తగ్గుతున్న వ్యవసాయ ఎగుమతులు

Declining agricultural exports– వరుసగా మూడో ఏడూ అదే పరిస్థితి
న్యూఢిల్లీ : దేశం నుంచి వ్యవసాయ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. వరుసగా మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ పరిణామం రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశం నుంచి తాజా పండ్ల ఎగుమతి పలు దేశాలకు విస్తరించింది. గతంలో 102 దేశాలకు పండ్లు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు 111 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2020-21లో భారత వ్యవసాయ ఎగుమతుల వృద్ధి రేటు 17% ఉండగా 2022-23లో 6%కి పడిపోయింది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) ఎగుమతులు సైతం 24% నుండి 11%కి తగ్గిపోయాయి. అయితే 2022-23లో అపెడా ఉత్పత్తుల ఎగుమతులు 26.7 బిలియన్‌ డాలర్లకు చేరాయని, అవి 200 దేశాలకు వెళుతున్నాయని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ తెలిపింది. అపెడా ఉత్పత్తుల్లో ఆహార ధాన్యాలు (50%), జంతు ఉత్పత్తులు (15%), ప్రాసెస్‌ చేసిన పండ్లు, కూరగాయలు (8%), తాజా పండ్లు, కూరగాయలు (6%) ఉన్నాయి. అయితే అపెడా ఎగమతుల విలువ 2022 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో 19.68 బిలియన్‌ డాలర్లు ఉండగా 2023 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో 17.88 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అదే సమయంలో మొత్తం వ్యవసాయ ఎగుమతుల విలువ కూడా 38.63 బిలియన్‌ డాలర్ల నుండి 34.99 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.