కిందపడ్డా నేనే గెలిచా అని చెప్పుకొనే బాపతు గురించి తెలిసిందే. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ తీరు అలాగే ఉంది. తాను గెలవకపోతే ఓటమిని అంగీకరించేది లేదని చెబుతున్న పెద్ద మనిషి ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకున్నాడు. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న అధ్యక్ష అభ్యర్థులు బహిరంగ చర్చల్లో పాల్గొనటం ఒక ఆనవాయితీ. వాటిలో వారు చేసే ప్రసంగాలు కొంత మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. మంగళవారం నాడు రిపబ్లికన్ అభ్యర్ధి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ చేతిలో తొలి సంవాదంలో చావుదెబ్బలు తిన్నట్లు సర్వేలు వెల్లడించాయి. కొందరైతే ”ఓడినట్లు ” కూడా చెప్పారు. ఎబిసి మీడియా నిర్వహించిన బహిరంగ చర్చ తరువాత ట్రంప్ కంటే కమల 23 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నట్లు తేలింది. ఇవన్నీ మీడియాలో చర్చగా మారటంతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని, తానే ముందున్నట్లు ట్రంప్ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతివ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడించటం లేదు రిగ్గింగు చేసినట్లు గతంలో ట్విటర్‌నుంచి బహిష్కరించిన తరువాత పెట్టుకున్న స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదిక మీద రాసుకున్నాడు.సిఎన్‌ఎన్, యు గవ్, సోకాల స్ట్రాజీస్ అనే సంస్థల సర్వే ప్రకారం కమలకు 57,ట్రంప్‌కు 34శాతాల చొప్పున మద్దతిచ్చినట్లు ప్రకటించాయి. మరొక సిఎన్‌ఎన్ సర్వేలో 63-37శాతాలతో ఉన్నారు. ముదిమది తప్పినట్లుగా తొలుత డెమోక్రాట్ అభ్యర్థిగా ఉన్న జో బైడెన్ చర్చలో విఫలం కావటంతో అనేక మంది విమర్శించారు. ట్రంప్ పలుకుబడిలో ముందున్నట్లు విజయం సాధిస్తారని చెప్పారు. తరువాత జరిగిన హత్యాయత్నంతో గెలుపు ఖాయం అన్నారు. తీరా కమలా హారిస్‌ను రంగంలోకి దింపటంతో తొలి నుంచి ఆమె పోటా పోటీగా లేదా స్వల్ప మెజారిటీతో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి.
ప్రముఖులు, ఓటర్లను ప్రభావితం చేసే వారు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరచటం సాధారణం, వారికి ఉన్న హక్కు. ‘ఎక్స్’ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌మస్క్ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా గాయని, నటి, రచయిత్రి టేలర్ స్విఫ్ట్ కమలాహారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది.ట్రంపే ఒక పెద్ద కంపు అనుకుంటే అతన్ని సమర్దిస్తున్న ఎలన్‌మస్క్ అంతకంటే సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్ కుమార్తె వివియన్ జెనా విల్సన్ విరుచుకుపడింది. టేలర్ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్ చేస్తూ ” బాగుంది టేలర్..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా… నా జీవితాంతం నీ కుక్కలకు కాపలా కాస్తా” అని పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. టేలర్ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు. అంతే కాదు కమలా హారిస్ మీద నోరు పారవేసుకుంటున్నాడు. ఆమెకు కమ్యూనిస్టు ముద్రవేసి ఎరుపంటే భయం ఉన్న ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు చూశాడు. ఎన్నికలో పోటీ చేస్తున్న కారణంగా ఇటీవలనే ఆఫ్రికన్‌గా మారిందని జాత్యంహంకారాన్ని రెచ్చగొట్టాడు. విధానపరమైన అంశాల మీద చర్చలో ఆమెతో గెలవలేక ఇలాంటి చౌకబారు మాటలతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాడు. తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో చేసిన నిర్వాకాలను చూసిన అమెరికన్లు రెండోసారి పదవిలోకి ఎన్నుకోకుండా బుద్ది చెప్పినా మనిషిలో ఎలాంటి మార్పూ లేదు.నోరు లేనిదంటూ ట్రంప్ వర్ణించిన ఒక మహిళ ఒక బండరాయిలా చిదిమివేసిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది.తమనేత ఇలా చేశాడేమిటని సహాయకులే దిగ్భ్రాంతి చెందినట్లు, ఇక ట్రంప్ ప్రచారంలో పసలేదని తేలిందని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల పండితులే పెదవి విరిచినట్లు కూడా విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికల సంవాదాలు ఒక సూచిక మాత్రమే. పోలింగ్ నవంబరు ఐదవ తేదీ గనుక ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోగా జరిగే పరిణా మాలు కూడా ప్రభావం చూపుతాయి. ఒకటి మాత్రం ఖాయం, నల్లేరు మీద బండిలా తన విజయం ఖాయం అని గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌కు అంతసీన్ లేదని వివిధ సందర్భాలలో తేలింది.అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ట్రంప్ గెలిచే అవకాశాలు లేవని చెప్పవచ్చు.