ప్రజా వ్యతిరేక బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించండి

– రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్‌
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబింస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో (మేలుకో) తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్‌) సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం చేపట్టిన బస్సుయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా గడియారం సెంటర్‌ వరకు సాగింది. అక్కడున్న జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి, నియంతృత్వంతో దోపిడీ చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సీపీఐ(ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ చలపతిరావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలు అభ్యర్థులను నిలదీయాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడని, రైతు రుణమాఫీ, దళిత బంధు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పంటల బీమా, ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు, రూ.15 లక్షల నల్లధనం, తదితర అంశాలపై పాలకులను నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సలహాదారు, ప్రొ. వినాయక్‌ రెడ్డి, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్‌ రెడ్డి, సభ్యులు ఎం. హన్మేశ్‌, టీఎస్డీఎఫ్‌ కో కన్వీనర్‌ నైనాల గోవర్ధన్‌, ప్రదీప్‌, రాష్ట్ర నాయకులు రాజ్‌ కుమార్‌, ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ విద్యార్థి సంఘం నాయకులు ఇందూరు సాగర్‌, జిల్లా కార్యదర్శి పోలె పవన్‌, జిల్లా అధ్యక్షులు బొంగరాల నర్సింహ, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.