అమెరికా ఎన్నికల్లో కమ్యూనిజం చర్చ!

Communism debate in American elections!నవంబరు ఐదవ తేదీన అమెరికాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా? తనకు ప్రతికూలంగా ఫలితం వస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా? గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాల నడుమ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగిందని, దుండగుడిని పట్టుకున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో తన స్వంత మైదానంలో గోల్ఫ్‌ ఆడుతుండగా భద్రతా సిబ్బంది సమీపంలో ఉన్న పొదల్లో సాయుధ దుండగుడిని గమనించి కాల్పులు జరిపారు. దాంతో దుండగుడు రయన్‌ రౌత్‌ తన వద్ద ఉన్న ఎకె-47 మాదిరి తుపాకి, మరికొన్ని వస్తువులను వదలి తన కారులో పారిపోగా 65 కిలోమీటర్ల తరువాత పట్టుకున్నట్లు చెబుతున్నారు. రౌత్‌ కాల్పులు జరిపాడా లేక పొదల్లో శబ్దాలకారణంగా అతని ఉనికిని గుర్తించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారా అన్నది వెంటనే స్పష్టం కాలేదు. అతని సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించగా డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని అని తేలినట్లు చెప్పారు. అయితే అది వాస్తవం కాదని గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటువేశాడని, తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన భారతీయ మూలాలున్న వివేక్‌ రామస్వామి చివరి వరకు పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మీద పోటీలో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు మరొక ప్రచారం. జూలై 13వ తేదీన జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి తమ్మెకు గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని పట్టుకొని కాల్చి చంపారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రహస్య భద్రతా సిబ్బంది డైరెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రంప్‌ మద్దతుదారైన ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ తాజా ఉదంతం మీద స్పందించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్యాయత్నాలు అధ్యక్షుడు జోబైడెన్‌, పోటీలో ఉన్న కమలాహారిస్‌ మీద ఎందుకు జరగటం లేదు, ట్రంప్‌ మీదనే ఎందుకు అంటూ ‘ఎక్స్‌’ ద్వారా మస్క్‌ స్పందించాడు. ఇది అత్యంత బాధ్యతారహితం అని అనేక మంది గర్హించారు. ట్రంప్‌కు ఏమీ కానందుకు జో బైడెన్‌, కమలా హారిస్‌ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అధ్యక్షులు గనుక గోల్ఫ్‌ ఆడితే ఆ మైదానం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడతారు. ట్రంప్‌ మాజీ గనుక అలాంటి రక్షణ కల్పించలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికాలో హింసాకాండకు తావులేదని ఎక్స్‌లో కమల స్పందించారు. అమెతో జరిగిన సంవాదంలో ట్రంప్‌ వెనుకబడినట్లు సర్వేలు తేల్చిన తరువాతే ఈ ఉదంతం జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒకవేళ ఓడితే ఫలితాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా, గతంలో మాదిరే అనుచరులను రెచ్చగొట్టి దాడులకో మరొకదానికో పాల్పడతాడా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు ఐదవ తేదీ దగ్గర పడేకొద్దీ అనూహ్యపరిణామాలు సంభవిస్తాయోమోనని భావిస్తున్నారు. జో బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్‌ ముందంజలో ఉన్నాడు. తొలిసారి హత్యాయత్నం తరువాత ఆధిక్యత మరింత పెరిగి విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడింది. కమలాహారిస్‌ రంగ ప్రవేశంతో అదంతా తారుమారైంది. తీవ్రమైన పోటీ స్వల్ప ఆధిక్యంలో కమల ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. సెప్టెంబరు పదవ తేదీన వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్‌ తేలిపోయాడు. కొన్ని సర్వేలు కమల 23పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్లు పేర్కొన్నాయి. తరువాత జరిగిన మరికొన్ని సర్వేలలో కూడా ఆమెదే పైచేయిగా ఉంది.దాంతో తాను మరోసారి ఆమెతో బహిరంగ చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని ట్రంప్‌ సంచలన ప్రకటన చేశాడు. దీంతో పోలింగ్‌కు ముందే ఓటమిని అంగీకరించి నట్లు కావటంతో మాటమార్చాడు. పిచ్చోడు ఎప్పుడేం మాట్లాడ తాడో ఏం చేస్తాడో తెలియదు, ట్రంపు కూడా అంతే. అక్టోబరులో జరిగే మరో రెండు చర్చల్లో పాల్గొనేదీ లేనిదీ చెప్పలేము. ఒక వేళ సిద్దపడకపోతేే పారిపోతున్నట్లుగానే ఓటర్లు భావిస్తారు.కమలతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని తానే ముందున్నట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతు ఇవ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడించటం లేదు రిగ్గింగు చేసినట్లు స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.
అమెరికా ఎన్నికల్లో మైలురాళ్లుగా చెప్పుకోవాల్సి వస్తే జూలై 15న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశం ట్రంప్‌ను, ఆగస్టు 19న కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం అభ్యర్థులుగా ఖరారు చేశాయి.సెప్టెంబరు పదిన ట్రంప్‌-కమల తొలి సంవాదం జరిగింది.నవంబరు ఐదున ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జనవరి ఆరున ఫలితాలను నిర్ధారిస్తారు.జనవరి 20న నూతన అధ్యక్ష పాలన ప్రారంభం అవుతుంది. ప్రముఖులుగా ఉన్నవారు, ఓటర్లను ప్రభావితం చేసే వారు కొందరు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరుస్తారు. ఎక్స్‌ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా ప్రముఖ గాయని, నటి, రచయిత్రి టేలర్‌ స్విఫ్ట్‌ కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది. ఎలన్‌ మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్‌ కుమార్తె వివియన్‌ జెనా విల్సన్‌ విరుచుకుపడింది.టేలర్‌ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్‌ చేస్తూ ” బాగుంది టేలర్‌..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా, నా జీవితాతం నీ కుక్కలకు కాపలా కాస్తా ” అని మస్క్‌ పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు. టేలర్‌ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్‌ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు.
ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోయినా కమ్యూనిజం, సోషలిజాల గురించి పెద్ద చర్చే నడుస్తున్నది. గతకొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా అనేక మంది బుర్రల్లో అది రాయిలా గడ్డకట్టింది. తాను గెలవాలంటే పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక అస్త్రంగా చేసుకోవాలని ట్రంప్‌ ఎంచుకున్నాడు.దానిలో భాగంగా ‘కామ్రేడ్‌ కమల మన దేశానికి భయంకరమైన వ్యక్తి. అమె ఒక మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు, ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉన్నారు, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటారు, ఎన్నుకుంటే అమెరికా చరిత్ర ముగిసినట్లే’ అని న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ ప్రసంగంలో అన్నాడు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి, స్వేచ్చను తిరస్కరిస్తూ మార్క్సిజం, కమ్యూనిజం, ఫాసిజాలను అనుసరిస్తున్నారన్నాడు. ఆమె రూపంలో స్టాలిన్‌ జన్మించాడని చెప్పాడు. మౌలికంగా కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా ఆమె కమ్యూనిస్టు టోపీ, ఎర్ర కోటు ధరించినట్లు ఒకటి, ఇంకా కమ్యూనిస్టు అని చెప్పే రకరకాల చిత్రాలను సృష్టించి వైరల్‌ చేయించాడు. కమల అభ్యర్థిగా నిర్ణయంగాక ముందే డెమోక్రటిక్‌ పార్టీని దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు అని వర్ణించాడు. మన ప్రత్యర్థిని ఒక కమ్యూనిస్టు,సోషలిస్టు లేదా అమెరికాను నాశనం చేసే మరోవ్యక్తిగా చిత్రించి ప్రచారం చేయాలని తన మద్దతుదార్లను బహిరంగంగానే కోరాడు.ఎలన్‌మస్క్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాడు. సోవియట్‌ నాయకుల మాదిరి కమల బొమ్మలను సృష్టించాడు.ఆమెను తొలి రోజు నుంచే ఒక కమ్యూనిస్టు నియంతగా మార్చాడు. అమెరికన్ల ఆర్థిక స్వేచ్చను హరించేందుకు సిద్ధంగా ఉన్న ఒక సోషలిస్టు అంటూ వ్యాఖ్యలను జోడించి ప్రచారంలో పెట్టాడు.
కమలా హారిస్‌ కమ్యూనిస్టు కాదు, డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న ఉదారవాదుల్లో ఒకరు మాత్రమే. డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ కొన్ని అంశాలలో ఆమె వైఖరిని బట్టి పురోగామివాదిగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో గాడిద(డెమోక్రటిక్‌ పార్టీ)-ఏనుగు (రిపబ్లికన్‌ పార్టీ) గుర్తుల మీద ఎవరు పోటీ చేసినా రెండింటినీ బలపరిచే కార్పొరేట్లకు ఆమోదమైతేనే రంగంలో ఉంటారు. కమల కూడా అంతే. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహించే గోల్డ్‌మన్‌ శాచస్‌ సంస్థ ట్రంప్‌ కంటే కమల మెరుగని పేర్కొన్నది. ఆమె గెలిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు శక్తి వస్తుందని, ట్రంప్‌ వస్తే దెబ్బతిం టుందని చెప్పింది. కమ్యూనిస్టు నియంత మెరుగని ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులు ఎలా చెబుతున్నా రంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడిదారుల చక్రవర్తి ట్రంప్‌ ఆర్థిక ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్టు కామ్రేడ్‌ కమల చెబుతున్నదాని కంటే లోటు ఐదు రెట్లు పెరుగుతుందని తటస్థంగా ఉంటే పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ నమూనా నివేదిక చెప్పిందని ఒకరు పేర్కొన్నారు. ఇంతకీ కమల లేదా డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్నదేమిటి ? యాభైవేల డాలర్లతో ప్రారంభించే చిన్న అంకుర సంస్థలకు పన్ను రాయితీలను వర్తింపచేయటం, బడా సంస్థలకు పన్నులు పెంచటం, దీన్నే కమ్యూనిజం అంటున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెట్టటాన్ని కూడా సోషలిజం అని వర్ణించేబాపతు ఇలా చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది?
వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ అనే మీడియాతో కమలాహారిస్‌ మాట్లాడిన అంశాలను రిపబ్లికన్లు కమ్యూనిజంగా వర్ణించటాన్ని పురోగామి మార్పు ప్రచార కమిటీ స్థాపకుల్లో ఒకరైన ఆడమ్‌ గ్రీన్‌ ఎద్దేవా చేశాడు. రానున్న వారాల్లో గుడ్ల ధర ఏడు నుంచి తొమ్మిది డాలర్లకు పెరగటాన్ని అడ్డుకుంటామని కమలా హారిస్‌ చెబుతు న్నారు, మితవాదులు దాన్నే గనుక కమ్యూనిజం అంటే అత్యధిక అమెరికన్లు దాన్నే కోరుకుంటారు, మీరేం మాట్లాడుతున్నారో అర్ధమౌతోందా అని గ్రీన్స్‌ ప్రశ్నించాడు.ధరలను అదుపు చేయటాన్ని కూడా ట్రంప్‌ కమ్యూనిజంగా వర్ణించాడు. కరోనా కాలం నాటితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో ధరలు 20శాతం పెరిగాయి.నిజవేతనాలు గణనీయంగా పడిపోతున్నా యి. అందుకే బతుకు దుర్భరమౌతున్న కారణంగా అనేక మంది యువతకు సోషలిజం, కమ్యూనిజాల గురించి తెలియకపోయినా అదే కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ వంటి వారు చేసే విపరీత ప్రచారం వాటి గురించి ఆసక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ దేశాల్లో చేస్తున్న సర్వేల్లో యువతలో సోషలిజం పట్ల సానుకూలత వెల్లడి అవుతున్నది. అమెరికాలో డెమోక్రాట్లను కమ్యూనిస్టులని ప్రచారం చేయటం ఇదే మొదటి సారి కాదు. ఈ ఎన్నికల్లో అది మరింతగా పెరిగింది.

– ఎం కోటేశ్వరరావు, 8331013288.