నవతెలంగాణ – రాయపోల్
ఉపాధి హామీ కూలి పిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం ఎంతో విషాదకరమని, ఆమె ఇద్దరు ఆడపిల్లలు తల్లి లేని అభాగ్యులయ్యారని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన పసుల అనిత బుధవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పని చేస్తుండగానే గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తోటి కూలీలు ఆసుపత్రికి చేర్చేలోపే ఆమె మృతి చెందడం బాధాకరం. అసలే నిరుపేద కుటుంబం వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటారని అలాంటి కుటుంబంలో తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లలు తల్లిలేని అభాగ్యులయ్యారు. ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంత ఉంటుందో తెలిసిన విషయమే. అనితకు భర్త స్వామి కూతుర్లు దీపిక, దీక్షిత వృద్ధులు అత్తమామలు ఉన్నారు. వీరి పోషణ తలకు మించిన భారంగా మారింది. వీరి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఇద్దరి ఆడపిల్లలు చదువుల కోసం సహకారం అందిస్తామని ధైర్యంగా ఉండాలని వారికి సూచించడం జరిగిందన్నారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం కాబట్టి ఇంకా ఎవరైనా మానవతావాదులు ముందుకు వచ్చి ఆదుకోవాలని అలాగే ఉపాధి హామీ పనులు చేస్తూ అనిత గుండెపోటుతో మృతి చెందింది కాబట్టి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం ప్రకారం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ వేమ జనార్ధన్, పసి నర్సింలు, ఇమ్రాన్,వేమ శ్రీనివాస్, రామచంద్రం, స్వామి, యాదయ్య, గోపి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.