నేడు డీసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2024-26 బ్యాచ్‌ ప్రవేశాల కోసం డీసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు డీసెట్‌ కన్వీనర్‌, మోడల్‌ స్కూల్‌ అదనపు సంచాలకులు ఎస్‌ శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీసెట్‌కు 17,655 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 15,150 (85.96 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. తెలుగు మాధ్యమంకు 9,698 మంది దరఖాస్తు చేస్తే, 8,189 (84.44 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంకు 7,957 మంది దరఖాస్తు చేయగా, 6,961 (87.48 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. డీసెట్‌ మెరిట్‌ జాబితా, ర్యాంకు కార్డులను గురువారం ప్రకటిస్తామని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.