– హర్యానా కోర్టు ఆదేశం
చండీగఢ్ : తన కుమార్తెను లైంగికంగా వేధించి గర్భవతిని చేసినందుకు తండ్రికి మరణశిక్ష విధిస్తూ పాల్వాల్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. రూ.15 వేల జరిమానా కూడా విధించింది. బాలికకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తనకు 11 ఏండ్ల వయసున్నప్పటి నుంచి తన తండ్రి అత్యాచారం చేస్తున్నాడంటూ బాలిక 2020 అక్టోబర్‌లో ఫిర్యాదు చేసింది. దోషి తల్లిలేని బాలికను నిత్యం వేధిస్తూ మద్యం తాగించేవాడు. బాలిక గర్భం దాల్చిన తర్వాత కూడా లైంగిక వేధింపులు కొనసాగించాడు. 16 ఏండ్ల వయసులో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి డిఎన్‌ఎ శాంపిల్స్ తీసి పరీక్షించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష విధించారు. శిక్ష ఖరారు చేసిన అనంతరం 41 ఏండ్ల నిందితుడు చాలా క్రూరంగా ప్రవర్తించాడని, అందుకే క్షమించలేమని కోర్టు పేర్కొంది.