అతని వెన్నెముక, అతని గుండె, క్లోమం, ఒక్కొక్కటిగా అతని అవయవాలన్నీ బలహీనపడ్డాయి, జైల్లో వైద్యం లేకపోవడంతో, పేరుమోసిన అండ సెల్‌లో ఉంచారు. నిరంతర నొప్పి, తరచుగా మూర్ఛపోవడం, మూత్ర సమస్యలు, ఇవన్నీ అతని జీవితంలో భాగమై చివరికి అతన్ని భౌతికంగా లేకుండా చేశాయి. అతని విషాదమరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర న్యాయవ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బహిర్గతం చేస్తుంది. మానవ హక్కుల కోసం ఉద్యమించిన ఒక తెలివైన విద్యావేత్త, సామాజిక క్రియాశీలత కలిగిన మేధావిని ఈ వ్యవస్థ తీవ్ర అసంతృప్తికి గురిచేసింది 1967లో పేరుమోసిన ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద మోసపూరిత ఆరోపణలకు పదేళ్ల క్రూరమైన ఖైదు అనుభవించాల్సి వచ్చింది. అతను ఒక్కసారి మాత్రమే కాదు రెండుసార్లు నిర్దోషిగా విడుదలైనప్పటికీ, అతని స్వేచ్ఛ స్వల్పకాలికం. ముంబై హైకోర్టు తర్వాత కేవలం ఏడునెలల్లో తీరని శోకాన్ని మిగిల్చి ఎన్నో ప్రశ్నలను నపుంసక సమాజానికి వేసి మౌనంగా నిష్క్రమించిన ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా సుదీర్ఘకాలంగా రాజ్య అణచివేత తర్వాత పొందిన స్వాతంత్య్రాన్ని ఆయన ఆస్వాదించలేకపోయారు.
ఉమ్మడి ఏపీ తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన సాయిబాబా కవి, రచయిత, నిష్ణాతుడైన అధ్యాపకుడు, విద్యావేత్త. ఆయన ఎంఏ ఇంగ్లీష్ అభ్యసించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చేరారు. క్యాంపస్‌లో మండల్ కమిషన్ ఆం దోళన ఉధృతంగా సాగుతున్న సమయంలో విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. జీవితాంతం పౌర హక్కుల ఉద్యమాలతో కలిసి పనిచేశారు. 1993లో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 35 రోజుల చేసిన నిరాహార దీక్షలో సాయిబాబా కీలకపాత్ర పోషించారు.అయితే ఆయనతో పాటు మరో ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు 2017లో దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అప్పటినుండి అతను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఒంటరిగా నిర్భంధంలో ఉన్నారు. ముంబై హైకోర్టు ఐదున్నరేళ్ల ఏకాంత నిర్బంధం తర్వాత జైలునుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆపై 24గంటల తర్వాత, ఆ ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో మళ్లీ జైలుగోడల మధ్యే బందీ కావాల్సి వచ్చింది. తొంభై శాతం వికలాంగ రాజకీయ ఖైదీ, అతని సహ నిందితులు గత తొమ్మి దేళ్లుగా శిక్ష ఎదుర్కొన్నా అ’న్యాయ’ వ్యవస్థ అతన్ని జీవచ్ఛవంగా మార్చింది.
సాయిబాబా జీవితాంతం విద్యార్థులకు పాఠాలు బోధించడానికే ఇష్టపడ్డారు.అంతేకాదు, నిరంతరం అణగారిన ప్రజలతో జీవించాలనుకున్నారు. వెనుక బడినవర్గాలు చైతన్యం పొందడానికి విద్య అవసరమని, దానికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని భావించారు. అది కూడా నాణ్యమైన విద్య అయి ఉండాలనే సంకల్పంతో ముప్పై ఐదేండ్లు బోధననే తన ఆయుధంగా మలచుకున్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థ తీరు చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు దూరమవుతున్నట్లు కనిపిస్తున్నాయని ఆందోళన చెందారు. సమాన విద్యావకాశాలు పూర్తిగా మృగ్యమై పోయాయని మదనపడ్డారు. దళిత ఆదివాసీ విద్యార్థులకు పేరెన్నికగల సంస్థలు, ఉదారవాద విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లేదని, ఒకవేళ వీరికి ప్రవేశం లభించినా వారు విశ్వవిద్యాలయాల్లో నిరంతరం వివక్షకు గురవుతు న్నారని వాపోయారు. కార్పొరేట్, సెంట్రల్ యూనివర్సిటీలు ధనికుల కోసమేనని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
‘ఉపా’ చట్టం కింద అరెస్టు అయిన ఆయన సుదీర్ఘ అణచివేత తర్వాత ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చారు. కానీ, తనకు లభించిన స్వేచ్ఛను పూర్తిగా అనుభవించలేదు. కర్కశ ప్రభుత్వం, మొత్తం వ్యవస్థ తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించింది. అతని విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి, నేర న్యాయవ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బట్టబయలు చేస్తున్నది. కడుపు నిండా దు:ఖం, గుండెలనిండా ఆవేశం వున్నా, ఏమీ చేయలేని నిస్సహాయులుగానే బతకాల్సిన దుస్థితి ఈ సమాజానిది. తీర్పు లకు, న్యాయానికి సంబంధం లేని దేశంలో, ఏ దిక్కు వెళ్లాలో తెలిసినా బలహీనంగానే ఉండాల్సిన పరిస్థితి. సమాజ మంతా కూడా నేడు మొద్దు బారిపోయి ఉంది. పెద్దగా ప్రశ్నించలేక పోతున్నది. పెద్దగా కదల్లేక పోతున్నది, మెదల్లేక పోతున్నది..గొంతు విప్పలేకపోతున్నది. ఏమిటి ఘోరం? ఈ శిక్షలేమిటి? ఎన్ని ఉరితీతలకి సమానం అండా సెల్‌లో చక్రాల కుర్చీతో ఏకాంతవాసం! ప్రాణాల్ని పీల్చే శీతల వాయువుల దాడిలో. ఇది గజదొంగలు పడ్డ దేశం. వాళ్లం దరి నుంచి మిమ్నల్ని ఎలా రక్షించుకోవాలో, ఎలా మిగిలించుకోవాలో తెలియలేదు బాబా! నీ..మరణం ఈ సమాజానికి నూతన ఉత్ప్రేరకం కావాలి. ప్రశ్నించేతత్వం, పేదల హక్కుల్ని రక్షించే ధైర్యం రావాలి. అదే మీకు సరైన నివాళి.
– డా.ముచ్చుకోట సురేష్‌బాబు, 9989988912