ఈ సల్తనత్ రాజులకు హిందూ రాజులతో వైరమే. కానీ, హిందూ కళలను, కళాకారులను తమ ఆస్థానంలో నియమించుకుని దక్షిణ భారతంలోని మధ్యయుగాల కళలను వారి కళలలో చేర్చుకున్నారు. బేరార్, బీదర్‌లలో చిత్రకళ సంప్రదాయం మిగలలేదు. అహమద్‌నగర్, బీజాపూర్, గోల్కొండలలో చిత్రం వృద్ధి చెందింది. ఇదే దక్కన్ (దక్షిణ) చిత్రంగా పిలువబడింది. ఈ చిత్రం క్రీ.శ. 16, 17 శతాబ్దాలలో ఎదిగి, వృద్ధి చెంది క్రీ.శ. 18,19 శతాబ్దాలలో చెదిరిపోయింది. ఆ సమయంలో భారతీయ ముస్లింలు, హిందువులు, తుర్కులు, పర్షియన్లు, అరబులు, ఆఫ్రికన్లు ఇంతమంది కళాకారులు వీరి ఆస్థానాలలో పనిచేస్తూ ఆనాటి చిత్రానికి ఒక కొత్త రసోత్పత్తి తీసుకువచ్చారు. దక్కన్ ఆస్థానాలలో ఈ రాజులు, మొగలుల కాలం కంటే ముందు భారతదేశంలో వున్న చిత్రకళా పద్ధతిని వీరు పైకి తీసి, పర్షియన్, తుర్కుల కళాపద్ధతులనూ వెలికి తీసి అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, హైదరాబాద్‌లలో లఘు చిత్రకళ వృద్ధి చేశారు.
ఆ సమయంలోనే యూరోపియన్లు భారతదేశం రావడం మొదలు పెట్టారు. వారు క్రైస్తవ మత ప్రచారం కోసం తెచ్చిన చిత్ర గ్రంథాలను చూసిన ఈ కళాకారులకు, వారి చిత్రశైలి ప్రేరణ ఇవ్వడం మొదలు పెట్టింది.
సల్తనత్‌వారి చిత్రాలు మొగలు చిత్రాలకంటే భిన్నమైన శైలి, విషయపద్ధతిలో వుంటాయి. మొగలులు ఎక్కువగా వారి జీవని విశేషాలను, వారి చరిత్ర, వారి పోట్రేటులు, నిజజీవిత విషయాలను, చిత్రాల విషయాలుగా చూపించడానికి ఇష్టపడేవారు. దక్కని రాజులు అలాంటి నిజ విషయాలను చూపడానికి తక్కువ అభిరుచి కలిగి వుండేవారు. దక్కన్ చిత్రంలో చిత్రకారుల నిపుణుత, హుందా చిత్రం గీయడం, చేయి తిరిగిన రేఖాచిత్రం, అందులోని రంగుల సంతులనం చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అందంగా మానవాకృతులను గీయడమే కాదు, వారు ఏదో నాటకంలో సంజ్ఞలతో సంభాషణలో వున్నట్లు కూడా చూపరులకు అనిపిస్తుంది. మొగలు చిత్రం భౌతిక రూపంలో చిత్రించి నిజానికి దగ్గరగా వున్న చిత్రాలు గీస్తే, వీరి చిత్రాలు నిజ జీవిత సంఘటిత విషయాలలో నిమగమైన భావ చిత్రాలు. ఇవి ఆలోచన వున్న జీవన చిత్రాలు. దక్కన్ చిత్రాల రీతి, సున్నిత భావన చూస్తే క్రీ.శ. 16 వ శతాబ్దపు ఇరాన్ – సఫావిద్ చిత్ర శైలిని గుర్తుతెస్తాయి. చిత్రాలలో గీసిన ప్రకృతి దృశ్యం చూస్తే అద్భుత కథలలోని ప్రకృతిని కథలా, కొండలు, చెట్లు వసంతకాలం, రంగుల పూలు మరో లోకంలోని ఊహలా చిత్రించారు. నదిని చిత్రిస్తే నది అంచులు ఒడ్డున కొసలు తేలి నేలలోనికి చొచ్చుకొని వచ్చి అవి పెద్ద పూలరేకుల్లా కనిపిస్తాయి. ఆ నది ఒడ్డున వున్న చిన్న పూల చెట్లు వూపుతున్న పూల తలలనీ, బంగారు, వెండి రంగులతో వేలాడుతున్న మబ్బుల కదలికని చిత్రించారు.
దక్కన్ చిత్రాలలో చిత్రకారుల సంతకాలు చాలాకొద్ది చిత్రాలపై కనిపిస్తుంది. దక్కన్ చిత్రం అందమైన చిత్రమనీ, అందులోనూ బీజాపూర్ చిత్రాలు ప్రసిద్ధి చిత్రం అనే అక్బరు, జహంగీర్ కూడా ఎంతో మెచ్చుకున్నారు. దక్కన్ చిత్రాలలో చిత్రానికి అంచులు ఎంతో అందంగా దిద్దుతారు. అలాంటి అంచులు చిత్రించమని జహంగీర్, మరికొద్ది మొగలు చక్రవర్తులు కూడా చిత్రకారులను అడిగి మరీ చిత్రించమనేవారు. అలా మొగలు దక్కన్ కలిసిన పద్ధతి ఒక కొత్త శైలి చిత్రం వెలువడింది.
అహమద్‌నగర్ : ఈ సల్తనత్‌లో చిత్రించిన మొదటి ఉదాహరణగా క్రీ.శ. 1565 లో చిత్రించిన 12 చిత్రాల గ్రంథం ‘తారీఫి – హుసేన్ షాహి’. ఇది ఒకటవ హుసేన్ నిజామ్‌షా యొక్క చరిత్ర. ఇతను క్రీ.శ. 1554 నుండి 1565 వరకూ రాజ్యం చేశాడు. ఇతనే తాలికోట యుద్ధంలో విజయనగరంపై విజయం సాధించటంలో ముఖ్యుడు. మాండూ (మధ్యప్రదేశ్) సల్తనత్‌లో చిత్రించిన నీమత్‌నామా ఒక చక్కటి చిత్రాల సంపుటి, బంగారు రంగు కూడా అద్ది చిత్రించబడింది. నీమత్‌నామా పాకశాస్త్రంపై రాసి చిత్రించిన వివిధ వంటకాల పుస్తకం. ఈ పద్ధతి చిత్రం మిగిలిన దక్కన్ రాజుల చిత్రశాలకు పాకి, వారు వేయించిన రాగమాల చిత్రాలలోనూ కనిపిస్తుంది. క్రీ.శ. 1590లో ఒక సంగీత విద్వాంసుడికోసం ‘రాగమాల’ చిత్రాలు గీయబడ్డాయి. ఇవి సంగీతంలోని వివిధ రాగాల ఆధారంగా చిత్రించిన చిత్రాలు. ఈ రాగమాల సంపుటిలో చక్కటి శైలిలో చిత్రాలు, ప్రకృతి దృశ్యం, అందమైన పాటలా సాగే చిత్రం తీరు పర్షియన్ బుఖారా చిత్ర పద్ధతి, మొగలుల చిత్రం కంటే ముందు వున్న భారతీయ చౌరపంచాశిక చిత్రం పద్ధతీ కనిపిస్తుంది. చౌరపంచాశిక, ఒక చోరుడు తన ప్రేయసి కోసం రాసిన 50 వేల కవితలు, పశ్చిమ భారత, జైన పద్ధతిలో చిత్రింపబడ్డాయని ఇది వరకే మాట్లాడుకున్నాం.
క్రీ.శ. 1565 నుండి 1588 వరకు రాజ్యం చేసిన సుల్తాన్ ముర్తాజా నిజామ్‌షా, ఎన్నో పోట్రేట్ చిత్రాలు గీయించాడు కానీ, అవి అంత చిత్ర నిపుణతని సంతరించుకోలేదు. చివరి దశలో క్రీ.శ. 1580 – 1590 మధ్య వెలువడిన అహమద్ నగర్ చిత్రాలు చక్కటి రేఖా చిత్రాలు, పర్షియన్ కలీగ్రఫీలా ఒక సంగీత రీతిలో కనిపిస్తాయి.
బీజాపూర్ : 2వ ఇబ్రహిం ఆదిల్‌షా ఇక్కడ క్రీ.శ. 1579 – 80 నుండి 1627 వరకు రాజ్యం చేసిన ఇతను స్వయంగా చిత్రకారుడు, కాలీగ్రాఫీలో నిపుణుడు. కవి, గాయకుడు కూడా. ఇక్కడ వేయబడ్డ చిత్రాలు అహమద్‌నగర్ కటే ఒక అందె ఎక్కువ వేసిన అందమైన చిత్రాలు. ఈ రెండవ ఆదిల్‌షా తన కుమార్తెను రాజకీయ కారణాల వలన అక్బరు కొడుకు దాని మాల్ కిచ్చి వివాహం చేశాడు. కూతురితో పాటు మొగలు ఆస్థానం పంపిన భరణంలో తన ఆస్థానంలోని గొప్ప చిత్రకారులు గీసిన చిత్రగ్రంథాలూ వున్నాయి. అందువలన 17వ శతాబ్దపు మొదటి భాగంలో మొగల్, దక్కన్ శైలి సమ్మేళన చిత్రలు వెలువడ్డాయి. ఈ ఇబ్రహీం ఆస్థానంలో వున్న జుహూరి అనే పేరెన్నికగన్న కవి తన కవితల సంపుటి ‘ఖానీ – ఖలీల్’ (భగవంతుడి స్నేహితుడి బల్ల)లో ఆనాడు ఆస్థానంలోని గొప్ప చిత్రకారులు, కలీగ్రఫీ వ్రాసేవారి పేర్లు నమోదు చేశాడు. అతని ప్రకారం ఫారుఖ్ హుసేన్ చేతిలో మంత్రదందం వుంచుకుని చిత్రం వేశాడా అన్నంత అందంగా చిత్రం వేస్తాడు. ఒక చిరుగాలి కదలికకి ఎంత చక్కగా జీవం పోస్తాడంటే, ఆ చిరుగాలి వలన ఒక సుందరి ముఖం మీది జలతారు పరదా కదిలిందని చూపి, గాలి కదలికని చిత్రించగలడు.
17వ శతాబ్దంలో చిత్రించిన యోగినీ చిత్రాలు సల్తనత్ ఆస్థానాలన్నింటా కనిపిస్తాయి. సన్యసించి లోక పరిత్యాగం చేసిన యోగినీలు తమ ధ్యానంలో, పరలోక చింతనలో వుంటారు. క్రీ.శ. 1640లో చిత్రించిన ఒక యోగినీ చిత్రం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో వుంది. ఆమె మహలు, భవంతులు దూరంగా వదిలి చెట్లు పొదలు ఆవరించి వున్న ఒక గుహ వంటి నిర్మానుష్య ప్రదేశంలో కూర్చుని జపమాలతో తన ధ్యానంలో నిమగమై వుంటుంది. ఆమె వస్త్రం అలలవలె సాగుతూ ఆమెను చుట్టి వుంటుంది. చిత్రం అంతా నలుపు మయంగా చిత్రించగా, తెల్లటి కొంగలు, పుష్పాలు మటుకే ఆ నలుపు విరిచి చిత్రం మనకు బోధపరుస్తాయి. తెలియని ఒక నిరాశ ఈ చిత్రంలో నిండి వుంటుంది.
క్రీ.శ. 1630 తరువాత ఈ ఆస్థానంలో నిలిచిన మొగలు రాయబారుల వలన బీజాపూర్ చిత్రం మీద మొగల్ చిత్ర ప్రభావం పడింది. క్రీ.శ.1627 నుండి 1656 వరకు రాజ్యం చేసిన మొహమద్ ఆదిల్‌షా పోట్రేట్ చిత్రం, షాజహాన్ పోట్రేట్ శైలిని పోలి వుంటుంది. క్రీ.శ. 1640లో వెలువడిన ‘కానాలో వివాహం’ అనే చిత్రం, క్రైస్తు చిత్రం ‘ది లాస్ట్ సప్పర్’ ని పోలి వుంటుంది. ఇది మొగలుల నీమ్ కలమ్ శైలిలో ఒకేరంగు సిరాతో వేసిన రేఖా చిత్రం. ఇలా కొద్ది కాలమే మొగలు చిత్రాల మాదిరి ఈ చిత్రకారులు చిత్రాలు వేసినా, కొంత కాలానికి వారు మళ్లీ వెనక్కి తమ శైలికి మారారు.
గోల్కొండ : కుతుబ్ షాహీ రాజులు గోల్కొండపై క్రీ.శ. 1512లో రాజ్యం నెలకొల్పారు. వీరి మూలాలు క్రీ.శ.15వ శతాబ్దపు తుర్కుమన్ పర్షియన్ల మూలాలు. వీరు పర్షియన్ చిత్రకారులని తమతో పాటు తెచ్చుకున్నారు. ఆ చిత్రకారులు తమతో పాటు అక్కడి రంగులు, రేఖా చిత్రాలు గీసే కుంచెలు తెచ్చుకున్నారు. ఈ గోల్కొండ ఆస్థాన చిత్రం చూస్తే ఇరాన్ సఫావిద్, మొగల్, బీజాపూర్ చిత్ర పరంపరల సంకలనం అనిపిస్తుంది. ఇక్కడ వెలువడే చిత్రాలలో అందుకనే వైవిధ్యమే కాదు, ఒక దానితో ఒకటి పోలిక లేనట్టు అనిపిస్తాయి. క్రీ.శ. 1580 నుండి 1612 వరకు రాజ్యం చేసిన మొహమద్ కులీకుతుబ్‌షా సమయంలోని ‘కుల్లియత్’ చ్తిరాల సంపుటి, ఉర్దూ కవితల మీద ఆధారపడి వుంది. ఇది బుఖారా శైలి అలంకరణతో చిత్రించబడింది. ఇది ఇక్కడి మొదటి దశ చిత్రం. బుఖారా ఉజెబికిస్తాన్‌లోని ఒక పట్టణం, తూర్పు పడమర మధ్య వ్యాపార మజిలీ, ఇస్లామ్ ప్రపంచం సంస్కృతిలో ముఖ్యస్థానం వహించింది. తరువాత మార్పులు వచ్చి పెద్ద చిత్రాలు, కవితలాంటి చిత్రాలు కూడా వెలువడ్డాయి. క్రీ.శ. 1626 -72 వరకు రాజ్యం చేసిన అబ్దుల్లా కుతుబ్‌షా కళలకు మద్దతు ఇచ్చాడు. క్రీ.శ. 1635 కల్లా మొగలులు ఆక్రమించి, అతని అధికారం నొక్కేశారు. ఔరంగజేబు వీరి చిత్రాల సంపుటాలను ధ్వంసం చేశాక, ఇక్కడి చిత్రకళ అధోముఖం పట్టింది. వ్యక్తిగతంగా కొద్దిమంది మద్దతు ఇచ్చి చిత్రాలు వేయించారు. కొంతమంది కళాకారులు రాజస్థాన్ రాయబారులతో పాటు రాజస్థాన్ వెళ్లిపోయారు.
హైదరాబాద్ : నిజామ్ అల్ ముల్క్ ఒకటవ ఆసఫ్‌జా కార్యనిర్వాహకుడు. మొగల్ రాజుల అధికారిగా ఈ ప్రాంతంలో నియమింపబడ్డాడు. మొగలుల నిరంకుశ పాలనతో అసంతృప్తి చెంది, తిరుగుబాటు చేసి క్రీ.శ. 1724లో హైదరాబాద్ రాజధానిగా అసాఫియా రాజ్యం నెలకొల్పి క్రీ.శ. 1748 వరకు పాలించాడు. ఈ నిజాముల ఆస్థానంలోని హిందూ ముస్లింలందరూ కళలకు మద్దతు ఇచ్చారు. ఇక్కడ సంగీత ప్రియుల కోసంఎన్నో రాగమాల చిత్రాలు చిత్రించబడ్డాయి. క్రీ.శ. 1775, హైదరాబాద్‌లో చిత్రించిన ‘కకుభరాగిణి’ చిత్రం భారత్ కళా భవన్‌లో వుంది. కశ్యపుడు రాసిన రాగమాల విరణ ప్రకారం పచ్చని వస్త్రాలు కట్టిన నాజూకుగా, పొడవుగా వున్న స్త్రీ, చక్కటి శిరోజాలతో వసంతానికి గుర్తులా నిలుచుని వుండగా, ఆ పొదలు, ప్రకృతి వసంతంతో విరబూయగా, కోయిల అక్కడ కూసినప్పుడు ఒంటరితనంతో దిగులు పడుతుంది. రెండు పూలమాలలు పట్టుకుని నిల్చున్న ఆమె కోయిలవైపు వెనుతిరిగి చూస్తూ ఏమీ చేతకాక దిగులుగా నిలుచుని ఉంటుంది. ఈ రాగమాల చిత్రాలలో స్త్రీలను ఆ రాగానికి ప్రతిరూపంగానో, ఆ రాగానికి అర్ధం, వ్యాఖ్యానం చెపుతున్న స్త్రీగానో చిత్రిస్తారు. అంతేకాదు, ఆమె చుట్టుపక్కల చిత్రించే ప్రకృతీ అందంగా చిత్రిస్తారు. ఆ చిత్రాల రంగులు, వాతావరణం, ఒక కలలోని దృశ్యంలా అద్భుత కథల వివరణలా చిత్రిస్తారు. చల్లటి వెన్నెల, కొండకొలను చిత్రించిన రాగాల భావనను మోస్తుంటాయి. ఇలా సాగిన దక్కన్ చిత్రానికి రాబోయే కాలం రాజకీయ పరిస్థితులు అడ్డుకట్ట వేశాయి.
– డా||యమ్.బాలామణి, 8106713356