రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జనాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఆసుపత్రుల నిండా కిక్కిరిసిపోతున్నారు. డెంగీ, వైరల్, మలేరియా జ్వరాలతో బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరు జ్వర పీడితులుంటున్నారు. గత ఐదునెలల్లో సుమారు 3వేలు డెంగీ, 6500 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఈ జ్వరాలపై ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నదా! చర్యలకు పూనుకుంటున్నదా! వైద్య సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నదా!
కొత్తగూడెం జిల్లాకు చెందిన 18 నెలల పాపకు మలేరియా ప్రబలింది. ఈ చిన్నారి ఐదారు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ చివరకు వరంగల్ ఎంజీఎమ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న పూజ జ్వరంతో అవస్థ పడుతూ ఊరికి చేరింది. ఇంటివద్ద చికిత్స అందించినా తగ్గలేదు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ‘నాన్న నన్ను కాపాడు’ అంటూ ఆ తండ్రి ఒడిలోనే తనువు చాలించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో డెంగీతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఇలా ఎన్నని చెప్పాలి! వైద్య సదుపాయంలేని గ్రామల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది.
ఇలా జ్వరాలకు ప్రాణాలొదులుతున్న వారు కొందరైతే.. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నవారు ఎందరో. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు భారీగా వస్తున్నాయి. రోగుల్లో ఎక్కువగా తీవ్రమైన చలిజ్వరం, భరించలేని కీళ్లు, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు లక్షణాలు అగుపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియాతో మరణాలు కూడా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రధానంగా డెంగీ కోరలు చాస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు4 వరకు మొత్తం 2,847 డెంగీ కేసులు నమోదయ్యాయంటే డెంగీ తీవ్రత అర్థమవుతుంది. హైదరాబాద్‌లో 1101, ఖమ్మంలో 287, మేడ్చల్‌లో 268, సూర్యాపేటలో 217 డెంగీ కేసులొ చ్చాయని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అలాగే జూలై 15నాటికి 6,500 టైఫాయిడ్, 31,124 గ్యాస్ట్రో ఎంటెరిటిస్, 140మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో గత పదిరోజుల్లో కొత్తగా 35 డెంగీ కేసులొచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు నెలల్లో 10809 జ్వరాల కేసులు నమోదయ్యాయి.
అయితే డెంగీ, మలేరియా మరణాలను వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రయివేటు ఆస్పత్రుల్లో వచ్చే కేసులు, మరణాలు కూడా అసలు లెక్కల్లోకే రావడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. అవి కూడా కలిపితే కేసుల సంఖ్య రెట్టింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గురుకుల హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వందల మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే 36 మంది చనిపోయినట్టు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, గుంతల్లో వర్షం నీరు అలాగే నిల్వ ఉండిపోతున్నాయి. పరిసరాల అపరిశుభ్రతతో దోమల బెడద పెరిగి జ్వరాలు అంటుకుంటున్నాయి. చికిత్సకోసం సర్కారు ఆస్పత్రులకు జనం పోటెత్తుండటంతో అవి రోగులతో నిండిపోతున్నాయి. అక్కడ పడకలు దొరక్కపోవడంతో దిక్కుతోచక ప్రైవేటు ఆస్పత్రులకు ఆశ్రయిస్తున్నారు. ఇలా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పెరిగి నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక స్థోమత లేని కొందరు ఇంటి వద్దే చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే రాష్ట్రంలో రెండు వేల మలేరియా పీడిత గ్రామాలుగా ప్రభుత్వం ఈపాటికే గుర్తించింది. ఇందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ముందే గుర్తించినా ముందస్తు చర్యలు మాత్రం చేపట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
నమోదవుతున్న జ్వరాల సంఖ్య పరిశీలిస్తే ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదనేది స్పష్టం. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 45 రోజులకు ఫాగింగ్ చేయాల్సి వుంది. డెంగీ ప్రభావిత జిల్లాల్లోనైతే ఇంతకన్నా తక్కువ వ్యవధిలోనే ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలి. ఈ విషయాన్ని ప్రజారోగ్య శాఖ పూర్తిగా విస్మరించింది. ఇక పల్లెల్లో నిధుల్లేక పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి. కనీసం బ్లీచింగైనా వేసే స్థితి లేదు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో మందులు కూడా ఉండటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ ముందస్తు కార్యా చరణ చేపట్టకపోవడం, కనీస ఔషధాలు అందుబాటులో ఉంచుకోకపోవడమే సమస్య తీవ్రతకు ప్రధాన కారణం. ఇప్పటికైనా సర్కారు ప్రజారోగ్య శాఖను అప్రమత్తం చేయాలి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.