– మృతదేహంతో పరిశ్రమ ఎదుట కుటుంబీకుల ఆందోళన
నవతెలంగాణ హత్నూర
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులోని ఎపిటోరియం యూనిట్-1 పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోర్పట్ల గ్రామానికి చెందిన కొప్పు నరసింహులు(30) గ్రామ శివారులోని పరిశ్రమలో ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉదయం పరిశ్రమకు వెళ్లాడు. కాగా, మధ్యాహ్నం పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ ఒకసారిగా కుప్పకూలాడు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం హుటాహుటిన ఎమ్మెన్నార్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నర్సింహలు మృతిచెందినట్టు వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. వెంటనే కుటుంబీకులు, గ్రామస్తులు ఎపిటోరియం పరిశ్రమ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టేందుకు తీసుకురాగా.. సమాచారం అందుకున్న జిన్నారం సీఐ వేణుకుమార్ పరిశ్రమ వద్దకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా బంధువులు వినకుండా తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని పరిశ్రమ ఎదుట భీష్మించుకుకూర్చున్నారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి నష్టపరిహారం ఇప్పిస్తామని సీఐ చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వేణుకుమార్ తెలిపారు.