పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు

– హరీశ్‌ సభను, ప్రజలనూ తప్పుదోవ పట్టిస్తున్నారు
– కాగ్‌, కేంద్రం గత సర్కార్‌కు అక్షింతలు వేసింది : ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్ర అప్పులు, ఆర్ధిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌పై స్పీకర్‌ స్వల్పకాలిక చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆర్ధిక వింధ్వంసానికి పాల్పడిందని విమర్శించారు. వివిధ రకాలు చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులతో పాటు మరో రూ.40 వేల కోట్లు పలు విభాగాలకు బకాయిలు పెట్టారని గుర్తు చేశారు.
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్‌ పత్రాల్లో తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు. ఇప్పటి ఏ ఆర్ధిక మంత్రి పెట్టని విధంగా నాన్‌ రిస్క్‌ అనే కొత్త పదాన్ని సృష్టించి అటు ఆర్బీఐని, కాగ్‌ను, కేంద్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హరీశ్‌ చెప్పినట్టుగా తాము చేసిన అప్పులు గత సర్కార్‌ వడ్డీలకే సరిపోతోందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.1,06,247 చేసినా, రూ.1,18,306 కోట్లను బ్యాంకులు, వివిధ సంస్థలకు చెల్లించామని పేర్కొన్నారు. తామే అదనంగా రూ.12,117 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే హరీశ్‌రావు సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అప్పులు చేసిన గత సర్కార్‌ వాటిన ఆస్తులు పెంచేందుకు కాకుండా దుబారా ఖర్చు చేసిందని ఆరోపించారు. సభను తప్పుదోవ పట్టించిన సదరు సభ్యునిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇవ్వాలని అన్నారు.