పల్లె పాలనకు అప్పులు!

Debts for rural governance!– పంచాయతీల్లో ఆరు నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన
-అప్పటి నుంచి నిర్వహణ నిధులు ఇవ్వని ప్రభుత్వం
– అత్యవసర పనులకు అప్పులు చేస్తున్న కార్యదర్శులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో 24 వేల పైచిలుకు జనాభా ఉంది.గ్రామాల్లో సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రత్యే కాధికారుల పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి గ్రామంలో మోటార్ల మరమ్మతు, బ్లీచింగ్ కొను గోలు, వీధి దీపాల ఏర్పాటు వంటి చిన్నచిన్న మెయిన్ టెయిన్స్ కోసం ఆరు మాసాల కాలంలో రూ.దాదాపు 9 లక్షల పై చిలుకు ఖర్చయింది. ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. ఆ పంచాయతీ కార్యదర్శులు సొంతంగా రూ.9 లక్షలు అప్పు చేసి గ్రామాల్లో పనులు చేపటారు.ఇది మండలంలోని పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి. పంచాయతీ కార్యదర్శులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగు తోంది. అప్పటి నుంచి ప్రభుత్వం ద్వారా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే సొంతంగా గ్రామాల్లోని పనులకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పంచాయతీ నిర్వహణ,మరమ్మతు పనులు తదితర వాటికి అప్పులు చేపి పనులు చేస్తున్నారు.ఎప్పటికప్పుడు ప్రభు త్వం నుంచి బిల్లులు రాకపోవడంతో వారు అప్పు లతో అవస్థలు పడుతున్నారు. మండలంలో 15 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు గత ప్రభుత్వం రాష్ట్ర, కేంద్ర ఆర్థిక సంఘాలు నిధులు ఇచ్చాయి. ఎన్నికల ముందు నుంచే రాష్ట్ర నిధులు ఆగిపోవడం, కేంద్ర నిధులు కూడా వెనకాముందు వస్తుండటంతో పంచాయతీల్లో పాలకవర్గాలు చివరలో అత్యవసర పనులకు సర్పంచ్లు అప్పులు తెచ్చి పనులు నిర్వహించారు. ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయింది. ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల చేయలేదు.గతంలో సర్పంచ్లు ఉండటంతో వారే అన్నీ చూసు కునేవారు. ప్రస్తుతం కార్యదర్శులపైనే ఆ భారం పడింది.
అప్పు తెచ్చి పనులు చేస్తున్న కార్యదర్శులు..
గ్రామ పంచాయతీల్లో నీటి సరఫరా మోటార్ల మర మ్మతు, చెత్త సేకరణ ట్రాక్టర్ డీజిల్, బ్లీచింగ్ కొనుగోలు, స్ట్రీట్ లైట్లు కాలిపోతే కొత్తవి వేయడం వంటి పనులన్నీ అత్యవసరమైనవి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్న ప్రభుత్వం పైసలు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే సొంతంగా అప్పుతెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వం రెండు రోజుల క్రితం పంచాయతీల్లో పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్ల వేతనాలను మంజూరు చేసింది. కానీ పంచాయతీ నిర్వహణకు సం బంధించి నిధులు విడుదల చేయకపోవడంతో కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారు.