ప్రజాసేవకే అంకితం

ప్రజాసేవకే అంకితం– గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజాగొంతుకవుతారు: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -చిట్యాల టౌన్‌
నిత్యం ప్రజా ఉద్యమాలతో ప్రజాసేవకే అంకితమై పనిచేస్తున్న భువనగిరి నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజాగొంతుకై పనిచేస్తారని చెప్పారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని స్థానిక మేకల లింగయ్య భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించిన బీజేపీ.. మళ్లీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తామంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా మోడీ ప్రభుత్వం ఆలయాలు, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పీఠాధిపతులను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో ఉండి అనునిత్యం ప్రజాసేవకే అంకితమై ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను ప్రజలు ఆదరించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న వ్యక్తులు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటూ పార్లమెంట్లో ఏనాడూ ప్రజాసమస్యలను ప్రస్తావించలేదని గుర్తుచేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించినట్లయితే పార్లమెంట్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు జిట్టా నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజన, శీలా రాజయ్య, బొబ్బలి సుధాకర్‌ రెడ్డి, లడే రాములు తదితరులు పాల్గొన్నారు.