప్రసాద్ కూడా ఆశిస్తున్నారు. భువనగిరి పార్లమెంటుకు పార్టీ సీనియర్ నేత బండి సుధాకర్గౌడ్తోపాటు మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి నుంచి చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, పిడమర్తి రవి, నల్లగొండ నుంచి కె రఘువీర్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి బండ్ల గణేష్, సికింద్రబాద్ నుంచి సీనియర్ నేత కోదండరెడ్డి, మెదక్ నుంచి కౌశల్ సమీర్, కరీంనగర్ నుంచి రమ్యారావు తదితరులు దరఖాస్తులు చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు కాంగ్రెస్‌లో చేరకపోయినా రంగంలోకి దిగారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఆదిలాబాద్‌కు అత్యధికంగా దరఖాస్తులు తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలో బీసీ సామాజికతరగతి జనాభా అత్యధికంగా ఉండటంతో ఆయా వర్గాలనుంచి ఎక్కువ మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు.