కలిసి నిర్ణ‌యించుకోండి

Decide togetherఈరోజుల్లో భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచేది. ఇద్దరూ కలిసి సంపాదించినప్పుడు ఇద్దరూ కలిసి ఖర్చుపెట్టడం కూడా తెలిసుండాలి. లేకపోతే ఒకరి డబ్బులు ఇంటి కోసం ఖర్చు పెట్టి మరొకరివి సేవింగ్‌ చేసుకోవాలి. అప్పుడే వారి సంసారం హాయిగా సాగిపోతుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అంతేగానీ సంపాదించింది ఎవరి ఖర్చు వాళ్లు చేసుకుంటే ఉపయోగం వుండదు. అలాంటి ఓ సమస్యతోనే ఐద్వా అదాలత్‌కు వచ్చింది పద్మ. మరి ఆమె సమస్య పరిష్కారం అయ్యిందో లేదో మీరే చదవండి…
పద్మకు 28 ఏండ్లు ఉంటాయి. భర్త సుధాకర్‌. వీరి పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ఇద్దరూ ఉద్యోగస్తులు. తల్లిదండ్రులు ఊరిలో ఉంటారు. వీరు ఉద్యోగరీత్యా సిటీలో ఉంటున్నారు. సుధాకర్‌ ప్రవర్తన పద్మకు విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ‘ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నాం కాబట్టి ఇంటి కిరాయి ఇద్దరం కలిసి చెరిసగం కట్టాలి’ అంటాడు. సరుకులు మాత్రం తీసుకొస్తాడు. కానీ పద్మను మాత్రం ‘నువ్వు నా కంటే ఎక్కువ తింటున్నావు, సరుకులు మధ్యలో అయిపోతే నువ్వే తీసుకురావాలి’ అంటాడు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ‘ఇక ఎప్పుడు పోతారు’ అని అడుగుతాడు. సుధాకర్‌ తల్లిదండ్రులు వచ్చినా పరిస్థితి అంతే. ఇంట్లో బియ్యం, సరుకులు అయిపోతున్నాయి, మీరు ఊరికి వెళ్ళిపోండి’ అని పంపించేస్తాడు.
కన్న తల్లిదండ్రులనే ఇలా పంపించేస్తే ఇక తన తల్లిదండ్రులు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని పద్మ ఆందోళన చెందేది. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్లినా ‘నీ డబ్బు నువ్వు ఖర్చు చేసుకో, నావి నేను చూసుకుంటాను’ అంటాడు. సినిమాకు వెళ్లినా సుధాకర్‌ టికెట్‌ తీసుకుంటే కూల్‌డ్రింక్స్‌ పద్మ తీసుకురావాలి. పోనీ ‘మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను’ అని పద్మ అన్నా ఆమె మాట వినడు. ఒక రోజు ఇద్దరూ కలిసి హౌటల్‌కు వెళ్లారు. అక్కడ సుధాకర్‌ కంటే పద్మ అదనంగా చికెన్‌ తెప్పించుకుంది. దాంతో ‘దానికి బిల్లు నేను కట్టను’ అని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇలా తన పిసినారి భర్త వింత ప్రవర్తనను భరించలేక పోయింది పద్మ. రేపు పిల్లలు పుడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయంతో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె ఐద్వా అదాలత్‌కు వచ్చి తన సమస్య చెబుతూ ‘ఇంటి ఖర్చులు, కిరాయి, ఎవరైనా బంధువులు వచ్చినా, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా, ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వచ్చినా ఆ ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. సుధాకర్‌కు వచ్చే జీతం మొత్తం సేవింగ్స్‌ చేద్దాం అంటే అతను ఒప్పుకోవడం లేదు. పోనీ నా జీతం అయినా సేవింగ్స్‌ చేసి సుధాకర్‌ డబ్బులు ఖర్చు పెడదామంటే దానికీ ఒప్పుకోడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో బయటకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ‘నీ డబ్బులు నువ్వే ఇవ్వు’ అని ఆయన అన్నప్పుడు అక్కడ పని చేసే వాళ్లు నావైపు విచిత్రంగా చూస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పద్ధతి సరైనది కాదని ఆయనతో ఎలాగైనా మీరే మాట్లాడి నా సంసారాన్ని నిలబెట్టండీ’ అంటూ బాధగా చెప్పింది.
సుధాకర్‌ను పిలిచి మాట్లాడితే ‘ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి అన్ని ఖర్చుల్లో సగం పెట్టుకొమ్మని చెబుతున్నాను. అందులో తప్పేముంది. ఇద్దరు స్నేహితులు కలిసి బయటకు వెళ్ళినపుడు ఇద్దరూ కలిసి ఖర్చు చేస్తారు. అలాంటిది మేమిద్దరం కలిసి జీవితాంతం జీవించాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు సగం ఖర్చులు ఆమె పెట్టుకుంటే తప్పేముంది. ఇంట్లో ఇద్దరం ఉంటున్నాం కనుక ఇద్దరం కిరాయి కట్టాలి. అసలు ఇందులో తప్పేముందో నాకేం అర్థం కావట్లేదు’ అంటూ వాదించాడు.
దానికి మేము ‘మీరిద్దరూ స్నేహితులు కాదు, భార్యాభర్తలు. ముందు అది గుర్తించండి. స్నేహితులు వేరూ భార్యాభర్తలు వేరూ. స్నేహితులు ఈరోజు ఉంటే రోజు మీతో ఉండకపోవచ్చు. కానీ మీ భార్య మీతో జీవితాంతం కలిసి బతకాలి. రేపు మీకు పిల్లలు పుడతారు. అప్పుడు ఆమె కొన్ని రోజులు ఉద్యోగం చేయలేకపోవచ్చు. అప్పుడు మరి పిల్లల ఖర్చులు ఎలా పంచుకుంటారు. మీ ఆలోచన సరైనది కాదు. మీరు దీన్ని జాగ్రత్తా అనుకుంటున్నారు. కానీ మీ ప్రవర్తనతో మీరు మీ జీవితంలో చాలా నష్టపోతున్నారు. సరుకులు అయిపోతున్నాయని కన్న తల్లిదండ్రులను కూడా ఇంటికి రానియ్యకుండా ఆపేస్తున్నారు. ఇదంతా మీకు మంచిది కాదు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే పద్మ మీతో జీవితాంతం కలిసి బతకడం కష్టం.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ వచ్చే డబ్బును జాగ్రత్తగా కలిసి ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఇలా ఎవరిది వారు సగం సగం పంచుకుంటే మీది భార్యాభర్తల సంబంధం ఎలా అవుతుంది? చూసే వాళ్లు మీ గురించి ఏమనుకుంటారో ఆలోచించండి. ఇద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోండి. పద్మ డబ్బు ఇంటి ఖర్చులకు ఉపయోగించి మీ డబ్బును సేవింగ్స్‌ చేయడమో లేదా మీ డబ్బు ఖర్చు పెట్టి ఆమె డబ్బు సేవింగ్స్‌ కోసం ఉపయోగిస్తే మంచిది’ అన్నాం. దానికి అతని ఒప్పుకోలేదు.
‘ఆమె సేవింగ్‌ చేసి ఇచ్చినా ఆమె నుండి నేను తీసుకోలేను. అది నాకు ఇష్టం లేదు’ ఇంకో మార్గం ఏమైనా చెప్పండి అన్నాడు. దానికి మేము ‘ముందు మీ ఆలోచనా పద్దతి మార్చుకోండి. పద్మ ప్రతి నెలా తన జీతంలో కొంత మీకు ఇస్తుంది. ఇంట్లోకి సరుకులు, కిరాయి, బంధువులు వచ్చినా, మీరు బయటకు వెళ్ళినా మొత్తం ఖర్చులు ఇందులో నుండే ఖర్చు చెయ్యండి. ఏమైనా మిగిలితే వచ్చే నెలకు ఉపయోగించుకోండి. ప్రతి దానికి లెక్కలు రాసుకోండి. అలాగే మీరిద్దరూ ఎప్పుడైనా బయటకు వెళితే ఆ బిల్లు మొత్తం ఒకసారి మీరు కడితే మరోసారి పద్మ కడుతుంది. అంతేకానీ అక్కడే కూర్చొని సగం సగం అంటూ లెక్కలు వేయడం మానుకోండి. ముందు పిల్లల గురించి ఆలోచించండి. ఇద్దరూ మిగిలిన డబ్బులు సేవింగ్‌ చేయండి. అది కూడా ఇద్దరూ చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండ కూడదు. సంపాదించింది కలిసి ఖర్చు చేయడం, జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోండి’ అని చెప్పి పంపించాము.
వాళ్లిద్దరూ మళ్లీ ఆరు నెలల తర్వాత ఐద్వా అదాలత్‌కు వచ్చారు. ఇప్పుడు పద్మకు మూడో నెల. ప్రస్తుతం సుధాకర్‌లో బాగా మార్పు వచ్చిందనీ, అంతకు ముందులా ప్రవర్తించడం లేదని సంతోషంగా చెప్పింది.
– వై వరలక్ష్మి, 9948794051