– అంచనాలకు బడ్జెట్‌కు పొంతన లేదు
– ప్రతి ఏటా 20 శాతం లోటు రుణభారం ఉన్నా…
– ప్రజల ఆశలు నెరవేరుస్తాం
– అభివృద్ధి, సంక్షేమం, సంపద పంపకానికి అంకితభావంతో ఉన్నాం
– రోజువారి ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి : శ్వేతపత్రంపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
‘రాష్ట్రంలో పదేండ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది. బీఆర్‌ఎస్ ఇష్టానుసారంగా చేసి అప్పుల రాష్ట్రం కోలుకోని విధంగా దెబ్బతింది. రోజు వారి ఖర్చులు కూడా గడవని దుర్భర పరిస్థితిని కల్పించారు’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. వాస్తవాలు సభకు, తెలంగాణ సమాజానికి తెలియపర్చాలని శ్వేత పత్రాన్ని విడుదల చేశామే తప్ప మాకు ఎవరిపై కక్ష లేదని స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా, వనరుల లభ్యతపై అంచనా లేకుండా బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణభారం వదిలి వెళ్లినప్పటికీ ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కట్టబడి ఉన్నామని చెప్పారు. వచ్చే ఆదాయంతో వచ్చే సంపదతో సంక్షేమాన్ని అమలు చేస్తూ అందరికి సమానంగా పంచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రూ. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తప్పించుకునేందుకే కార్పొరేషన్లు, ఎస్వీయూల పేరుతో అప్పులు చేసినా అవి చెల్లించాల్సిన గ్యారంటీలిచ్చిన యజమానిగా ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్‌ఎస్ వద్ద పదేండ్లుగా పని చేస్తున్న అధికారుల ద్వారానే తాము శ్వేతపత్రం తయారు చేశామే తప్ప ఇతరులతో కాదని స్పష్టం చేశారు. తమకు తెలంగాణ అధికారులపై సంపూర్ణ నమ్మకం ఉందనీ, గత ప్రభుత్వానికి ఆ నమ్మకం లేకనే ఆంధ్ర క్యాడర్ వారిని సీఎస్, డీజీపీలుగా చేసుకోవడంతో పాటు రిటైర్డ్ అయిన వారితో నింపుకుందని ఎద్దేవా చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్రంలో అందరినీ సమసమాజం కోసం, సమానత్వం కోసం ముందుకు తీసుకెళ్లడమే తమ భావజాలమని తెలిపారు. బీఆర్‌ఎస్ భావజాలం అది కాదనీ, కనుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రెవెన్యూ రాబడి, జీఎస్డీపీ పెరిగితే అప్పులు చేస్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆర్థిక క్రమశిక్షణతో ప్రగతిపథంలో నడిపిస్తామని మాటిచ్చారు. ‘సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా రూపొందించిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. 2014 నుంచి 2023 వరకు అంచనాలకు వ్యయానికి మద్య సగటున 20 లోటు ఏర్పడింది. అన్ని వనరులున్న రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటూ అన్నింటా ముందున్నామని అబద్దాలను ప్రచారం చేసింది. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఖర్చు చేశారు. 70 ఏండ్లలో రూ. 70 వేల కోట్ల అప్పులు అయితే పదేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది. పరిమిత వనరులతో తెలంగాణలో కాంగ్రెస్ అనేక నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి లాంటి అనేక భారీ ప్రాజెక్టులతో పాటు 103 ప్రసిద్ద సంస్థలను నెలకొల్పాం’ అన్నారు.
భట్టి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తూ సత్యదూరంగా మాట్లాడుతున్నారన్నారు. రూ.ఐదు లక్షల కోట్ల అప్పులను రూ.ఏడు లక్షల కోట్లుగా చెబుతున్నారన్నారు. ఆదాయ వనరులు, తలసరి ఆదాయం, పంటల ఉత్పత్తి, వద్ధులకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆస్పత్రుల మెరుగుదల, ఇతర అభివృద్ధి పనులను ప్రస్తావించడం లేదని చెప్పారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంగా బీఆర్‌ఎస్ ఏర్పడిందని గుర్తుచేశారు. తర్వాత కరోనా, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణల మధ్య కాంగ్రెస్ తలపెట్టిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పూర్తి చేసి నీళ్లించిందన్నారు. వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఉపకారవేతనాలకు గ్రీన్‌చానల్ ఉండేదనీ, బీఆర్‌ఎస్ వచ్చాక ఎత్తేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టి, బీసీల హాస్టల్ భవనలాకు కిరాయిలు కూడా సరిగ్గా చెల్లించలేదని తెలిపారు. గురుకులాల విద్యార్థులకు ఏటా రూ.1.20 లక్షలు వెచ్చించినట్టు తప్పుడు లెక్కలు చెప్పిందనీ, వాస్తవంలో రూ.55 వేలకు మంచి ఇవ్వలేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ సర్కార్ రూ.ఒక లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం నుంచి లక్ష ఎకరాలకు మాత్రమే నీరిచ్చిందని తెలిపారు. పదేండ్లలో రూ.13.72 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. రూ.4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చిందని తెలిపారు. ఉన్నదంతా తెగనమ్ముకుని, ఆర్థిక విధ్వంసం చేసినా తాము బాధ్యాతాయుతంగా వాస్తవాలు చెప్పడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
బీజేపీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైన విషయం వాస్తవమనీ, తిరిగి ఎలా పునర్నిర్మిస్తారో చెప్పాలని కోరారు. సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణకు అనుమతించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక పీఆర్సీ ఇవ్వలేదని గుర్తుచేశారు. అదే విధంగా విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లు, సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్ల గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాలని కోరారు.