తెలుగు కవిత్వంలో ప్రత్యేక శైలి తనదైన గొంతుక నిర్మలరాణి తోట సొంతం. తన తాజా కవితా సంపుటి ‘అద్దం నా చిరునామా కాదు’. కవిత్వం జీవితం నుండి పుడుతుంది. జీవించే పరిస్థితుల నేపథ్యంలో పుడుతుంది… కవి తాహతుకు మించి ఒక్క వాక్యాన్నీ రాయలేడు. ఇక్కడ తాహతు అంటే ఆస్తి ఐశ్వర్యాలు కానే కాదు… తను చూసిన విన్న అనుభవించిన వ్యసనాల నుండే కవిత్వం పుడుతుంది. …అది స్వీయ అవ్వొచ్చు సహా అవ్వొచ్చు. ఇందులో ఇంకొక విషయాన్ని చెబితే ఆడవాళ్ళు స్వీయ సహాను మించి ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఆడదాని అత్మని కూడా రాస్తారు. ఇది తప్పకుండా అస్తిత్వ చిరునామానే. రవి కాంచలేనిది కవి కాంచుతాడంటారు. రవి కవి కాంచలేని ఎన్నో రకాల సంఘర్షణలను స్త్రీ చూస్తుంది రాస్తుంది. అలాంటి కవిత్వమే నిర్మలా రాణి తోటది.
1860 దశకం నుండి ఇప్పటివరకు కవిత్వం పేరుతో ఎన్నో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నిట్లో కవిత్వానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదనే చెప్పాలి. సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో కవిత్వం పాత్ర మామూలుది కాదు. అయితే కవిత్వం లాగానే ఆడవారు కూడా వారి అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా హోరెత్తుతారు, ప్రతి ఘటిస్తారు. పరమార్ధం ఇది అని ఎలుగెత్తి చాటుతారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది ఈ కవయిత్రి. కొందరంటారు ఉద్వేగం నుండి పుట్టిందే కవిత్వం అని. మరొకొందరంటారు అసలు కవిత్వం బాధలో ఉన్నప్పుడు రాదు అని. నిజం చెప్పాలంటే అవి రెండూ తప్పుడు అభిప్రాయాలే. పీడనను వ్యతిరేకించేది కవిత్వం. అదొక్కటేనా…. బాధను వ్యక్తం చేసేది, బాధనుండి ఉపశమనం కలిగించేది కూడా కవిత్వమే!
‘అద్దం నా చిరునామా కాదు’ అనగానే నాకు ఓల్గా గారి రాజకీయ కథలు గుర్తుకు వచ్చాయి. అద్దం అబద్దం చెప్పదు అని నేనెప్పుడో రాసుకున్న కవిత కూడా గుర్తుకు వచ్చింది. నాకు ఈ శీర్షికలో పూర్తి విరుద్ధమైన అర్ధాలు ఉన్నాయని అనిపించినా తరచి చూస్తే ఐరనీ కవిత్వంలో ఉంటుంది, ఇమాజినరీ కవిత్వంలో ఉంటుంది. నిర్మలకు నాకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా అలాంటివే అనిపించింది.
సమాజాన్ని పట్టి చూపుతూ, సామాజిక చైతన్యాన్ని గమనిస్తూ సెటైరికల్ పోయెట్రీ రాస్తున్న ఈమె నిజంగా మంచి కవి. ఇదేమీ నా ఒప్పుదల కాదు. అవిడ ఇంతకుముందు వచ్చిన రెండు కవితా సంపుటాలు కూడా అదే చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ పుస్తకం ఋజువు చేస్తుంది. కొత్తగా చెప్పడానికి అసలు కవిత్వంలో ఏముంటుంది అనే పెద్ద మనుషులు ఉంటారు.
అద్దంలో చూసుకోవడం అలవాటైన రోజులివి. అద్దం లేకపోతే కాసేపైనా చేయి కాలు ఆడని ఆడవాళ్ళు ఉన్నారు.
కాటుక చెరిగిందనో, కుంకుమ నసిగింది అనో, పౌడర్ తగ్గింది అనో… మేకప్ మలిగిందనో అద్దాన్ని చూసుకునే రోజుల్లో ఉన్నాం…
చీకటే చిరునామాగా/ పగలే అద్దంగా బ్రతికే ఎందరో మనుషులకు ఈ పుస్తకం అంకితం ఇవ్వొచ్చు.
‘నేల మీద సూరీళ్లు’
స్విచ్ నొక్కగానే వెలుగు నవ్వాలి/ లేదంటే చిరాకునేలమీద/ పొగలు గక్కే మండుటెండల్లో కడసరాలు దాటి పోలెక్కే అరికాళ్ళు ఎండ ధాటికి, ఎండల్లో తిరిగే చలిమరల ధాటికి కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు
సూరీడు సర్రుమన్న/ వాన నీరు జోరున కురిసినా/ చలి కాలంగా ఉన్న/ ఏ కాలమైనా విద్యుత్తు సరఫరా అనివార్యం../ ప్రతి ఇంటిని వెలిగించే కరెంటు తీగలు ఆ అన్నలు../ ఆ అన్నల నిస్వార్థ జీవనాన్ని కళ్ళకు కట్టారు.. నిర్మల.
”అమ్మనై పుట్టినందుకు” ఇల్లంతా తీపి కబురని సంతోషంలో తేలిపోతుంటే/ నాసికను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాసనల్లో/ నా నిద్రనెత్తుకెళ్ళిన రాత్రుల్లో/ తెల్లవార్లూ నీ కడుపు నింపే పాలధారనాయ్యా…”
ఈ శీర్షిక నన్ను చాలా ఏడిపించింది… నేనిప్పుడు గుర్తింప బడేది కేవలం తల్లిగానే .. ఇంకే అస్తిత్వం నాకు లేదు… నాలాగే చాలా మంది తల్లులు ఉంటారేమో. బిడ్డ పుట్టిన గిట్టినా అమ్మతనం ఎక్కడికిపోదు కదా. నిర్మలా నీ వాక్యాలు కూడా అంతే ప్రతి అమ్మకు అంకితం అవుతాయి.
చాలారోజుల తరువాత మంచి పరిమళ భరితమైన కవిత్వానికి పాఠకురాలి నయ్యాను. మంచి మంచి పొయిటిక్ వాక్యాలు ఉన్నాయి ఈ కవిత్వంలో.
”నిద్రిస్తున్న ఆశకు ఉరివేస్తావెందుకు”
”కఫన్ కప్పిన ప్రతి ముఖాన్ని భయం భయంగా పోల్చుకుంటున్న పసివాళ్లు”
”యు టర్న్ కాదు స్నేక్ టర్నులు చేస్తే కానీ దొరకని గమ్యస్థానాలు”
”దేశాన్ని నడపడం అంటే సిల్కు చొక్కాలేసుకున్న/ రాజ ప్రసాదాల గద్దెలకు గంధాలు పూయడం కాదు…”
”ఓ వైపు వ్యాధి నిరంకుశత్వమో/ ఆంకుశంలా పొడుస్తుంటే/ పల్స్ మీటర్లో కొట్టుకుంటున్న పంచ ప్రాణాలు” (ఈ వాక్యాలు చదవగానే నా బిడ్డ కళ్ళల్లోకి వచ్చి కన్నీరు బుగ్గలపై నాట్యం చేసింది…??)
”తెలుపును దాచేస్తు నల్లకోట్లు”
”పంచుకోవడం కంటే గొప్పతనం ఏముంటుంది బ్రతుకులో”
”ఆకాశం మబ్బు పట్టినప్పుడల్ల/ ఒక్క నిఖార్సైన భుజం కోసం/ తడుముకోవడం నిజం!”
మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్య చూపుల్లో చిక్కుకున్న ప్రశ్నలు ఎన్నని?
”తీరపు కంచెలతో/ అడుగులకు సంకెళ్లు వేసి సముద్రాన్ని చేయొద్దు/ నన్ను ప్రవహించనీయండి/ ”రాలిపోవడం నాకు కొత్త కాదు” ఇలా ఎన్నో…
కవిత్వానికి నిర్వచనం నాకు పెద్దగా తెలీదు కానీ కవికి నిర్వచనంగా నిర్మలా రాణి తోటను ఉదాహరణగా చెప్పగలను… తెలుపంటే నలుపని అమెకెప్పుడు తెలీదు అంటున్న ఈ కవికి ప్రేమకి రూపం కవిత్వం అని మాత్రం బాగా తెలుసు అందుకేనేమో.. తన ప్రతి అనుభూతిని అనుభవాన్ని ఇందులో ప్రతిఫలించేలా చేసింది.
ఎన్ని పుస్తకాలు వచ్చినా కవిత్వాన్ని మోయలేని రోజుల్లో ఉన్నాం…. కానీ అద్దం నా చిరునామా కాదని చెబుతూ కవిత్వానికి చిరునామాగా మలిచిన ఈ కవికి అభినందనలు.
-సుభాషిణి తోట, 9502818774