– ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచన
– గతాన్ని గుర్తు చేసుకోండి
– బీజేపీ షరతులకు తాము తలొగ్గలేదని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘రాష్ట్ర ప్రజలారా.. మీకు కరెంటు కావాలా..? కాంగ్రెస్ కావాలా…? తేల్చుకోండి…’ అంటూ రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆ పార్టీ పాలనలోని రోజులను గుర్తు చేసుకోవాలంటూ ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ విధానమేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ చిత్తు కాగితంతో సమానమని కొట్టిపారేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో చెరువులను బాగు చేసుకున్నాం.. రైతు బంధు అమలు చేసుకున్నాం.. 24 గంటలపాటు కరెంటును సరఫరా చేయగలుగుతున్నామని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేండ్ల క్రితం నాటి సమస్యలు మళ్లీ వస్తాయని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రైతులను బిచ్చగాళ్లతో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతులకు కేవలం మూడు గంటల కరెంటు చాలంటూ ఆయన మాట్లాడుతున్నారనీ, అసలు వ్యవసాయా నికి ఎన్ని హెచ్‌పీ సామర్థ్యంగల మోటార్లను వాడాలో తెలుసా..? అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా మూడు నాలుగంటలకు మించి విద్యుత్ సరఫరా అయిందా..? అని ప్రశ్నించారు. కరెంటు కోసం అర్థరాత్రిలోనూ రైతులు జాగారాలు చేసిన రోజులున్నాయని తెలిపారు. అప్పట్లో రైతన్నలకు క్రాఫ్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని అన్నారు. ప్రతీ నీటి బొట్టునూ ఒడిసిపట్టి.. కాలంతో పోటీ పడి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేల కోట్లను ఖర్చు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.. కేంద్రంలోని బీజేపీ… మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ మెడపై కత్తిపెట్టినా తమ ప్రభుత్వం తలొగ్గలేదని కేటీఆర్ తెలిపారు. ఆ రకంగా రూ.30 వేల కోట్లను వదులుకున్నాం తప్పితే రైతులకు అన్యాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని చివరికి ప్రధాని మోడీ సైతం కాపీ కొట్టారని చెప్పారు.