బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించండి

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రం బీజేపీ, రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌ పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం చైతన్య నగర్‌లో 7, 8 వార్డుల సీపీఐ(ఎం) శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్తయ్య పాల్గొని మాట్లాడారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి కార్పొరేట్లకు గులాం గిరి చేస్తూ పేదల నడ్డి విరిచిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన హామీలు గహలక్ష్మి, దళిత బంధు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు తప్ప అర్హులకు అందడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్‌ వేయడం పరీక్షలు సరిగా నిర్వహించక రద్దు చేయడం తప్ప ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది లేదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు కలిసొచ్చే శక్తులతో కలిసి వచ్చే శాసనసభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని తెలిపారు. సీపీఐ(ఎం) 7,8 వార్డుల శాఖ కార్యదర్శి మారగోని నగేష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో శాఖా సభ్యులు ఎస్కే .మహబూబ్‌ అలీ, చింతల శోభన్‌, మారేపల్లి సత్తయ్య, ఓర్సు వెంకటేశ్వర్లు, మారగోని యాదయ్య, శివ రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.