భూగోళం పుట్టుక, మానవ సమాజ పరిణామ క్రమం గురించి అభ్యుదయ కవితా సారథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ‘ఆ చల్లని సముద్రగర్భం’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో శ్రమదోపిడీ ఎంత అమానుషంగా ఉండేదో పైచరణంలో తెలియజేశారు. దశాబ్దాలు మారాయి. భూస్వామ్యవ్యవస్థ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థగా మారింది. ఫైనాన్స్ కాపిటల్ ఆధిపత్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పట్టుబిగించింది. కానీ శ్రమజీవుల రక్తమాంసాలు, చెమట ద్వారానే సంపద సృష్టించబడుతుందనీ, ఆ శ్రమ దోపిడీ ద్వారానే తమ లాభాల దాహాన్ని తీర్చుకొని ధనవంతులు, అపర కుబేరులు, బిలియనీర్లుగా ఎదుగుతారనే సత్యం మారలేదు సరికదా బ్రిటిష్ వలస పాలనకంటే కొత్త అవతారాలెత్తింది. శ్రమ దోపిడీ ఇంకా పెరిగింది. దాశరథి ఆశించిన ‘అన్నార్తులు, అనాథలుండని నవయుగం’ ఇంకా ఇంకా దూరమయ్యింది. ఆరోజు భూస్వాములు వేసిన బాటలోనే ఈనాటి కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వరంగ సంస్థలు కూడా నడుస్తున్నాయి. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పులను నిర్భయంగా తుంగలో తొక్కి తమ లాభాలను పెంచుకుంటు న్నాయి. శ్రమ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎన్డీయే ఏలుబడి లో గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన పరిస్థితిని పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని అర్ధమవుతుంది.
అనేక అవతారాలెత్తిన బ్యాంక్ ఉద్యోగాలు
ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు కేంద్రప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి కార్మిక చట్టాలను, మార్గదర్శకాలను అమలు చేయటం వాటి కనీస బాధ్యత. సమాన పనికి సమాన వేతనం చెల్లించటం చట్టరీత్య తప్పనిసరి. ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. బ్యాంకింగ్ రంగంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకత్వంలో పెద్ద ఉద్యమాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ప్రభుత్వం 1987లో జస్టిస్ ఓబుల్ రెడ్డి కమిషన్ నియమించింది. మూడేండ్ల సుదీర్ఘ వాదనల తరవాత ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేసేపనే చేస్తున్న గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల జీతాలనే చెల్లించాలని తీర్పునిచ్చింది. సమాన పనికి సమాన వేతనం బ్యాంకింగ్ రంగంలో అమల్లోకి వచ్చింది. కానీ గత పదేండ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన బ్యాంకింగ్ సంస్కరణలు సమాన పనికి సమాన వేతన నిబంధనలను తల్లకిందులు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా లాభాల సంపాదనే ప్రధాన లక్ష్యంగా మార్చిన దరిమిలా శ్రమదోపిడే బ్యాంకుల విధానంగా మారింది. డబ్బుతో వ్యాపారం చేసే సున్నిత రంగంలో ఖాతాదారులు భద్రతకోసం బ్యాంకులలో పర్మినెంట్ ఉద్యోగులే పనిచేయాలనే నియమం అమలయ్యేది. ఆ నియమాన్ని నీరుగారుస్తూ నిరుద్యోగులను, బ్యాంకు ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురిచేస్తూ అనేక పథకాలు రూపొందించబడ్డాయి.
2021-2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, ప్రయివేటు బ్యాంకులతో పోటీపడి లాభాలు సంపాదిస్తున్నా ఖర్చు – ఆదాయనిష్పత్తి (కాస్ట్ టు ఇన్కమ్ రేషియో) ఎక్కువగా ఉండటం వలన స్టేట్ బ్యాంక్ నికర లాభాలు తక్కువగా ఉన్నాయని పత్రికా సమావేశంలో చెప్పారు. అంటే ఖర్చు తగ్గించుకోవాలని ఆయన తాత్పర్యం. ఆరోజు తెలియదు అది నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుందని. మూడు నెల్ల తర్వాత ‘స్టేట్ బ్యాంక్ ఆపరేషన్స్ సపోర్ట్ సర్వీసెస్’ (ఎస్బిఓఎస్ఎస్) అనే అవుట్సోర్సింగ్ కంపెనీని స్వంతగా (రిజర్వ్ బ్యాంక్ అనుమతితో) స్థాపించింది. స్టేట్ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న శాఖలు నడపటానికి కావలసిన కాంట్రాక్టు ఉద్యోగులను ఎంపిక చేయటం ఆ కంపెనీ ఉద్దేశ్యం. స్టేట్ బ్యాంక్‌లో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు వారికి వర్తించవు.
అప్పటికే రిజర్వ్‌బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లనే స్కీమ్ రూపొందించింది. ఖాతాదారుల నుంచి డబ్బు జమచేసు కోవటం, ఖాతా నుండి డబ్బు ఇవ్వటం, డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇవ్వటం, చెక్కులు ఖాతాలో జమ చేయటం లాంటి పర్మినెంట్ ఉద్యోగులే చేసే అనేక పనులు వీళ్లూ చేస్తారు. అన్ని బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క విధమైన జీతాలు. చేసిన వ్యాపారం మీద కమీషన్, లేక కొంత నిర్దిష్ట కమీషన్ కొంత జీతం. కొన్ని బ్యాంకులలో బ్యాంక్ శాఖల నుంచి, కొన్ని బ్యాంకులలో నిర్దిష్టమైన ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులో మన రాష్ట్రంలో నెల రోజులు పనిచేసి రూ.రెండు వేల అతి తక్కువ ఆదాయంతో, కొంతమంది రూ.6 వేలు, రూ.10 వేల లోపు సంపాదనతో బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. కొన్ని బ్యాంకులలో మాత్రమే నిర్దిష్ట జీతాలు ఉన్నాయి. ఈవిధంగా అరకొర జీతాలతో బ్యాంకులలో 35 లక్షల మంది బిజినెస్ కరస్పాండెంట్లున్నారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 15 లక్షల మంది. అంటే ఉద్యోగుల సంఖ్య కంటే రెట్టింపు పైగా బిజినెస్ కరస్పాండెంట్లున్నారన్న మాట.
ఇంతేనా? ఇంకా నిర్ఘాంత పోయే రూపాలలో శ్రమదోపిడీ బ్యాంకులను ఏలుతుంది. గత పదేండ్లకాలంలో బ్యాంకుల వ్యాపారం 270 శాతం పెరిగింది. పెరిగిన వ్యాపారానికి తగిన రిక్రూట్మెంట్ జరగలేదు సరికదా పదవీ విరమణ వలన, ఉద్యోగుల మరణం, పర్మినెంట్ ఉద్యోగాల్లో ఏర్పడిన ఖాళీలలో కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఉన్న ఉద్యోగుల మీద పనిభారం చెప్పలేనంతగా పెరిగింది. శాఖలు నడపలేని స్థితిలో టెంపరరీ, క్యాజువల్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తూ వస్తున్నారు. ఇన్స్పెక్షన్, రుణాల మంజూరు, రికవరీ, క్రెడిట్ కార్డు వ్యాపారం, ఏటీఎంలలో క్యాష్ పెట్టటం, క్యాష్ శాఖలకు సరఫరా చెయ్యటం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయివరకు, ఒకటేమిటి అన్ని విభాగాలలో అన్ని క్యాడర్లలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సుమారు లక్షన్నర మంది పర్మినెంట్ ఉద్యోగాలలో టెంపరరీ క్యాజువల్ కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లందరినీ పర్మినెంట్ చేయాలని ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతున్నా ప్రయోజనం లేదు. సమాన పర్మినెంట్ ఉద్యోగాలలో పనికి సమాన వేతనం మచ్చుకైనా మిగల్లేదు.
అన్యాయాన్ని ఎదిరించి ఓడించటమే ప్రధాన కర్తవ్యం
దేశంలో నిరుద్యోగం పెరిగి గత 45 ఏండ్లలో లేనంత ఎక్కువ స్థాయికి చేరిందని అనేక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగం చేసే వయసు (15-59 సం.లు) లో ఉన్న యువకులు, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన యువకులలో నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక అంతరాలు బ్రిటిష్ కాలంలో కంటే ఘోరంగా పెరిగాయి. 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ రేషన్ మీద ఆధార పడి జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో కుబేరులు సంఖ్య వారి వద్ద పోగుపడ్డ సంపద అందనంత ఎత్తుకు పెరిగాయి. నిరుద్యోగం, ఆకలి, అసమానతలు ఈ ప్రభుత్వ విధానాలు సృష్టించినవే. ఇది ప్రతి పౌరుడు గౌరవ ప్రదంగా జీవించే హక్కును కాలరాయటమే. పైన పేర్కొన్నది ఒక్క బ్యాంకింగ్ రంగంలో ఉన్న పరిస్థితే కాదు. ప్రతి ప్రభుత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఇదే పరిస్థితి. కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉన్న ప్రభుత్వ విధానాలు మారాలి. ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడమే సరైన పరిష్కారం. దీనివలన కోట్ల కుటుంబాలు సరైన విద్య వైద్యాన్ని పొందగలుగుతాయి. కార్పొరేట్ కంపెనీల లాభాల పెంపుకోసం, వారి సేవలో తరించే ప్రభుత్వం మారా లి. దానికి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు సువర్ణావ కాశం.ఈ నెల13న జరిగే ఎన్నికల్లో బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకులలో పని చేస్తున్న లక్షలాది మంది టెంపరరీ క్యాజువల్ కాంట్రాక్టు ఉద్యోగులు, బ్యాంకులతో ముడిపడి ఉన్న కోట్లాది మంది ఖాతా దారులు వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక పార్టీల అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి. సరైన విధాన రూపకల్పనకు ఉద్యమిం చటమే దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కారం.
– పి.వెంకట్రామయ్య
9553533815