నీటి ట్యాంకులో కోతుల మృత్యువాత

– ట్యాంక్‌ వైపు కన్నెత్తి చూడని సంబంధిత సిబ్బంది
– అలాగే నీటి సరఫరా
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ నందికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలోని విజయ విహార్‌ పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో కోతుల మృతదేహాలు బయటపడిన విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా నీటి సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని వార్డు ప్రజలు తాగుతున్నారు. వాటర్‌ ట్యాంకుపై మూత తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతిచెందాయి. సుమారు 30 నుంచి 40 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడం కలకలం రేపింది.
అటువైపే చూడని మున్సిపల్‌ సిబ్బంది.. నీటిని అలాగే కాలనీకి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా సిబ్బంది ట్యాంక్‌ శుద్ధిచేయడం మరిచి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌పై మూత ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.