– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్
నవతెలంగాణ-చేవెళ్ల
దేశంలో మతోన్మాదం మనువాదాన్ని పెంచి పోషించే బీజేపీని ఓడించి లౌకికవాదాన్ని కాపాడే ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం చేవెళ్లలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి అధ్యక్షతన అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్ని,మాట్లాడుతూ భారత దేశంలో పదేండ్లుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. దేశంలో 400 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతుందని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును సదేశానికి తెచ్చి ప్రతీ భారతీయ కుటుంబంలో రూ.15 లక్షలు వారి వారి బ్యాంకు ఖాతాలో వేస్తామని హామీలిచ్చి, అమలు చేయడంలో విఫలమై య్యారని దుయ్యబట్టారు. దేశంలో మతోన్మాదాని పెంచి ప్రజలను విడగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తులు వేస్తుందనీ, ఆ ఎత్తులను కమ్యూనిస్టులు చిత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు జతకట్టి ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్‌ఎస్‌లను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను, బీజేపీ ప్రభుత్వం కాలరాస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రతిపక్షాలపై ఐటీ, సీబీఐ,ఈడీ కేసులతో బనాయించి ప్రశ్నించే గొంతులను నొక్కితోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఐ జిల్లా నాయకులు ప్రభులింగం, పుస్తకాల నర్సింగ్‌రావు, గోపాల్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, దత్తునాయక్, చందునాయక్, వడ్ల సత్యనారాయణ, పార్టీ చేవెళ్ల మండల కార్యదర్శి ఎం.సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎండీ. మక్బూల్, శంకర్‌పల్లి కార్యదర్శి సుధీర్, మొయినా బాద్ కార్యదర్శి శ్రీనివాస్, షాబాద్ కార్యదర్శి జంగయ్య, గండిపేట్ కార్యదర్శి బాబురావు, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు వడ్ల మంజుల, ఏఐటీయూసీ మండల నాయకులు శివ, శివయ్య, యాదగిరి, ఆనందం తదితరులు పాల్గొన్నారు.