– డిసెంబర్‌లో సగం పతనం
న్యూఢిల్లీ : భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తగ్గుదల చోటు చేసుకుంది. 2023 డిసెంబర్‌లో కేవలం 2.25 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 4.12 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. 2023 నవంబర్‌లోనూ 4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఎఫ్‌డీఐలను ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో ఈక్విటీ, రుణాలు, హామీలు. ఈక్విటీ కమిట్‌మెంట్‌లు డిసెంబర్ 2022లో 1.38 బిలియన్లుగా ఉండగా.. 2023 డిసెంబర్‌లో 646.7 మిలియన్లకు క్షీణించాయి. ఇది నవంబర్ 2023లో నమోదైన 1.09 బిలియన్ల కంటే కూడా గణనీయంగా తగ్గడం గమనార్హం.
గతేడాది డిసెంబర్‌లో రుణ హామీలు 625.91 మిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ విభాగంలో 2022 డిసెంబర్‌లో 1.15 బిలియన్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. 2023 డిసెంబర్‌లో విదేశీ గ్యారంటీలు 978.19 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022 డిసెంబర్‌లో 1.58 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. భారత ఎఫ్‌డీఐల్లో తగ్గుదల ఉందని ఇటీవల ఓ సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంగీకరించారు. వైబ్రెంట్ గుజరాత్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయంలో భారత్ ఎఫ్‌డీఐల ఆకర్షణలో దూసుకుపోతుందన్నారు. దీనికి భిన్నంగా గణంకాలు నమోదు కావడం గమనార్హం.