– రైతులకు న్యాయం చేయాలి
– ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యులు జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రుణమాఫీ జీఓ నెంబర్ 567ను సవరించి రైతులకు న్యాయం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రూపొందించిన నిబంధనల్లో గల అంశాలను సవరించి రూ.రెండు లక్షల వరకు రుణం పొందిన రైతులకు లబ్ది కలిగేటట్టు సవరించాలని కోరారు. ప్రభుత్వ జీఓ ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా ఉన్న వారందరికీ ఒకే కుటుంబంగా పరిగణించి, ఒకే వ్యక్తికి రుణమాఫీ వర్తింపజేయడం వల్ల కుటుంబంతో విడిపోయిన వారికి వర్తించ బోదని తెలిపారు. ఆధార్ కార్డు, పాస్‌బుక్ డేటా, పీడీఎస్ స్టేషన్ డేటా ఒకటిగా ఉన్నవారికి వర్తింపజేస్తామనడం సరికాదని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, రేషన్ కార్డు లేని కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వివరించారు. పాస్ పుస్తకాల కోసం ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు ప్రజా పాలన సర్వేలో తేలిందని తెలిపారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయం కోసం రుణం తీసుకున్న స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), జాయింట్ లయబిలిటీ గ్రూప్, రైతుమిత్ర గ్రూప్, కౌలుదారులకు ఇచ్చిన రుణ అర్హత కార్డు ఉన్నవారికి రుణమాఫీ వర్తించబోదంటూ ప్రకటించడం సరైంది కాదని తెలిపారు. వాస్తవానికి ఈ నాలుగు గ్రూపుల్లోని వారు అత్యంత పేదలే కాక దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలలో ఉన్న వారే ఎక్కువని వివరించారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలకు కూడా రుణమాఫీ వర్తించబోదంటూ నిబంధన పెట్టడం వల్ల గతంలో కరువు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు బ్యాంకులు రుణాలు మూడు నుంచి ఐదేండ్ల వాయిదాలపై షెడ్యూల్ చేశాయని తెలిపారు. వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రూ.రెండు లక్షలకుపైగా అప్పు తీసుకున్న వారు ఆపైన ఉన్న రుణం చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందంటూ నిబంధనలు పెట్టడం వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. పీఎం కిసాన్ డేటాకు రుణమాఫీని జోడించడం వల్ల చాలామంది రైతులు అర్హతను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ బ్యాంకులు 43 లక్షల మందికి మాత్రమే అప్పులు ఇచ్చాయని వివరించారు. పీఎం కిసాన్ పథకం కింద 31 లక్షల మందికి వర్తింపజేశారని తెలిపారు అందువల్ల పీఎం కిసాన్ డేటాను వర్తింపజేయడం వల్ల రైతులు రుణమాఫీ పొందలేక పోతారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ తొమ్మిది తర్వాత రీ షెడ్యూల్ చేసిన రుణాలకు లేదా బుక్ అడ్జస్ట్‌మెంట్ చేసిన రుణాలకూ రుణమాఫీని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకనుగుణంగా జీవోను సవరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.