మూఢ నమ్మకాల పునాదుల మీద అసత్యాల సమాజం నిలిపి అమాయకుల నెత్తురుతో హోలీ ఆడుకుంటున్న దగుల్బాజీల్లారా! సత్యం ఏదో ఒక రోజు కారుమబ్బుల చీకటిని చీల్చుకొని ప్రచండ ఉసస్సుతో ఈ సమాజం మీద పరుచుకుంటుంది. జ్ఞానం చేతిలో కాగడా వచ్చి మొత్తం ప్రపంచాన్ని కాంతిమయం చేస్తుంది. అప్పుడు ఈ దోపిడీ సమాజం కూలి పోయి సత్యం అధారంగా ప్రకృతిని ప్రేమించే ఓ సమాజం నిర్మిత మౌతుంది. అంతదాక మా ఈ పోరా టం కొనసాగుతుంది.
దేశంలో నకిలీ బాబాలకు కొదువేలేదు. వీరి లీలలు, అఘాయి త్యాలు, చీకటి వ్యాపారాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా గడిచిన పదేళ్లుగా బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వీరి ఆగడాలు ఎక్కువ య్యాయి. రాజ్యం అండదండలు వీరికి పుష్క లంగా ఉండడమే దీనికి కారణం. ఈ నకిలీ బాబాలు సహజంగా నేర స్వభావం కలిగి ఉంటారు. బాబాలుగా అవతారమెత్తి నేర వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని అంధ, మూఢవిశ్వాసాలను ప్రజల్లో నింపుతూ లక్షల కోట్ల ఆస్తులు దోచుకుంటారు. ఘరానాగా బతుకుతుం టారు. ఇలాంటి దొంగబాబాలకు అపారమైన రాజకీయ పలుకుబడి ఉంటుందని అనేకసార్లు రుజువైంది. సమాజంలో డబ్బున్న పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు పార్టీలతో నిమిత్తం లేకుండా బాబాలను, మూఢ నమ్మకాలను విశ్వసించటంలో పోటీ పడుతుంటారు. మరీ విచిత్రం ఏమంటే చదువుకున్న మూర్ఖులు, సైన్సు చదువుకొని, ఏ మాత్రం శాస్త్రీయ దృక్పధం లేని సైంటిస్టులు అనబడే వారు కూడా ఈ బాబాల చుట్టూ తిరుగుతుంటారు. అంటే జ్ఞానానికి- చదువుకు లింకు ఎప్పుడో తెగిపోయిందని అర్ధం చేసుకోవాలి. గతంలో అనేక నేరాలు చేసిన ఆశారామ్బపు, డేరా బాబా తదితర 15మంది వరకు బాబాలు జైళ్లలో ఉన్నారు. దేశంలో నూటికి 80శాతం తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్ధ యాత్రలలో జరుగుతున్నవేనని ఆధ్యయనాలు చెబుతు న్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో జులై రెండున స్వయం ప్రకటిత దేవునిగా ప్రకటించుకున్న బోలేబాబా ‘సత్సంగ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి 2.50 లక్షల మంది హాజరయ్యారు. బాబా పాదధూళి తాకితే సకల పాపాలు, రోగాలు పోతాయని, బాబా మహిమగల వ్యక్తి అని ఆయన శిష్యగణం ప్రచారం చేయడంతో ఆయన పాదధూళి కోసం అమాయక జనం పోటీ పడగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 121 మంది మరణించారు. మరణించిన వారిలో 112 మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. వీరందరూ పేదబడుగు జీవులే. ఈ ఘోరానికి కారకుడైన బాబా తొక్కిసలాట జరిగిన ప్రదేశం నుంచి తన మనుషులతో కలసి దర్జాగా ఉడాయించాడు. ప్రభుత్వం విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. 855 పేజీల సిట్ నివేదికలో బోలేబాబా పేరులేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో ఇతని పేరే లేదు. అంటే రాజ్యానికి బాబాలకు మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ నకిలీ బాబా ఒక నేరస్తుడు. ఇతనిపై గతంలోనే అనేక కేసులున్నాయి. స్త్రీలపై లైంగిక దాడుల కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. బాబాగా కొత్త అవతారమెత్తి రూ.100కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు నెలకొల్పాడు.హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.
హత్రాస్ ఘటన లాంటివి మనకు కొత్తకాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంద రరాదేవి గుడివద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్లోని చామండదేవి ఆలయం వద్ద 250 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనాదేవి గుడివద్ద 162 మంది, ఇంకా వెనక్కి వెళితే 1954లో అలహాబాద్‌లో జరిగిన తొలి కుంభమేళాలో 800 మంది, మన రాష్ట్రంలో 2015లో గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 20మందికి పైగా చనిపోయారు. ఇవన్ని గుండెల్ని మెలిపెట్టే విషాదాలు. ఇలాంటి దుర్ఘటనలు తరుచూ జరుగుతున్నా నివారించాల్సిన ప్రభుత్వాలు చేష్టలూడిగి చూస్తుండటం బాధాకరం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఊహించనంత స్థాయికి ఎదిగినా అదేస్థాయిలో దొంగ బాబాలు కూడా ఎక్కువైపోతున్నారు. మానవ సమాజాన్ని ఎంతో వెనుకకు తీసుకెళ్తూ నష్టం చేస్తున్నారు. అయినా పాలకులు నిమ్మకు నిరెత్తినట్లు ఉంటున్నారు. ప్రజలు కూడా వాస్తవ ప్రపంచాన్ని గురించిన శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నట్లు కనిపించటం లేదు. మతాలు, దేవుళ్లు, సాంప్రదాయలు అంటూ మధ్యయుగాల్లో జీవిస్తున్నవారే ఎక్కువ. ఎవరి నమ్మకాలు వారివి అని మర్యాదగా సమర్థించుకొని పోతున్నామేగాని ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను కల్పించటంలో పాలకుల వైఫల్యం మెండుగా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 51ఏ ప్రకారం రాజ్యం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని రాసుకున్నామేగాని, చిత్తశుద్దిగా ఆచరించటం లేదు. గత కొంతకాలంగా రోజురోజుకూ మార్కెట్లోకి కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు. వీరు ప్రజల బలహీనతలను, అమాయకత్వం, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని వేలకోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా స్త్రీల మానప్రాణాలు హరించి వేస్తున్నారు. చివరకు ఈ ప్రక్రియ ప్రాణాంతకంగా మారిపోయినప్పుడు చూస్తూ సహించలేం. ఇంత జరుగుతున్నా మన పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైపెచ్చు రాజకీయ నాయకుడు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు సైతం దొంగబాబాల చెంతకుపోయి పొర్లు దండాలు పెడుతూ, వారికి పాదదాసులుగా మారిపోతు న్నారు. ఇక సామాన్య ప్రజలకు శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన ఎలా ఏర్పడుతుంది?
ఏ జీవన సంక్షోభాల నుంచి ప్రజలు బాబాలను ఆశ్రయిస్తున్నారు? అవధులు దాటిన ఈ బాబాభక్తి వెనుక ఉన్న సామాజిక, మానసిక వెనుకబాటు తనాన్ని శోధించాలి. పేదరికం, దారిద్రం నుండి అమాయక ప్రజలు బయటపడే మార్గం ఈ వ్యవస్థలో లేకనే ప్రజలు దేవుడు, దెయ్యం, మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢాచారాలను నమ్ముతూ ఈ దొంగ బాబాల మోసాల బారిన పడుతున్నారు. అందుకే మూఢాచారాలు, దొంగ బాబాలను నిషేదిస్తూ ఓ ప్రత్యేక చట్టం తేవాలి. ఈ ప్రకృతిని ఏ దేవుడు సృష్టించలేదని, ఈ ప్రకృతి అంతా స్వతహాగా భౌతిక పదార్థాలతో నిండి ఉంటుందని, పదార్థాలకు పదార్థ ధర్మాలేగాని మహిమలు ఉండవని ప్రజలు గ్రహించాలి. ప్రకృతి, సామాజిక పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో విద్యాలయాల్లో మొదటి నుంచి వివరిస్తూ, ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అంధ మూఢత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచటానికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యతనివ్వాలి.
– షేక్ కరిముల్లా, 9705450705