– విదేశీ రుణాలు రూ.52 లక్షల కోట్లు
– కరెంట్ ఖాతా లోటు ప్రమాద ఘంటికలు : ఆర్‌బీఐ రిపోర్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: భారత దేశం అప్పుల కుప్పగా మారింది. మరోవైపు దేశ ఎగుమతులు క్షీణించడం, దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఎగిసిపడి.. తద్వారా కరెంట్ ఎకౌంట్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగిందని ఆర్‌బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఏడాది జూన్ చివరి నాటికి విదేశీ రుణాలు 629.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.52 లక్షల కోట్లకు సమానం. గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించిన గణంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది మార్చి చివరి నాటికి 624.3 బిలియన్లుగా ఉన్న విదేశీ అప్పులు మరో 4.7 బిలియన్లు పెరిగాయి. ”2023 మార్చి చివరి నాటికి జీడీపీలో విదేశీ అప్పులు 18.8 శాతంగా ఉండగా.. 2023 జూన్ చివరి నాటికి 18.6 శాతంగా నమోదయ్యాయి. ఇందులో 54.4 శాతం వాటాతో అమెరికన్ డాలర్ విలువ కలిగిన రుణాలున్నాయి. భారత రూపాయల్లో 30.4 శాతం, ఎస్‌డిఆర్ 5.9 శాతం, యెన్ 5.7 శాతం, యూరో 3.0 శాతం చొప్పున నిష్పత్తి విలువ కలిగిన అప్పులున్నాయి.” అని ఆర్‌బీఐ తెలిపింది. జూన్ 2023 చివరి నాటికి దీర్ఘకాలిక రుణం (ఒక సంవత్సరం పైన ఉన్న అసలు మెచ్యూరిటీతో) 505.5 బిలియన్ల అప్పులున్నాయి. ఇది ఇంతక్రితం త్రైమాసికం ముగింపుతో పోల్చితే 9.6 బిలియన్లు పెరిగింది. మొత్తం విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల వాటా (ఒక సంవత్సరం వరకు మెచ్యూరిటీతో) 2023 మార్చి చివరి నాటికి 20.6 శాతం నుండి ఈ ఏడాది జూన్ చివరి నాటికి 19.6 శాతానికి తగ్గాయి. మోడీ ప్రభుత్వం స్వల్ప కాల అప్పులను తగ్గించుకుని.. దీర్ఘకాల రుణాలను పెంచుకోవడం ద్వారా ప్రజలపై మరింత అదనపు భారం మోపినట్లయ్యింది.
ఏడు రెట్లయిన కరెంట్ ఖాతా లోటు
భారత కరెంట్ ఎకౌంట్ లోటు (సిఎడి) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సిఎడి ఏకంగా ఏడు రెట్లు ఎగిసి 9.2 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం త్రైమాసికంలో ఇది 1.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండ టంతో విదేశాలకు భారత చెల్లింపులు అధికంగా ఉండటమే కరెంట్ ఎకౌంట్ లోటు. గడిచిన జూన్ త్రైమాసికంలో జిడిపిలో కరెంట్ ఎకౌంట్ లోటు 1.1 శాతా నికి పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది. వాణిజ్య లోటు పెరగడంతో కరెంట్ లోటు ఎగిసిందని పేర్కొంది. ”ప్రధానంగా కంప్యూటర్, ట్రావెల్, వ్యాపార సేవల ఎగు మతుల క్షీణత కారణంగా నికర సేవల రసీదులు క్రమంగా తగ్గాయని తెలిపింది. 2023 జూన్ త్రైమాసికంలో భారత సరుకుల వాణిజ్య లోటు 55.6 బిలియన్లకు పెరిగింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో త్రైమాసికంలో ఇది 52.6 బిలియన్లుగా చోటు చేసుకుంది. మరోవైపు విదేశాల్లోని భారతీయుల రెమిటెన్స్‌లు 28.6 బిలియన్ల నుంచి 27.1 బిలియన్లకు తగ్గాయి. ప్రస్తుత జులై – సెప్టెంబర్ త్రైమాసికంలో కరెంట్ ఎకౌంట్ లోటు నిష్పత్తి రెండితలు పెరిగి జిడిపిలో 2.4-2.6 శాతం వరకు చేరొచ్చని ఎంకేె గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ లీడ్ ఎకనామిస్ట్ మాధవి అరోరా పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్‌లో సిఎడి 19-21 బిలియన్లకు ఎగిసి జిడిపిలో 2.3 శాతానికి చేరే అవకాశం ఉందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు.