అవినీతి సునామీలో జపాన్‌ పాలకపార్టీకి చావుదెబ్బ!

Death blow to Japan's ruling party in corruption tsunami!ఆదివారం నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జపాన్‌ పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి)కి చావుదెబ్బ తగిలింది. అయితే దాని అధికారం పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. పార్లమెంటు లోని దిగువ సభలో ఉన్న 465 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 34.66శాతం ఓట్లు, 259 సీట్లు తెచ్చుకున్న ఎల్‌డిపి ఈసారి 26.73శాతం ఓట్లు, 191 సీట్లతో సరిపెట్టుకుంది. మిత్రపక్షం కొమిటో పార్టీ పొందిన 24తో కలిపి 215 మాత్రమే తెచ్చుకుంది. సాధారణ మెజారిటీ 233 స్థానాలను ఏ పార్టీ కూడా గెలుచుకోలేకపోయింది. ఇరవై ఎనిమిది సీట్లు తెచ్చుకున్న డిపిపి కింగ్‌మేకర్‌గా మారిందని చెబుతున్నారు. దీంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం లేదా పార్టీలలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. మద్దతు కూడగట్టేందుకు వివిధ పార్టీలతో ప్రధాని షిగెరు షిబా మంతనాలు జరుపుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలకపార్టీ పెద్దలు పెద్ద మొత్తంలో విరాళాల వసూలు, వాటిలో కొంత నొక్కేయటం వంటి విమర్శల సునామీలో పాలకపార్టీ ఓడిపోయింది. ఎల్‌డిపి జపాన్‌లో అవినీతికి పెట్టింది పేరు, అయినప్పటికీ అక్కడి ఓటర్లు దానికి దశాబ్దాల పాటు పట్టం కడుతూనే ఉన్నారు. ఈసారి ఓడించారంటే వారి సహనానికి అవినీతి పరులు పరీక్ష పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలకపార్టీకి చెందిన మాజీ ప్రధానులు షింజో అబే, ఫుమియో కిషిడాతో సహా 82 మంది ఎంపీలు స్వంత ఖాతాలకు నిధులు మళ్లించుకున్నట్లు విమర్శలొచ్చాయి. దీనికితోడు ఆర్థిక మాంద్యంతో దేశం కొట్టుమిట్టాడుతున్నది. దాన్నుంచి బయటపడవేసే మార్గం కనిపించటం లేదు. ఇవన్నీ పాలకపార్టీ, దాని మిత్రపక్షాన్ని దెబ్బతీశాయి. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దూరంగా పెడతామని చెప్పినప్పటికీ కొద్దిమందినే పోటీ నుంచి తప్పిం చటం, ఎక్కువమందికి నిధులు కూడా సమకూర్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. జనంలో అనుమానం, ఆగ్రహం తమను దెబ్బతీశాయని ప్రధాని షిబా చెప్పాడు. అవినీతి ఆరోపణల పూర్వరంగంలో ఆగస్టు నెలలో కిషిదా రాజీనామా చేయగా అధికారానికి వచ్చిన షిబా మరుసటి నెలలోనే పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.1955 నుంచి వరుసగా గెలుస్తున్న ఎల్‌డిపి 2009లో ఒకసారి ఓడిపోయింది. తిరిగి ఇప్పుడు మెజారిటీని కోల్పోయింది.ఎల్‌డిపి మిత్రపక్షం కొమిటో పార్టీ బలం 32 నుంచి 24కు పడిపోయింది. అయితే రెండూ కలిసినప్పటికీ 215 మాత్రమే, మరో పద్దెనిమిది సీట్లు అవసరం. పార్లమెంటును నవంబరు 26వ తేదీలోగా సమావేశపరచాల్సి ఉంది, పదకొండవ తేదీన బలపరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. ఆరోజు జరిగే ఓటింగ్‌లో సంపూర్ణ మెజారిటీ ఎవరికీ రాకపోతే తొలి రెండు స్థానాలలో ఉన్నవారితో రెండోసారి ప్రధాని పదవికి ఓటింగ్‌ జరుగు తుంది. సంపూర్ణ మెజారిటీ వచ్చినా, రాకున్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారు ప్రధాని అవుతారు. సబ్సిడీలు పెంచాలని, విద్యుత్‌ బిల్లులు తగ్గించాలనే అజెండాతో ఎన్నికల్లో పోటీచేసిన ఆ పార్టీ నేతలు చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధపడితే తిరస్కరించాల్సిన కారణం కనిపించటం లేదని, అయితే ఏ అంశాలను చర్చిస్తారన్న దానిమీద ఫలితం ఆధారపడి ఉంటుందని డిపిపి నేత యుచిరో తమాకీ చెప్పాడు. వివిధ పద్దతుల్లో చర్చలు జరుగుతున్నాయన్నాడు. ఎల్‌డిపి పైకి మాత్రం బెట్టు ప్రదర్శిస్తోంది.
రోజూ గంటల తరబడి ఓవర్‌ టైమ్‌ చేస్తే తప్ప కార్మికులకు గడవని స్థితి. దీంతో రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి అలాంటి వాతావరణానికి జనాన్ని అలవాటు చేశారు. దేశం దుస్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తిగత జీవి తాలను త్యాగం చేయాలంటూ దేశభక్తి నూరిపోశారు. అయితే జపనీయులు ఎక్కువ గంటలు పనిచేస్తారంటూ ముద్దుపేరు పెట్టి సమర్ధించుకుంటారు. అధికపని కారణంగా మరణాలు కూడా అక్కడ సర్వసాధారణమే. వాటిని కరోషీ అంటున్నారు. ప్రతి పదిమందిలో ఒకరు నెలకు 80గంటలు ఓవర్‌ టైమ్‌ చేస్తున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు కరోషీ గుండెపోటు లేదా పని ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకనాటి అద్భుతంగా వర్ణించిన అంశం ఇప్పుడు జాతీయ ఆరోగ్య సమస్యగా మారింది. ఈ పరిస్థితిని మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కార్పొరేట్లు అందుకు అంగీ కరించటం లేదు. ఓవర్‌ టైమ్‌ తగ్గించుకొనేందుకు కార్మికులే అంగీకరించటం లేదని, ఏడు గంటలకల్లా ఆఫీసు వదలాలని బలవంతం చేయాల్సి వస్తోందని కొన్ని సంస్థలు చెప్పుకుంటాయి. పనిఒత్తిడితో 2015లో ఆత్మహత్య చేసుకున్న 24 ఏండ్ల తకహషి ఉదంతం దేశ వ్యాపితంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తాను రోజుకు 20గంటలకు పైగా పనిచేస్తున్నానని, ఎందుకు జీవిస్తున్నానో అర్థం కావటం లేదని ఆమె ట్వీట్‌ చేసింది. ఆ తరువాత 50మందికి పైగా సిబ్బంది ఉన్న సంస్థలన్నీ స్వచ్చందంగా ఏడాదికి ఒకసారి తమ సిబ్బంది మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది.అయితే ఎక్కువ కంపెనీలు తప్పుడు నివేదికలిచ్చినట్లు తేలింది. కార్మికులు నిజాలను దాస్తున్నట్లు కంపెనీలు చేతులు దులుపుకున్నాయి.అబెనోమిక్స్‌ పేరుతో మాజీ ప్రధాని షింజో అబె అనుసరించిన విధానాలు స్టాక్‌మార్కెట్లో మదుపు చేసిన వారికి లాభాలు తెచ్చాయి తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు. దీనికితోడు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ దిగజారుడు, నిరుద్యోగ సమస్య కూడా తోడుకావటంతో కార్మికవర్గం ఆగ్రహించింది.
ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ తన పదవికి ఎలాంటి ఢోకా లేదని ప్రధాని షిగెరు షిబా చెప్పారు.ఏ పార్టీ లేదా కూటమికీ మెజారిటీ లేనందున ఎన్నికలు జరిగిన 30రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలకు అంత బలం లేనందున మైనారిటీ ప్రభుత్వాన్ని ఎల్‌డిపి కొనసాగించ గలదని కొందరు భావిస్తున్నారు. ఇషిబా రెండవసారి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తే సరిలేకుంటే రెండో ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ రోజులు అధికారంలో ఉన్న ప్రధానిగా చరిత్రకు ఎక్కుతాడు. రెండో పెద్ద పార్టీగా అవతరించిన కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ తన బలాన్ని 96 నుంచి 148కి మాత్రమే పెంచుకుంది. ఎల్‌డిపిలో మాజీ ప్రధాని షింజో అబే వర్గం ప్రస్తుత ప్రధాని షిబా పట్ల సానుకూలంగా లేదని, అధికార పార్టీలో చీలిక రావచ్చని కూడా జోస్యం చెబుతున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఎగువ సభ ఎన్నికలు జరగాల్సి వుంది. జపాన్‌ మిలిటరీ పాత్రను పెంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిదిని సవరించాలని ఎల్‌డిపి ఎప్పటి నుంచో చెబుతున్నది.తద్వారా ప్రపంచ మార్కెట్లలో తనవంతు వాటాను పొందవచ్చని జపాన్‌ పాలకవర్గం భావిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదిస్తున్న ”ఆసియన్‌ నాటో” కూటమికి నాయకత్వం వహించాలని అది భావిస్తున్నది. అయితే అలాంటి సవరణను కమ్యూనిస్టు పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు పాలక కూటమి మైనార్టీలో పడినందున ఆ అజెండాను పక్కన పెట్టవచ్చు. అమెరికాతో అంతకంతకూ దగ్గర అవుతూనే చైనాతో సంబం ధాలను విడగొట్టుకొనేందుకూ జపాన్‌ పాలకవర్గం సిద్ధం కావటం లేదు. ఎందుకంటే చైనాతో వాణిజ్యం వారికి ఎంతో అవసరం. ఎన్నికలు జపాన్‌ అంతర్గత వ్యవహారమని తాము దాని గురించి చెప్పాల్సిందేమీ లేదని చైనా ముక్తసరిగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల్లో 148 సీట్లు తెచ్చుకున్న సిడిపి, 38, 28 చొప్పున సీట్లు పొందిన జెఐపి, డిపిపి పార్టీలు తాము చేతులు కలిపే అవకాశం లేదని అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు లేదా వ్యతిరేకతను వెల్లడిస్తామని పేర్కొన్నాయి. అయితే స్వతంత్రులు, చిన్న పార్టీలను కలుపుకొని ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని భావిస్తున్నవారూ ఉన్నారు. అది జరగకపోతే మైనార్టీ ఎల్‌డిపి కూటమి అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్‌డిపిలోనే కుమ్ములాటలతో కొత్త నేత ముందుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది జరిగినా అస్థిరత కత్తి వేలాడుతూనే ఉంటుంది.లాబీల బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎవరు అధికారానికొచ్చినా అటు కార్మికవర్గం-ఇటు కార్పొరేట్‌ వర్గమూ తమ సంగతేమిటని పాలకుల మీద ఒత్తిడి పెంచుతాయి. తక్షణ సవాళ్లుగా ఆర్థికాంశాలే ఉంటాయని జపనీస్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
అవినీతిపరులుగా ముద్రపడిన కొందరిని పక్కనపెట్టి ఓటర్లను సంతుష్టీకరించేందుకు షిబా ప్రకటించినప్పటికీ ఎక్కువమందికి పెద్దపీట వేయటంతో ఓటర్లు అతని నాయకత్వాన్ని విశ్వసించలేదు. అందరి మాదిరే అని భావించారు. అవినీతి నిరోధానికి కొత్తగా తీసుకున్న చర్యలేవీ ఓటర్లకు కనిపించలేదు. వారి ఆగ్రహాన్ని పసిగట్టటంలో ఎల్‌డిపి నాయకత్వం విఫలమైంది. పాత ముఖాలనే షీబా కూడా మంత్రులుగా తీసుకున్నాడు. కార్పొరేట్‌ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవటాన్ని గట్టిగా సమర్థించాడు. పాలకపార్టీకి వస్తున్న రాబడిలో 60శాతం వరకు కార్పొరేట్‌ విరాళాలే ఉన్నాయి. వాటి నిషేధం పగటి కల అన్నాడు. ఓటర్లు ఎన్నికల పట్ల ఆసక్తి కోల్పోయినట్లు కేవలం 53.85శాతం మాత్రమే పోల్‌ కావటం తెలుపుతున్నది. గత ఎన్నికలతో పోలిస్తే 2.08శాతం తక్కువ. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంత తక్కువమంది పాల్గొనటం ఇది మూడవసారి. జపాన్‌లో రెండు రకాల నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 465కు గాను 289 సీట్లలో నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రతినిధులు ఎన్నికవుతారు. 176 చోట్ల ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లను కేటాయిస్తారు. నియోజకవర్గాలలో డబ్బున్న పార్టీలు తప్ప మరొకరు పోటీపడలేరు. కమ్యూనిస్టు పార్టీ గెలిచిన ఎనిమిదింటిలో ఒకటి మాత్రమే నియోజకవర్గాల జాబితా నుంచి ఉంది. పార్టీ గతంకంటే రెండు సీట్లను, 7.25 నుంచి 6.16శాతానికి ఓట్లను కోల్పోయింది. సింగిల్‌ సీటు నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు 213 చోట్ల పోటీ చేశారు. పాలకపార్టీ నిధుల కుంభకోణం గురించి కమ్యూనిస్టు పార్టీ, పార్టీ పత్రిక అకహటా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికల్లో ఇవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివిధ అంశాలపై విబేధాల కారణంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సర్దుబాటు సాధ్యం కాలేదు. అనేక చోట్ల పరస్పరం పోటీపడ్డాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికార పార్టీ అభ్యర్దులున్న చోట ప్రతి పక్షాల తరఫున ఒకే అభ్యర్ధిని నిలపాలన్న ప్రతిపాదనను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది.భద్రతా చట్టాల రద్దు తదితర అంశాలపై ఏకాభిప్రాయం అవసరమని పేర్కొన్నది.అయితే రాజధాని టోకియో వంటి కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష అభ్యర్ధులను బలపరిచింది. ఒకినావా నియోజకవర్గంలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాన్ని ఎత్తివేయాలని కోరుతున్న శక్తులన్నీ అక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి అకామైన్‌ను బలపరచగా పాలక పార్టీపై విజయం సాధించాడు.
ఎం కోటేశ్వరరావు
8331013288