నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రుణమాఫీ కి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకుగాను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వివిధ అంశాల పై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రుణమాఫీ కింద జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయిన రైతులు సుమారు 83000 మంది ఉండగా, ఇప్పటివరకు 80 వేలమందికి వారి ఖాతాలలో రుణమాఫీ మొత్తం జమైందని, తక్కిన వారివి వివిధ కారణాల వల్ల జమ కాలేదని, వాటన్నింటిని నిశితంగా పరిశీలించి సోమవారం సాయంత్రం వరకు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల విభాగాలను అన్ని బ్యాంకులలో సైతం ఏర్పాటు చేయాలని, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాలను మాఫీ జమ చేయడం లేదా కారణాలను తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలోని అర్హులైన రైతులందరితో రైతు బీమా చేయించాలని, నెలాఖరు వరకు రైతు భీమా రెన్యువల్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.నిరంతరం వర్షాలు కురుస్తున్నందున వనమహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమం పై దృష్టి సారించాలని వచ్చేవారం మొత్తం ఆయా శాఖలకు, మండలాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.మహిళా శక్తి లో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ఎంటర్ప్రైజెస్, పాడి గేదెలు, క్యాంటీన్లు, బ్యాక్ యాడ్ పౌల్ట్రీ , వంటి అంశాలలో లక్ష్యాన్ని సాధించేలా ఏపీఎం లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఎంపీడీవోలు సంబంధిత ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సబ్ సెంటర్ల ఎమ్ఎల్ హెచ్పి లతో సమావేశం నిర్వహించాలని, గ్రామాలలో మాతా శిశు సంరక్షణ, ఎన్సీడీలపై ప్రత్యేక దృష్టి కెంద్రీకరించాలన్నారు. ఆశ, సబ్ సెంటర్ల పనితీరులపై సమీక్షించాలని, గ్రామీణ స్థాయి వరకు వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని, గురువారం గ్రామాలలో గ్రామ బృందాలు, మున్సిపల్ బృందాలు ఆరోగ్య సేవలను తనిఖీ చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉపాధి హామీ కింద చేపట్టనున్న ఉద్యాన మొక్కల పెంపకం తదితరాంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు హాజరయ్యారు.