పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించండి– వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలి
– వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించి, వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో వ్యకాస జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగింది. అనంతరం వెంకట్‌ మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు, ప్రజలను చైతన్యం చేయడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ 1 వరకు సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే పార్టీ అనే నినాదంతో హిట్లర్‌ విధానాలను మోడీ అమలు చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. వామపక్షాల మద్దతుతో 2005లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికిి బడ్జెట్లో నిధులు 4శాతం కేటాయిస్తే.. మోడీ ప్రభుత్వం 1.5శాతానికి తగ్గించిందని తెలిపారు. నిధుల లేమి, యంత్రాలతో పనులు చేయించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కరువైందన్నారు. వ్యవసాయ కార్మికులు తమ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం, జాతుల పేరుతో దేశంలోని ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. రాముని పేరుతో రాజకీయం చేస్తూ బీజేపీ నాయకులు బరితెగించి రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను జైలులో పెట్టడం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూతురు మీద కేసు పెట్టడం దారుణం అని అన్నారు.
రాష్ట్రంలో ఇండ్లు లేని వ్యవసాయ కార్మికులు గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేరళ ప్రభుత్వం మాదిరిగా రోజుకు రూ.600 కూలి, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, రవి నాయక్‌, సరోజన తదితరులు పాల్గొన్నారు.