– తల్లడిల్లిన తల్లి హృదయం
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
– మెదక్ మాత శిశు ఆస్పత్రిలో ఘటన
– విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు, సూపరింటెండెంట్
నవతెలంగాణ-మెదక్
తొమ్మిది నెలలు ఊపిరి బిగ పట్టుకొని ఎన్నో కలలతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆశలు ఆవిరయ్యాయి. తల్లి పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన పసికందు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందంటూ బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం కుచన్పల్లి గ్రామానికి చెందిన నామ భవానీ.. మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ప్రసవించగా, మగ శిశువుకు జన్మనిచ్చింది. శుక్రవారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో పసి బిడ్డకు వైద్య సిబ్బంది టీకా ఇచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత శిశువుకు ఇన్ఫెక్షన్ అయి మృతి చెందినట్టు చెప్పారు. పండంటి మగ శిశువు మృతి చెందడంతో తల్లి హృదయం తల్లడిల్లింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందంటూ బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట బైటాయించి ఆందోళన నిర్వహించారు. ఇందుకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, పట్టణ సీఐ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పసికందు మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని, ఈ ఘటనలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం జరిగినట్టు తేలితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాంతో బాధితులు ఆందోళన విరమించారు.