కార్మిక వ్యతిరేక, మతోన్మాద బీజేపీని ఓడించండి

కార్మిక వ్యతిరేక, మతోన్మాద బీజేపీని ఓడించండి– భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించండి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-జనగామ
కార్మిక వ్యతిరేక, మతోన్మాద బీజేపీని ఓడించి భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించేందుకు కార్మిక వర్గం సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ‘పార్లమెంట్‌ ఎన్నికలు-కార్మిక వర్గం కర్తవ్యం’ అంశంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు కార్మికులకు, ఉద్యోగులకు ఎంతో కీలకమైనవని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని, కార్మిక హక్కులను కాలరాసిందని విమర్శించారు. మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గ ఐక్యతకు భంగం చేస్తూ యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరించిన విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతన హక్కులు అమలుకు నోచుకోలేదని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారం మోపిందని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను యాజమాన్యాలకి అనుకూలంగా సవరణలు చేయడం సిగ్గుచేటన్నారు. సీటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ మాట్లాడుతూ.. పదేండ్ల బీజేపీ పాలనలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ మోసం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వారికి కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సుంచు విజేందర్‌, కోడెపాక యాకయ్య, చిట్యాల సోమన్న, అన్నేబోయిన రాజు, జిల్లా కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.