కేబినెట్ నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి..

– మూడు వాయిదాల డీఏ ప్రకటించాలి
 – జీఓ 317 బాధితులందరికీ న్యాయం చేయాలి
– పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి: టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ – భువనగిరి
ఐదు వాయిదాల కరువు భత్యం(డిఎ) పెండింగ్ లో ఉండగా ప్రస్తుతం ఒక్క వాయిదాని మాత్రమే విడుదల చేయడం, జిఒ 317 సమస్యలపై దాటవేత వైఖరి పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్రంగా నిరసిస్తున్నారని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు మిర్యాల దామోదర్, ముక్కెర్ల యాదయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో బకాయి పడిన మూడు వాయిదాల డిఎ విడుదల చేస్తామన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరిస్తామని, జిఒ 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థం చేసుకుని గత పదినెలలుగా ప్రభుత్వంపై వత్తిడి చేయకుండా ఓపిక పట్టామన్నారు. సగం మందికైనా నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నందుకు సంతోషించామన్నారు. జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినందున సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశించినవారికి కమిటీ సిఫార్సులు తీవ్ర నిరాశను కలిగించాయన్నారు. భార్యాభర్తలు, ఆరోగ్య కారణాలతో బదిలీలకు జిఓలోనే అవకాశం ఉన్నదని, స్థానికత కోల్పోయిన వారి గురించి నిర్ణయం చేయకపోతే కమిటీ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారన్నారు. సిపిఎస్ రద్దు గురించి ఊసే లేదు. రెండేళ్ళుగా వేలాది బిల్లులు క్లియర్ కావటం లేదన్నారు. వినిమయ ధరల సూచీకి అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించబడుతుంది. గత కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఈ ఆనవాయితీని పాటించటం లేదన్నారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా పండుగలప్పుడు కానుకలుగా ఇస్తున్నట్లు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మూడు వాయిదాలు బకాయి పడితే ఈ ప్రభుత్వం వచ్చాక మరో రెండు వాయిదాలు వచ్చి చేరాయి. కనీసం రెండు వాయిదాల డిఎ అయినా ఇప్పుడు ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో కేవలం ఒక్క వాయిదా డిఎ మాత్రమే విడుదల చేయటంతో ఉపాధ్యాయ,ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ పెడుతూనే ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన డిఎలకే ఆర్థిక పరిస్థితి ఆటంకమౌతుందా అని యుయస్పీసి ప్రశ్నిస్తున్నదన్నారు. డిఎతోపాటు జిఒ 317 సమస్యపై  రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలన్నారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి సమస్యలన్నింటినీ కాలయాపన లేకుండా పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ  డిమాండ్ చేస్తుందన్నారు.