
– వడ్డీ పెరుగుతుందని ఆందోళన.?
– డీడీలు వాపస్ ఇవ్వాలని వేడుకోలు
నవతెలంగాణ – మల్హర్ రావు
గొల్ల,కురుమలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం రాయితీపై గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గొర్రెల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.మండలంలో వందలాదిమంది గొర్రెలపై ఆధారపడి బతుకుతున్నారు.అయితే ప్రభుత్వం చేపట్టిన రాయితీ గొర్రెల పథకం ద్వారా మండలంలో 551 లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా 59మంది యునిట్లు పొందేందుకు గొల్ల,కురుముల అప్పట్లో అప్పు చేసి మరి డీడీలు తీశారు.ప్రస్తుతం పథకం మనుగడ ప్రశ్నర్థకం కావడంతో డిడిలు వాపస్ ఇవ్వాలని వేడుకొంటున్నారు.
రెండు విడతల్లో పంపిణీకి నిర్ణయం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 ఏప్రిల్ 4న 75శాతం రాయితీపై రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. గ్రామపంచాయితీల్లో మండల పశు వైద్యాధికారి,ఎంపిడిఓ,తహశీల్దార్ సబ్యుల బృందం డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు.తొలి విడతలో మండలంలో 521 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు.తరువాత కరోనా ప్రభావం,ఇతర కారణాలతో ఈ పథకం ముందుకు సాగలేదు.ఆతరువాత రెండో విడత కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం డీడీలు తీసుకుంది.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొందరికి రాయితీ గొర్రెలు పంపిణీ చేసింది.తొలి విడతలో మాదిరిగా అందరికి గొర్రెలు ఇస్తారని ఆశపడిన లబ్ధిదారులు ఆశపడి మరి డీడీలు చెల్లించారు. అయితే అప్పులకు వడ్డీ పెరుగుతూ వస్తుంది.కానీ రాయితీ గొర్రెలు రాలేదు.
వాపస్ ఇవ్వాలి: గత అసెంబ్లీ ఎన్నికల ముందు గొర్రెలు పంపిణీ చేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం హడావిడి చేసింది.తొలివిడుతలో అక్రమాలు చోటు చేసుకున్నాయని,రెండో విడతలో పారదర్శకంగా చేపడుతామని స్పష్టం చేసింది.కానీ బిఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి చెందడంతో రాయితీ గొర్రెల పథకంపై స్పష్టత కరువైపోవడంతో డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.తాము కట్టిన డీడీలు వాపస్ ఇవ్వాలని మండలంలో 551 మంది దరఖాస్తులు పెట్టుకోగా, డీడీలు చెల్లించిన 59 మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఇదే విషయంపై మండల పశువైద్యాధికారి జగపతిరావు ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు.
చెల్లింపులు..అప్పులు: మండలంలో మొత్తం 9 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు ఉన్నాయి.ఇందులో మొదటి విడతలో 521 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకొన్నారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.1.25 లక్షల కాగా, లబ్ధిదారులు తమ వాటా రూ.31.250 చెల్లించారు.మిగతా సొమ్ము ప్రభుత్వం రాయితీ ఇచ్చింది.ఒక్కో యూనిట్ కు 20 గొర్రెలు ఒక పోటెల్ ని అందించింది.
రెండో విడతలో మొత్తం 551 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకొన్నారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.43.750 చొప్పున 59 మంది డీడీలు తీయగా నేటికి ఒక్క యూనిట్ గొర్రెలు కూడా మంజూరు కాకపోగా డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రె రాలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి.
వడ్డి రెట్టింపు అయింది..దొంగల చిన సమ్మయ్య ఆన్ సాన్ పల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు తెచ్చి.రూ.44 వెలు డిడి తీసిన.వడ్డీ రెట్టింపు అయింది.ఇప్పటి వరకు గొర్రెలు ఇవ్వలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలు లేదా, డబ్బులు వడ్డీతో వాపస్ ఇవ్వాలి.
ఉపాది చూపించాలి: అక్కల బసపు యాదవ్ , గోళ్లకుర్మ సంఘము నాయకుడు: బీఆర్ఎస్ మాట తప్పిందని కాంగ్రెస్ కు ఓటేసినం.రేవంత్ రెడ్డి అందరికి అన్ని చేస్తున్నారు.గత ప్రభుత్వం కంటే రెట్టింపు చేస్తామన్నరు.కానీ గొర్రెల స్కింపై స్పష్టత ఇవ్వలేదు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు: జగపతి రావు…మండల పశు వైద్యాధికారి: మండలంలో మలివిడత గొర్రెల పంపిణికి ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు చేపడుతాం.మండలంలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 551 మంది దరఖాస్తులు చేసుకోగా 59 మంది బ్యాంకుల్లో డీడీలు చెల్లించారు.రెండో విడుతపై ప్రభుత్వ మార్గదర్శకాలు రాలేదు.