కొండలు అమాంతం కదిలొచ్చి/ ఇండ్లను కబళించాయి/ అర్థరాత్రి వానచినుకు చేసిన ప్రళయనాదానికి/ ఊళ్లకు ఊళ్లు శ్మశానాలు అయ్యాయి.ఆకాశానికి చిల్లులు పడినట్లు దంచికొట్టిన జడివాన, ముంచెత్తిన వరదలకు కొండచరియలు విరిగిపడి కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా చిగురు టాకులా వణికిపోయింది. ఇప్పటివరకు రెండువందల ఎనభై మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సహాయ చర్యలను ముమ్మరం చేసింది. యాభై శిబిరాల్లో బాధితులకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నది. అయితే ఈ విషాదంనుంచి తేరుకోకముందే గురు,శుక్రవారాల్లో హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా, ఉత్తరాఖండ్, కర్నాటక, సిక్కింలలోనూ కొండచరియలు జారిపడి మరికొంతమంది ప్రాణాలు హరించాయి. మృతుల లెక్క తేలాల్సి వుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ప్రకృతి విలయం వెనుక కారణాలున్నప్పటికీ, ఇలాంటి విపత్తు సంభవిం చిన సమయంలో ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యత నుంచి తప్పించు కుంటున్న వైఖరి ఏమాత్రం సరికాదు!
నిన్న కేరళ… నేడు ఉత్తరాఖండ్ సిక్కింలు.. పర్యావరణం పగబడితే… ఫలితమిలాగే ఉంటుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు,కోనలను విచ్చలవిడిగా తొలుస్తుంటే ఇంతటి మహా విషాదాలే చోటుచేసుకుంటాయి నిత్యం. గతేడాది చార్ ధామ్ ఆల్-వెదర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణంలోని టన్నెల్‌లో చిక్కుకున్న కూలీలు రెండురోజుల తర్వాత ప్రాణాపాయంతో బయటపడ్డారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు యాభైరెండు మంది యాత్రికులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక చనిపోయినట్టు సమాచారం. ఇలా ప్రకృతి ప్రకోపానికి ప్రాంతాలు, పట్టణాలే కాదు, రాష్ట్రాలూ అతలాకుతలమవుతున్నాయి. కేరళలో చోటుచేసుకున్నది మాటలకందని మహా విషాదం! సోమవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా వెల్లువెత్తిన బురద, కొండరాళ్ల ధాటికి మూడు వందల మందికి పైగా నిద్రలోనే సమాధి అయ్యారు. మరెందరో గల్లంతయ్యారు. వందల ఇంఢ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఆ శిధిలాల కింద నుంచి వినిపించే ఆర్తనాదాలు హృదయాన్ని మెలిపెడుతున్నాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిన స్థానికులను చూసి అందరి కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. మరు భూములను తలపిస్తున్న వయనాడ్ గ్రామాల్లో సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు తీరిక లేకుండా శ్రమిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి.
2018 ఆగస్టులోనూ భీకర వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రం కకావికలమైంది. కేరళకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదు. కొన్నేండ్లుగా అనేక విపత్తులను ఎదుర్కొంటోంది. కానీ, ఇప్పుడు వయనాడ్‌లో చోటుచేసుకున్నది ఆ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విపత్తులలో ఒకటి. మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండకై, అట్టామల, నూల్‌పూజా గ్రామాలతో పాటు, చూరాలమల పట్టణంలోనూ బీభత్స దృశ్యాలు చోటుచేసుకున్నాయి. నివాస స్థలాలు ఉండాల్సిన చోట బురదమట్టి దిబ్బలు కనపడుతున్నాయి. ముండకై గ్రామం స్థానంలో మట్టి, బురద, రాళ్లు నేలకూలిన చెట్లతో నిండిన నది ప్రవహిస్తోందంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తాయి. మరోవైపు ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో ఉన్న చలియార్ నదిలో ఛిద్రమైన మృత దేహాలు కొట్టుకు వస్తూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలోకన్నా, ఈ నదిలోనే ఎక్కువ మృతదేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీస్తున్నారు. కొండచరియలు విరిగి నదిలో పడటంతో రెండింతలైన బురద మట్టి ప్రవాహం ఊళ్లకి ఉళ్లు ముంచెత్తింది. కిలో మీటర్ల పొడవునా, కొన్ని అడుగుల మేర ఎక్కడ చూసినా బురద మట్టే కనపడుతోంది. ఇండ్లు, ఆస్పత్రులు, బడులు, ప్రార్థనాలయాలు అన్నీ ఆ మట్టి కిందే. దీంతో సహాయ చర్యలు ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియని అగమ్య పరిస్థితి. రెస్క్యూ సిబ్బందికే ఇది ఏ స్థాయిలో విపత్తో అర్ధం కాని దుస్థితి.
మృత్యు రక్కసి విరుచుకుపడిన ప్రాంతంలో 48 గంటల్లో 572 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ స్థాయి వర్షపాతం వయనాడ్ జిల్లా కనీవిని ఎరుగదు. భారత వాతావరణ పరిశోధన సంస్థ (ఐఎండి) కూడా ఈ వర్ష బీభత్సాన్ని అంచనా వేయలేకపోయింది. అరేబియా సముద్రపు ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం కూడా ఉత్పాతానికి కారణంగా చెబుతు న్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం తెల్లవారుజాము నుండి నిరంతరంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మరి అందరి సూచనలతో సీఎం ముందుకు పోతున్నారు. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, స్థానిక ఎంపీ రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలకు దైర్యం చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఉదారంగా ఆదుకోవాలని సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ దిశలో తక్షణం కేంద్రం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలనైతే పంపింది కానీ, ఈ మహా విషాదాన్ని సైతం కేంద్ర బీజేపీ రాజకీయం చేస్తోంది. కేరళ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిందా పూర్వక వ్యాఖ్యలు చేయడం తగని పని. బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడంపైనే అందరూ సర్వశక్తులను ఒడ్డి, సహకారం సమకూర్చి, ప్రకృతి విలయంలో చిక్కుకున్నవారిని సురక్షితులను చేయాలి.