మతతత్వ బీజేపీని ఓడించండి

Defeat communal BJP– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డిజి.నర్సింహారావు
నవతెలంగాణ-దుండిగల్‌
మతతత్వ బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డిజి.నర్సింహారావు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌లోని సుందరయ్య భవన్‌లో రెండ్రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల వాగ్దానాలను పక్కదోవ పట్టించడానికి మతం, ప్రాంతాలను వాడుకుంటూ రెండోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుందన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి అనేక వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికల ఎత్తుగడలో భాగంగా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ‘నా దేశం నా మట్టి’ అనే నినాదం చేస్తోందన్నారు. మణిపూర్‌లో కొద్ది నెలల నుంచి రెండు తెగల మధ్య అల్లర్లు జరుగుతుంటే ప్రధాని కనీసం ఒక్క స్టేట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. మణిపూర్‌ రావణకాష్టం లాగా తగలబడుతుంటే మోడీ విదేశీ పర్యటనలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌లో ఆదివాసులు నివసించే ప్రాంతంలో ఉన్న అపారమైన గనులను కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పటానికి వంద మంది గిరిజనుల ప్రాణాలను పనంగా పెట్టిందన్నారు.
డిజి నర్సింహారావు మాట్లాడుతూ.. లాభాల్లో నడుస్తున్న అనేక పబ్లిక్‌ సెక్టార్స్‌ ఓడ రేవులు, విమానయాన సంస్థలను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు అనుకూలంగా ఉన్న వారికి కారు చౌకగా కట్టబెట్టినట్టు చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు మోడీ ప్రభుత్వ హయాంలో మూడింతలు పెరగ్గా.. కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను 4 లేబర్‌ కోడ్లుగా మార్చి కార్మికులను రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యులు, మధ్యతరగతి వారు బతకలేని పరిస్థితి దాపురిస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేసి బీజేపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.