8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష

– శ్రీఖతర్‌ కోర్టు తీర్పు శ్రీ కేంద్ర విదేశాంగశాఖ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతర్‌ కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది. వీరంతా కొన్ని నెలల నుంచి ఖతర్‌ అధికారుల నిర్బంధంలో ఉన్నారు. గూఢచార్యం ఆరోపణలపై వీరికి కోర్టు మరణ శిక్ష పడినట్లు సమాచారం. ఎనిమిది మంది భారతీయుల కు ఖతర్‌ కోర్టు మరణ శిక్ష విధించడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. ‘మేము తీవ్ర దిగ్భ్రాంతి కి గురయ్యాం, వివరణాత్మక తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ‘అల్‌ దహ్రా కంపెనీకి చెందిన 8 మంది భారతీయ ఉద్యోగులకు సంబంధించిన కేసులో ఖతర్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించినట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది’ అని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.’బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సన్నిహితంగా ఉన్నాము, అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నాం’ అని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు, సన్నిహితంగా పరిశీలి స్తున్నట్లు తెలిపింది.
ఈ కేసు గోప్యత స్వభావం కారణంగా, మరిన్ని వివరాలు చెప్పడం సరికాదని తెలిపింది. కాగా, భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరభ్‌ వశిష్ట్‌, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, కమాండర్‌ పూర్ణేందు తివారీ, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, నావికుడు రాగేష్‌ను ఖతర్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ గతేడాది ఆగస్టు 30న దోహాలో అరెస్టు చేసింది. అయితే వీరిపై అభియోగాలు ఖతర్‌ అధికారులు వెల్లడించలేదు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢ చార్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు సమాచారం. అరెస్టయిన వారంతా అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఒక మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు.
అరెస్టయిన మాజీ అధికారులకు భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతర్‌ అనుమతి ఇచ్చింది. వీరితో విదేశాంగశాఖ అధికారులు మాట్లాడటంతోపాటు ఖతర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అలాగే పలుమార్లు బెయిల్‌కు కూడా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతర్‌ ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎనిమిది మందికి గురువారం ఖతర్‌ న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.